పింఛను కావాలా..? | Should one invest in mutual fund retirement schemes? | Sakshi
Sakshi News home page

పింఛను కావాలా..?

Published Mon, Mar 14 2016 1:19 AM | Last Updated on Sun, Sep 3 2017 7:40 PM

పింఛను కావాలా..?

పింఛను కావాలా..?

ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగమంటే... పింఛనుతో కూడిన భరోసా! ఈ పెన్షన్ ఉంటుందనే ప్రభుత్వోద్యోగం కోసం ఏళ్లపాటు ఎడతెగని ప్రయత్నాలు చేసేవారు. మరిప్పుడు..? ఉద్యోగస్తులు మాత్రమే కాదు. ఎవరైనా పెన్షన్ తీసుకోవచ్చు. అది కూడా 58 ఏళ్లో, 60 ఏళ్లో దాటాక... అదికూడా రిటైరయ్యాక మాత్రమే కాదు. 45 ఏళ్లు దాటాక కూడా కావాలంటే పెన్షన్ తీసుకోవటానికి కొన్ని పథకాలున్నాయి. కాస్త ప్లానింగ్ ఉండి.. మొదటి నుంచీ పొదుపు పాటిస్తే... రిటైర్మెంట్ వయసు దాటాక జీతం కన్నా ఎక్కువ పెన్షన్ కూడా తీసుకోవచ్చు. అందుకు ఏఏ పథకాలు అందుబాటులో ఉన్నాయి? వాటి నిబంధనలేంటి? రాబడులెలా ఉంటాయి? అనే వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం...
 
ఈపీఎఫ్, పీపీఎఫ్‌లతో పాటు పలు మార్గాలు
పన్ను మినహాయింపులతో ఆకర్షణీయంగా ఎన్‌పీఎస్
బీమా పథకాలు, మ్యూచ్‌వల్ ఫండ్స్‌తోనూ పెన్షన్
మునుపటిలానే ఈపీఎఫ్‌కు పన్ను మినహాయింపులు

 
పెన్షన్ కోసం దేశంలో అందుబాటులో చాలా పథకాలున్నప్పటికీ...90 శాతం మందికి పైగా ఎంచుకుంటున్నవి మాత్రం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్),  నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్‌పీఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)లే. ఇవికాక బీమా పథకాలు, మ్యూచువల్ పెన్షన్ ఫండ్స్ కూడా పెన్షన్ అందిస్తుంటాయి. కానీ వీటిలో పెట్టుబడి పెట్టడానికి, వీటిపై వచ్చే రాబడులకు ఒకదానితో ఒకటి సంబంధం ఉండదు. కొన్ని పథకాల్లో వెనక్కి తీసుకునే మొత్తంపై పన్ను చెల్లించాల్సి వస్తే, కొన్ని పథకాలు పన్ను లేని ఆదాయాన్నిస్తాయి.
     
ఈపీఎఫ్, పీపీఎఫ్ నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై ఎలాంటి పన్నూ లేదు.
బీమా పింఛను పథకాల నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతానికే పన్ను మినహాయింపు వర్తిస్తుంది.
ఎన్‌పీఎస్ నుంచి తీసుకునే మొత్తంపై మొన్నటిదాకా పన్ను చెల్లించాల్సి వచ్చేది. ఈపీఎఫ్‌పై అసలు పన్ను లేకపోవడం, ఎన్‌పీఎస్‌కు పూర్తిగా పన్ను చెల్లించాల్సి రావటంతో... ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ మొన్నటి బడ్జెట్‌లో ఎన్‌పీఎస్ నుంచి తీసుకునే మొత్తంలో 40 శాతానికి పన్ను మినహాయింపు ఇచ్చారు. మరోవంక ఈపీఎఫ్‌కు కూడా మొత్తానికి మినహాయింపును తీసేసి 40%కే మినహాయింపు వర్తిస్తుందని చెప్పారు. దీనిపై ఉద్యోగ కార్మిక సంఘాల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో వెనక్కి తగ్గి... ఈ ప్రతిపాదనను విరమించుకున్నారు.
 
ఈపీఎఫ్‌లో పాత నిబంధనలే..
ఉద్యోగులందరికీ ఈపీఎఫ్ అంటే తెలుసు. 20 కంటే ఎక్కువ మంది ఉద్యోగులున్న ప్రతి సంస్థ విధిగా పీఎఫ్ పథకాన్ని అమలు చేయాలి. దీని ప్రకారం జీతంలో ( బేసిక్ శాలరీ + డీఏ) 12 శాతాన్ని ఉద్యోగి చెల్లిస్తే... మరో 12 శాతాన్ని సంస్థ జమచేయాలి. సంస్థ జమచేసే మొత్తంలో 8.3 శాతం ఎంప్లాయీస్ పెన్షన్ స్కీంలోకి వెళుతుంది. మిగిలిన మొత్తం ఉద్యోగి పీఎఫ్ ఖాతాలోకి వెళుతుంది. అయితే 2014 వరకూ పీఎఫ్ ఖాతాలో చేరడానికి గరిష్ఠ జీతం పరిమితి రూ.6,500గా ఉండేది.

దీనికన్నా జీతం ఎక్కువ ఉన్నా సరే... చట్టప్రకారం ఈ మొత్తంలో 12 శాతాన్ని (అంటే రూ.780) పీఎఫ్ ఖాతాకు జమ చేస్తే చాలు. కాకపోతే 2014 సెప్టెంబర్లో ఈ పరిమితిని రూ.15,000కు పెంచారు. దీన్లో 12 శాతం... అంటే రూ.1,800 కనీసం జమ చేయాలి. ఇంకా ఎక్కువ జీతం ఉన్న పక్షంలో... ఉద్యోగి, సంస్థ ఇష్టపూర్వకంగా మరింత మొత్తాన్ని కూడా ఈపీఎఫ్ ఖాతాకు జమ చేయొచ్చు. ఇలా కేటాయించిన అదనపు మొత్తంపై కూడా ఇదే వడ్డీ రేటు, పన్ను రాయితీలు లభిస్తాయి. దీన్లో వలంటరీ కంట్రిబ్యూషన్ కూడా ఉంటుంది. అయితే వరసగా ఐదేళ్ల పాటు పనిచేసిన వారికి మాత్రమే పెన్షన్ లభిస్తుంది.
     
పీఎఫ్‌లో ప్రస్తుతం నెలకు జమ చేయాల్సిన కనీస మొత్తం రూ.1800 + 1800
2015-16 సంవత్సరానికి ఈపీఎఫ్‌పై 8.8 శాతం వడ్డీని ఇస్తున్నారు.
ఈపీఎఫ్‌కు జమచేసే మొత్తానికి కూడా ఏటా పన్ను మినహాయింపు ఉంటుంది.
ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉండే ఈపీఎఫ్ నుంచి...

అత్యవసర సందర్భాల్లో డబ్బు వెనక్కి తీసుకోవచ్చు. ఇంటి నిర్మాణం, రుణం చెల్లింపులు, ఇంటి రిపేర్లకు, పిల్లల చదువు, పెళ్ళి, వైద్య ఖర్చులు, ప్రకృతివైపరీత్యాల వలన నష్టాలు సంభవించినప్పుడు... నిబంధనలు అనుసరించి ఈపీఎఫ్ సొమ్మును వినియోగించుకోవచ్చు. ఇలా వెనక్కి తీసుకునే మొత్తంపై ఇకపై కూడా మునుపటిలానే పూర్తిగా పన్ను మినహాయింపు ఉంటుంది. ఈపీఎఫ్ ద్వారా వచ్చే నెలవారీ పింఛను చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఈపీఎఫ్‌లో జమ చేసిన నిధితో యాన్యుటీ పథకాలను కొనుగోలు చేసి... మరింత పెన్షన్ పొందవచ్చు.
 
అందరికీ అందుబాటులో... పీపీఎఫ్

పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్... ఉద్యోగస్తులే కాక ఎవరైనా పీపీఎఫ్‌లో ఖాతా తెరవవచ్చు.
పోస్టాఫీసులు, బ్యాంకుల్లో అందుబాటులో ఉండే పీపీఎఫ్ కాలపరిమితి 15 ఏళ్లు.
పెట్టుబడిపై ఏటా పన్ను మినహాయింపులుంటాయి; మెచ్యూరిటీ మొత్తం ట్యాక్స్‌ఫ్రీనే.
పీపీఎఫ్‌లో ఏడాదికి రూ.500 నుంచి రూ.1,50,000 వరకు ఇన్వెస్ట్ చేయొచ్చు.
పిల్లల పేరిట కూడా ఖాతా తెరవొచ్చు. 15 ఏళ్లు దాటాక మరో ఐదేళ్లు పొడిగించుకోవచ్చు కూడా.
ఏడేళ్ల వరకు ఇన్వెస్ట్ చేసిన మొత్తం నుంచి వెనక్కి తీసుకోలేము.
ఏడేళ్ళ తర్వాత ఇన్వెస్ట్ చేసిన మొత్తంలో 50 శాతం వరకు తీసుకోవచ్చు. ప్రసుత్త వడ్డీ 8.7 శాతం.

ఇది దీర్ఘకాలిక ఇన్వెస్ట్‌మెంట్ పథకమే కాని పెన్షన్ అందించేది కాదు. పీపీఎఫ్ అకౌంట్ కాలపరిమితి తర్వాత వచ్చే మెచ్యూర్టీ మొత్తంతో యాన్యుటీ ప్లాన్‌ను కొనుగోలు చేయడం ద్వారా పెన్షన్ పొందవచ్చు.
 
మరింత ఆకర్షణీయంగా ఎన్‌పీఎస్
సామాజిక భద్రతలో భాగంగా అందరికీ పెన్షన్ సౌకర్యం కల్పించాలనే ఉద్దేశంతో 2004లో న్యూ పెన్షన్ సిస్టమ్‌ను (ఎన్‌పీఎస్) ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్లో దీన్ని మరింత ఆకర్షణీయంగా మారుస్తున్నారు. గతేడాది బడ్జెట్‌లో ఎన్‌పీఎస్‌లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై సెక్షన్ 80సీసీడీ కింద అదనంగా రూ.50,000 పన్ను రాయితీనిచ్చారు. ఇది సెక్షన్ 80సీ కింద లభించే రూ.1.50 లక్షల పన్ను మినహాయింపులకు అదనం. ఇప్పటిదాకా ఈ పథకం నుంచి వెనక్కి తీసుకునే మొత్తంపై వారి వ్యక్తిగత ఆదాయ శ్లాబుల ప్రకారం పన్ను చెల్లించాల్సి వచ్చేది. వచ్చే ఏడాది నుంచి ఎన్‌పీఎస్ నుంచి వెనక్కి తీసుకునే మొత్తంలో 40 శాతం వరకు ఎలాంటి పన్ను ఉండదని తాజా బడ్జెట్లో పేర్కొన్నారు.
     
18-55 సంవత్సరాల మధ్య ఈ పథకంలో చేరవచ్చు.
ఇది కూడా ఫండ్ పథకాల మాదిరే పనిచేస్తుంది.
దీనికి జమయ్యే మొత్తాన్ని ఈక్విటీ, డెట్ పథకాల్లో ఇన్వెస్ట్ చేస్తారు.
ఎన్‌పీఎస్ ఫండ్స్‌ను ఎస్‌బీఐ, ఐసీఐసీఐ, యూటీఐ, రిలయన్స్, ఐడీఎఫ్‌సీ, కోటక్ మహీంద్రాలు నిర్వహిస్తున్నాయి.
ఈ ఫండ్స్ మూడు రకాలు. అధిక రిస్క్ ఉండే ఈక్విటీ ఫండ్‌లో గరిష్టంగా 50 శాతం మాత్రమే ఇన్వెస్ట్ చేయొచ్చు.
రిస్క్ సామర్థ్యం ఆధారంగా నచ్చిన ఫండ్ మేనేజర్‌ను, ఫండ్‌ను మీరే ఎంచుకోవచ్చు. ఏడాదికి కనీస పెట్టుబడి రూ.6,000. దీన్ని నాలుగు దఫాల్లో చెల్లించవచ్చు. కనీస వాయిదా రూ.500.
ఇందులో టైర్-1, టైర్-2 ఖాతాలుంటాయి. టైర్-1లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని 60 ఏళ్లు దాటాకే తీసుకోవాలి.
60 ఏళ్ల తరవాత వచ్చే మొత్తంలో కనీసం 80% యాన్యుటీలో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది.
టైర్-2లో అవసరమైనప్పుడు కనీసం 2వేలు ఉంచి మిగిలిన మొత్తం వెనక్కి తీసుకోవచ్చు.
ఎవరైనా ఎన్‌పీఎస్‌లో ఖాతా తెరవచ్చు. పన్ను ప్రయోజనాలతో పాటు, 60 ఏళ్లు దాటాక పెన్షన్ పొందవచ్చు.
 
బీమాతోనూ పింఛన్ పొందొచ్చు..
బీమా కంపెనీలు అందిస్తున్న పెన్షన్ పథకాల్ని రెండు రకాలుగా చెప్పొచ్చు. మొదటివి సాంప్రదాయ పెన్షన్ పథకాలు; రెండో రకం యూనిట్ ఆథారిత బీమా పథకాలు. సాంప్రదాయ పెన్షన్ పథకాలు స్థిరమైన రాబడినిస్తాయి. అదే యులిప్స్ పథకాల రాబడులైతే స్టాక్ మార్కెట్ కదలికలపై ఆధారపడి ఉంటాయి.
     
ఈ 2 పథకాల్లోనూ పాలసీ వ్యవధి మొత్తం ఇన్వెస్ట్ చేయాలి.
రిటైరయ్యాక ఎంచుకున్న కాలానికి పెన్షన్‌ను అందిస్తాయి.
మెచ్యూరిటీ మొత్తంలో గరిష్టంగా 25-33% ఒకేసారి వెనక్కి తీసుకోవచ్చు.
33% వరకూ పన్నుండదు.
మిగిలినదాంతో యాన్యుటీ ప్లాన్ కొనుగోలు చేయాలి.
మిగిలిన బీమా పథకాలతో పోలిస్తే వీటిలో మోర్టాలిటీ ఛార్జీలు, ఇతర ఛార్జీలు తక్కువ.
చాలా బీమా కంపెనీలు 45 ఏళ్లు దాటితే యాన్యుటీ ప్లాన్‌కు అనుమతిస్తున్నాయి. అంటే 45 ఏళ్ల నుంచే పెన్షన్ తీసుకోవచ్చన్న మాట.
పెన్షన్ పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై గరిష్టంగా లక్ష రూపాయల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు.
పెన్షన్‌గా వచ్చే మొత్తాన్ని ఆదాయంగా పరిగణిస్తారు.
 
మిగిలిన పథకాలతో పోలిస్తే బీమా పెన్షన్ పథకాల రాబడి చాలా తక్కువ. కేవలం 6-7 శాతం రాబడులు మాత్రమే అందిస్తాయి. బీమా రక్షణతో పాటు పెన్షన్ కావాలనుకునే వారు వీటికేసి చూడొచ్చు.

 
యాన్యుటీ అంటే...
పైన పేర్కొన్నవన్నీ పెన్షన్ పథకాలే. కానీ ఇవి నిజంగా పెన్షన్ ఇవ్వవు. పింఛన్ కోసం నిధిని సమకూర్చుకోవడానికి పనికొస్తాయి. ఇలా సమకూర్చుకున్న నిధిని యాన్యుటీ ప్లాన్‌లో పెట్టుబడిగా పెట్టడం ద్వారా పింఛను పొందొచ్చు. పెన్షన్ పథకం తీసుకున్న దగ్గరే యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవాలన్న నిబంధనేమీ లేదు. పెన్షన్ పాలసీ గడువు ముగిశాక మీకు నచ్చిన కంపెనీకి చెందిన యాన్యుటీ ప్లాన్‌ను తీసుకోవచ్చు. చేతికి ఎంత పెన్షన్ వస్తుందనే విషయం మీరు ఎంత కాలానికి పెన్షన్ కావాలనుకుంటున్నారు? మీ తదనంతరం మీపై ఆధారపడిన వారికి కూడా పెన్షన్ కావాలనుకుంటున్నారా? అన్న విషయాలపై ఆధారపడి ఉంటుంది.
 
మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయ్...
మ్యూచువల్ ఫండ్స్ విషయానికి వస్తే కేవలం నాలుగు పెన్షన్ ఫండ్లే అందుబాటులో ఉన్నాయి.
పదేళ్లుగా ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ ఇండియా పెన్షన్ ఫండ్, యూటీఐ రిటైర్మెంట్ బెనిఫిట్ పెన్షన్ ఫండ్స్‌ను అందిస్తున్నాయి.
ఈ మధ్య రిలయన్స్ సంస్థ రిటైర్మెంట్ ఫండ్‌ను, హెచ్‌డీఎఫ్‌సీ రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్‌ను ప్రవేశపెట్టాయి.
ఇవన్నీ బ్యాలెన్స్‌డ్ ఫండ్ విభాగంలోకి వస్తాయి. ఈక్విటీల్లో 40 శాతం, డెట్ పథకాల్లో 60 శాతం వరకు ఇన్వెస్ట్ చేస్తాయి.
ప్రతి నెలా కొంత మొత్తం చొప్పున వీటిలో ఇన్వెస్ట్ చేయొచ్చు. కనీసం రూ.500 ఇన్వెస్ట్ చేయాలి.
వీటిలో ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై సెక్షన్80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి.
వీటి లాకిన్ పిరియడ్ మూడు నుంచి ఐదేళ్లుగా ఉంది. గడిచిన పదేళ్లలో ఈ ఫండ్స్ 9 నుంచి 10 శాతం వార్షిక సగటు రాబడుల్ని అందించాయి.

ఎన్‌పీఎస్‌తో పోలిస్తే వీటి నిర్వహణ ఖర్చులు ఎక్కువ. ఆ మేరకు రాబడులు తగ్గుతాయి. కానీ వీటి నుంచి వెనక్కి తీసుకున్న మొత్తంతో తప్పనిసరిగా యాన్యుటీ ప్లాన్ కొనాలన్న నిబంధన ఏమీ లేదు. అలాగే ఇవి అందించే రాబడులపై ఎటువంటి పన్ను భారం ఉండదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement