ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? | Investment to be now? | Sakshi
Sakshi News home page

ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?

Published Mon, Feb 15 2016 2:27 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా? - Sakshi

ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చా?

11 నెలల్లో స్టాక్ మార్కెట్ల తీవ్ర పతనం
* గరిష్ఠం నుంచి 25 శాతం వరకూ పడిన సూచీలు   
* 50-60 శాతానికిపైగా నష్టపోయిన మెటల్, బ్యాంకు షేర్లు
* ఆకర్షణీయమైన ధరల్లో కనిపిస్తున్న ఇతర రంగాల షేర్లు   
* ఇంకా పడతాయన్న భయాలతో దూరంగా చిన్న ఇన్వెస్టర్లు
* దీర్ఘకాలికమైతే ఇప్పుడు ఇన్వెస్ట్ చేయొచ్చంటున్న నిపుణులు   
* స్వల్ప, మధ్య కాలానికైతే వేచి చూడటమే నయమని సూచన
 
ఏడాదిలో ఏకంగా 25 శాతం నష్టం!!. ఎవ్వరికైనా ఇది గుండె బేజారెత్తించే విషయమే. స్టాక్ మార్కెట్ మదుపరులు మాత్రం దీన్నొక అవకాశంగా చూస్తుంటారు. ఎందుకంటే ఇంత తీవ్ర పతనమైందంటే షేర్ల రేట్లన్నీ కిందికి దిగినట్లేగా? చవగ్గా వస్తున్నట్లే కదా? మరి ఇప్పుడు కొంటే పెరగటానికి అవకాశాలెక్కువ కదా? కాస్త దీర్ఘకాలం స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేద్దామనుకున్నవారు ఎవ్వరైనా ఆలోచించేది ఇలాగే. కానీ ఇక్కడో చిక్కుంది.

ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులు అంత బాగులేవు. అన్ని దేశాల స్టాక్ మార్కెట్లూ ఘోరంగా పతనమవుతున్నాయి. పెపైచ్చు ప్రపంచానికంతటికీ పలు వస్తువుల్ని ఎగుమతి చేయటం... ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేసిన స్టీల్, చమురు తదితర వస్తువుల్ని దిగుమతి చేసుకోవటం చేసే చైనా ఆర్థిక పరిస్థితి అంత బాగులేదు. మరి ఈ పతనం ఇంకా కొనసాగితే ఎలా? ఇదే మదుపరుల్ని వేధిస్తున్న ప్రశ్న. ఆ ప్రశ్నలకు సమాధానమివ్వటానికే ‘సాక్షి’ పలువురు స్టాక్ మార్కెట్ నిపుణులను సంప్రదించింది. వారిచ్చిన సూచనల సమాచారమే ఈ ప్రాఫిట్ ప్లస్ కథనం..

 
నిజానికి 2008 పతనం తరవాత మన స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులకు రిటైలర్లు (చిన్న ఇన్వెస్టర్లు) దూరంగానే ఉంటూ వచ్చారు. దానికి తగ్గట్టే మార్కెట్ కూడా తీవ్ర హెచ్చుతగ్గులతో కదలాడింది. అయితే 2014 ఎన్నికలకు కొన్నాళ్ల ముందు పెద్ద ర్యాలీ మొదలైంది. ఆ ర్యాలీ దాదాపుగా గతేడాది జనవరి వరకూ కొనసాగింది. జనవరిలో మన మార్కెట్లు జీవితకాల గరిష్ఠ స్థాయిలను తాకాయి కూడా. మార్కెట్లపై నమ్మకం కుదరటంతో చిన్న మదుపరులూ అదే సమయంలో తిరిగి మార్కెట్లోకి ప్రవేశించటం మొదలెట్టారు. ఈ సారి నేరుగా కాకుండా అత్యధిక శాతం మంది మ్యూచువల్ ఫండ్స్ ద్వారా ఇన్వెస్ట్ చేశారు. కానీ బడ్జెట్ తర్వాత నుంచి సూచీలు నేల చూపులు చూడటం ఆరంభించాయి. గత 11 నెలల్లో ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ సుమారు 25% నష్టపోయాయి.

కొన్ని షేర్లయితే హారతి కర్పూరంలా కరిగిపోయాయి. ముఖ్యంగా మెటల్స్, బ్యాంకు షేర్లు 40 నుంచి 50%కి పైగా నష్టపోయాయి. దీంతో రిటైల్ ఇన్వెస్టర్లు పునరాలోచనలో పడ్డారు. ఈ ఏడాది జనవరి నుంచి కొత్తగా పెట్టుబడులు పెట్టడం దాదాపు నిలిపేసినట్లు మ్యూచువల్ ఫండ్ సంస్థలు చెబుతున్నాయి. ‘‘నాకు తెలిసినంత వరకూ పెట్టిన పెట్టుబడుల్ని వెనక్కి తీసుకోవటమైతే ఇంకా మొదలు కాలేదు. కానీ కొత్త పెట్టుబడులు రావటం తగ్గాయి’’ అని ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ అసెట్ మేనేజిమెంట్ కంపెనీ సీనియర్ ఫండ్ మేనేజర్ మనీష్ గున్వానీ ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రతినిధితో చెప్పారు.
 
ఆకర్షణీయమే కానీ..
ప్రస్తుతం చాలా షేర్లు ధరలు తగ్గి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. కానీ అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల దృష్ట్యా ఇన్వెస్ట్‌మెంట్లు పెట్టడానికి వెనకంజ  వేస్తున్నారు. మార్కెట్ పండితులు మాత్రం దీర్ఘకాలిక దృష్టితో ఇన్వెస్ట్ చేయడానికి ఇది చక్కని సమయమంటున్నారు. ‘‘మార్కెట్ల గత చరిత్రను చూస్తే అర్థమయ్యేది ఒక్కటే. ప్రతిసారీ భారీ పతనం తర్వాత వెంటనే మార్కెట్లు ర్యాలీ చేశాయి. 2008లో జరిగిన భారీ పతనం తర్వాత 2009లో సూచీలు సుమారు 150 శాతం పెరిగాయి. అలాగే ఇప్పుడూ పెరిగే అవకాశం ఉంది.

కాకపోతే గతంలో మాదిరిగా అన్ని రంగాల షేర్లూ పెరిగే అవకాశం తక్కువ. కొన్ని ఎంపిక చేసిన షేర్లలోనే ర్యాలీ వచ్చే అవకాశముంది’’ అని జెన్ మనీ జేఎండీ సతీష్ కంతేటి ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రతినిధితో చెప్పారు. అంతర్జాతీయ పరిణామాలపై ఇంకా స్పష్టత రావటం లేదు కనక స్వల్ప, మధ్య కాలిక ఇన్వెస్టర్లు మార్కెట్లకు దూరంగా ఉంటేనే మంచిదన్నారాయన.  ‘‘దీర్ఘకాలిక దృష్టిలో ఇన్వెస్ట్ చేసేవారు మాత్రం ఎంపిక చేసుకున్న షేర్లలో కొంచెం కొంచెం చొప్పున ఒక ఏడాదిపాటు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేకపోతే సిప్ మార్గంలో మ్యూచువల్  ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం మంచిది’’ అని సతీష్ సూచించారు.
 
బ్యాంక్ షాపింగ్ చేయొచ్చా?..
ప్రస్తుతం అన్ని బ్యాంకు షేర్లు దారుణంగా పతనమై దిగువ స్థాయి ధరల వద్ద ట్రేడవుతున్నాయి. కొన్నయితే వాటి గరిష్ఠ స్థాయి నుంచి 60 శాతానికి పైగా నష్టపోయాయి. ఇప్పుడివి చాలా ఆకర్షణీయమైన ధరల్లో ఉన్నా... వీటిల్లో రిస్క్ ఇంకా పూర్తిస్థాయిలో తొలగిపోలేదని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. రిజర్వు బ్యాంకు సంస్కరణల పేరిట పలు చర్యలు తీసుకుంటోంది. దీర్ఘకాలంలో బ్యాంకింగ్ వ్యవస్థకు ఇవి మేలు చేస్తాయి.

కానీ వీటి ప్రభావం బ్యాంకులపై ఏ స్థాయిలో ఉంటుందనేదింకా స్పష్టంగా తెలియటం లేదు. గతంలో రాజకీయ, ఇతర ఒత్తిళ్లకు లొంగి అడ్డదిడ్డంగా ఇచ్చిన రుణాలను ఇప్పుడు ఎన్‌పీఏలుగా చూపించమని ఆర్‌బీఐ ఆదేశించడంతో చాలా పీఎస్‌యూ బ్యాంకులు ఎన్‌పీఏలను పెంచుకుంటూ నష్టాల బాటపట్టాయి. ఈ ఒత్తిడిని తట్టుకొని ఎన్ని బ్యాంకులు నిలబడతాయన్నదే ఇప్పుడు ప్రధాన సమస్య. ఎన్‌పీఏలు భారీగా పెరగడంతో వచ్చే రెండేళ్లు బ్యాంకుల లాభాలు కూడా అంతంత మాత్రంగానే ఉండే అవకాశం ఉంది.

దీనికి తోడు కొత్తగా ప్రైవేటు రంగంలో వస్తున్న బ్యాంకులు, పేమెంట్ బ్యాంకుల నుంచి పోటీ మరింత పెరగనుంది. ఈ పరిణామాలు చిన్న స్థాయి ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకుల్ని ఘోరంగా దెబ్బతీయొచ్చనేది ఈ రంగంతో సంబంధమున్న వారి మాట. రిస్క్ చేయదల్చిన వారు పెద్ద స్థాయి ప్రైవేటు, పీఎస్‌యూ బ్యాంకులకేసి దీర్ఘకాలిక దృష్టితో చూడొచ్చన్నది వారి సూచన.
 
మరీ ఖరీదేమీ కాదు..
ప్రస్తుత రేట్ల వద్ద మన సూచీలు అంత ఖరీదుగా లేవని, అలాగని మరీ చౌకగా కూడా లేవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం ఆదాయాలతో పోలిస్తే ప్రస్తుత సూచీలు సుమారు  16 పీఈ వద్ద ట్రేడ్ అవుతున్నాయి. మన సూచీల సగటు పీఈ 15-16గా ఉంది. ఈ స్థాయి కంటే దిగువకు వస్తే షేర్ల ధరలు చాలా చౌకగా ఉన్నట్లు లెక్క. సెన్సెక్స్ 22,000 స్థాయికి రావచ్చని కొన్ని బ్రోకరేజీ సంస్థల అంచనా.

అప్పుడు పీఈ 14 దగ్గరకు వస్తుంది. అంటే ప్రస్తుత స్థాయి నుంచి ఇంకా 4-5 శాతం పతనం కావడానికి అవకాశం ఉంది. దీర్ఘకాలిక ఇన్వెస్టర్లకు ఇది పెద్ద రిస్క్ కాదు కాబట్టి ప్రస్తుత ధర వద్ద నెమ్మదిగా కొనుగోళ్లు ప్రారంభించవచ్చనేది నిపుణుల సూచన. ‘‘సూచీలు ఇలా పతనమై ఉన్నాయి. కొన్ని రంగాల షేర్లు కూడా ఇందుకు భిన్నమేమీ కాదు. బాగా పతనమై ఆకర్షణీయగా ఉన్నాయి. కాకపోతే ఇవన్నీ ఇన్వెస్ట్ చేసేంత ధైర్యాన్నివ్వటం లేదు. వివిధ రంగాల్లో ఉన్న రిస్క్ ఇంకా స్పష్టం కాకపోవటమే దీనిక్కారణం’’ అని జెన్ మనీ జేఎండీ సతీష్ వివరించారు.
 
బేర్ దశలోకి...
దేశీయ స్టాక్ సూచీల్లో బేర్ మార్కెట్ మొదలయ్యిందా... అనే రీతిలో పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సూచీలు గరిష్ట స్థాయి నుంచి వరసగా రెండు నెలలు పతన బాటలో ప్రయాణించడమే కాకుండా 20 శాతానికి పైగా నష్టపోతే దాన్ని బేర్ దశలోకి ప్రవేశించినట్లుగా పరిగణిస్తారు. ప్రస్తుతం మన సూచీలు గత 11 నెలల్లో 23 శాతం నష్టపోవడం దీనికి సంకేతంగా భావించవచ్చు.

ఇది బేర్ మార్కెట్‌గా మారుతుందా? ఇకా ఎన్నాళ్లు కొనసాగుతుంది? వంటివన్నీ ఇప్పుడే చెప్పలేమనేది వారి మాట. ‘‘గడిచిన 25 ఏళ్ల మార్కెట్ చరిత్ర చూస్తే బేర్ మార్కెట్ ఎక్కువ కాలం కొనసాగిన దాఖలాలు లేవు. (25 ఏళ్ల సెన్సెక్స్ బుల్ ర్యాలీ-బేర్ మార్కెట్ పట్టిక రూపంలో ఇవ్వడం జరిగింది) అన్ని బేర్ మార్కెట్లు 13 నుంచి 19 నెలల్లోనే ముగిసిపోయాయి.

ఒక్క 1994లో మొదలైన బేర్ మార్కెట్ మాత్రమే సుదీర్ఘంగా నాలుగేళ్లపాటు కొనసాగింది. నాలుగేళ్ల సుదీర్ఘ సమయంలో సూచీలు 41 శాతం నష్టపోయాయి’’ అని మార్కెట్  విశ్లేషకుడు మూర్తి గరిమెళ్ల తెలియజేశారు. ఇవన్నీ చూస్తే ఇప్పుడు సూచీలు మరింత పతనమవుతాయా? లేక దీర్ఘకాలంలో పరిమిత శ్రేణిలో కానసాగుతాయా అన్నది కొన్నాళ్లు వేచి చూస్తే తప్ప తెలిసేలా లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement