పన్నులేని వడ్డీ కావాలా? | Looking for taxfree interest? | Sakshi
Sakshi News home page

పన్నులేని వడ్డీ కావాలా?

Published Mon, Sep 28 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM

పన్నులేని వడ్డీ కావాలా?

పన్నులేని వడ్డీ కావాలా?

ఒక వైపేమో వడ్డీ రేట్లు తగ్గుతాయనే సంకేతాలు ఎడతెరిపి లేకుండా వస్తున్నాయి. అంతేకాదు!! వడ్డీ రేట్లు తగ్గించాలని రిజర్వు బ్యాంకుపై ఒత్తిడి కూడా వస్తోంది. అలా జరిగితే వడ్డీయే ఆదాయంగా బతికేవారికి ఇబ్బంది కాదా? మరేం చేయాలి? ఇపుడు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ఈ ప్రశ్నలన్నీ సామాన్యులనిపుడు వేధిస్తున్నాయి. ఇదిగో... ఇలాంటి ప్రశ్నలన్నిటికీ సమాధానమా... అన్న రీతిలో వస్తున్నాయి ట్యాక్స్ ఫ్రీ బాండ్లు. ఒకవైపు వడ్డీ కాస్త ఎక్కువ. పెపైచ్చు స్థిరంగా ఉంటుంది. వీటికితోడు పన్ను కూడా ఉండదు.

అందుకే ఇన్వెస్టర్లు వీటికోసం ఎగబడుతున్నారు. ఉదాహరణకు రూ.400 కోట్లు ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ద్వారా సమీకరించాలని భావించిన ప్రభుత్వ రంగ సంస్థ ఎన్‌టీపీసీ... ఆ మేరకు తొలివిడత బాండ్ల జారీకి వచ్చింది. ఊహించని విధంగా ఇష్యూ ఆరంభమైన తొలి రోజే 11 రెట్లు అధికంగా బిడ్లు వచ్చాయి. దీంతో ఈ నెల 30వ తేదీ వరకూ ఉండాల్సిన ఇష్యూ... ఒక్క రోజులోనే ముగిసిపోయింది.

ఎన్‌టీపీసీ సక్సెస్‌తో మరిన్ని ప్రభుత్వ రంగ సంస్థలు ట్యాక్స్ ఫ్రీ బాండ్లు జారీ చేయటానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే... ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్లకు ఎందుకింత డిమాండ్ వచ్చింది? ఇవి ఎవరికి అనుకూలం? వీటిలో ఇన్వెస్ట్ చేసే ముందు గమనించాల్సిన అంశాలేంటి? అనేవి వివరిస్తున్న ‘ప్రాఫిట్ ప్లస్’ ముఖ్య కథనమిది..

- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
 
ఇదిగో ట్యాక్స్ ఫ్రీ బాండ్లు వస్తున్నాయ్

* రూ.400 కోట్ల మేర బాండ్లు జారీచేసిన ఎన్‌టీపీసీ
* మొదటిరోజే 11 రెట్లు అధికంగా బిడ్లు...
* ఇన్వెస్ట్ చేసిన మొత్తంపై పన్ను మినహాయింపులేవీ ఉండవు
* అధిక ట్యాక్స్ శ్లాబుల్లో ఉన్నవారికి చక్కని ఊరట
* మరిన్ని బాండ్ల జారీకి సిద్ధమవుతున్న సంస్థలు
దాదాపు ఏడాది కాలంగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల ఇష్యూలేవీ రాలేదు. అయితే గత బడ్జెట్లో ప్రభుత్వం ఈ ఏడాది ట్యాక్స్ ఫ్రీ బాండ్స్ ద్వారా రూ.40,000 కోట్లు సమీకరించుకోవటానికి ఏడు ప్రభుత్వ రంగ సంస్థలకు అనుమతినిచ్చింది. ఇందులో భాగంగా ఎన్‌టీపీసీ మొదటి విడతగా జారీచేసిన రూ. 400 కోట్ల ఇష్యూకి అనూహ్య స్పందన వచ్చింది. దీనికి మరో కారణం కూడా ఉంది. మంగళవారం ఆర్‌బీఐ పరపతి విధానాన్ని సమీక్షించనుంది.

ఈ సమీక్షలో వడ్డీరేట్లను తగ్గించవచ్చని చాలామంది అంచనా వేస్తున్నారు. దీంతో మున్ముందు వచ్చే ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో వడ్డీరేట్లు తగ్గుతాయన్న అంచనాతో ఎన్‌టీపీసీ ఇష్యూకి భారీగా స్పందన వచ్చిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు. మిగిలిన సంస్థలు వడ్డీరేట్ల కదలికలపై స్పష్టత వచ్చిన తర్వాతే ఇష్యూకు రావడానికి ప్రణాళికలు వేస్తున్నాయి. మొత్తం రూ.40,000 కోట్ల ట్యాక్స్ ఫ్రీ బాండ్లలో రిటైల్ ఇన్వెస్టర్లు సుమారు రూ.11,000 కోట్ల వరకూ ఇన్వెస్ట్ చేయడానికి అవకాశం ఉంది.
 
ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు
ఎవరైనా ఈ బాండ్లలో ఇన్వెస్ట్ చేయొచ్చు. సాధారణంగా ఈ బాండ్లలో కనీస ఇన్వెస్ట్‌మెంట్ రూ.5,000గాను, గరిష్ట మొత్తం రూ.10 లక్షలుగాను ఉంటుంది. డీమ్యాట్ లేదా ఫిజికల్ రూపంలో తీసుకోవచ్చు. కానీ వీటిలో ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం పాన్‌కార్డు తప్పనిసరి. అలాగే ఈ బాండ్స్ ఇష్యూలో మొదట అప్లై చేసుకున్న వారికి మొదటి ప్రాధాన్యత అనే విధానంలో బాండ్స్‌ను కేటాయించడం జరుగుతుంది. అందుకే వీటిలో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఇష్యూ ప్రారంభంలోనే ఇన్వెస్ట్ చేయడం మంచిది.
 
దీర్ఘకాలికం... భద్రం
వీటి జారీకి ప్రభుత్వ రంగ సంస్థలకు మాత్రమే అనుమతి ఉంటుంది. ఆర్థికంగా పరిపుష్టంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మాత్రమే వీటిని జారీ చేస్తాయి కూడా. అందుకే ఈ సంస్థలు అందించే బాండ్లకు అధిక రేటింగ్ ఉంటుంది. వీటిని రిస్క్‌లేని ఇన్వెస్ట్‌మెంట్ సాధనాలుగా కూడా పరిగణిస్తారు. ఈ బాండ్ల కాలపరిమితి చాలా ఎక్కువగా ఉంటుంది. కాలపరిమితిని బట్టి వడ్డీరేటు మారుతుంటుంది. సాధారణంగా 10, 15, 20 ఏళ్ల కాలానికి ఈ బాండ్లను జారీ చేస్తారు.
 
మధ్యలో వైదొలగవచ్చు...
ఈ బాండ్లను స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు చేస్తారు. కాబట్టి నగదు అవసరమైనప్పుడు మధ్యలో వైదొలగవచ్చు. కానీ ఇలా మధ్యలో వైదొలిగితే ఇబ్బంది  ఉంటుంది. మధ్యలో నగదు తీసుకుంటే  మాత్రం పన్ను భారం ఏర్పడుతుంది. ఇన్వెస్ట్ చేసిన ఏడాదిలోగా వైదొలిగితే మీ వ్యక్తిగత ఆదాయ పన్ను శ్లాబు ప్రకారం...

ఈ బాండ్లపై వచ్చే వడ్డీకి కూడా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే ఏడాది దాటిన తర్వాత అయితే 10.3 శాతం క్యాపిటల్ గెయిన్‌ట్యాక్స్ చెల్లిస్తే సరిపోతుంది. వీటన్నింటిపైనా ఒక అవగాహన అవసరం. చక్కటి అవగాహనకు అవసరమైతే ఈ విభాగంలో నిపుణులను సంప్రదించి తగిన నిర్ణయం తీసుకోవడం వల్ల అనవసర వ్యయ ప్రయాసలు తగ్గుతాయి.
 
వడ్డీ తక్కువైనా లాభమెక్కువ...
సాధారణంగా ట్యాక్స్ ఫ్రీ బాండ్లు అందించే వడ్డీ... బ్యాంకు డిపాజిట్ల కంటే పావు నుంచి అర శాతం తక్కువగానే ఉంటుంది. కాకపోతే బ్యాంకు డిపాజిట్లపై వచ్చే వడ్డీని ఆదాయంగా పరిగణిస్తారు. ఒకవేళ ఆ వడ్డీ ఏడాదికి రూ. 10,000 దాటితే టీడీఎస్ (మూలం దగ్గరే పన్ను కోత) కూడా వర్తింప చేస్తారు. అదే ట్యాక్స్ ఫ్రీ బాండ్ల విషయానికొస్తే వీటిపై వచ్చే వడ్డీకి ఎలాంటి పన్నూ ఉండదు. అందుకని వడ్డీని, పన్ను లాభాన్ని కలిపితే ట్యాక్స్ ఫ్రీ బాండ్లే ఆకర్షణీయంగా కనిపిస్తాయి.

మరో రకంగా చెప్పాలంటే అధిక ట్యాక్స్ శ్లాబ్ పరిధిలో ఉండేవారికి దీనివల్ల ఎక్కువ లాభం. ఉదాహరణకు ప్రస్తుతం ఎస్‌బీఐ 5-10 ఏళ్ల కాలపరిమితి గల డిపాజిట్లపై 7.25 శాతం వడ్డీ అందిస్తోంది. కానీ 30 శాతం ట్యాక్స్ శ్లాబ్ పరిధిలో ఉన్నవారు గనక ఈ వడ్డీపై చెల్లించే పన్నును పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ రాబడి 5 శాతమే అవుతుంది. అదే ఈ ట్యాక్స్ ఫ్రీ బాండ్స్‌లో అయితే వడ్డీపై ఎలాంటి పన్ను  భారం ఉండదు.

ఇక్కడో విషయం గుర్తు పెట్టుకోవాలి.. ఈ బాండ్స్‌లో ఇన్వెస్ట్ చేసిన మొత్తాన్ని పన్ను పరిధి నుంచి మినహాయించటం వంటివేవీ ఉండవు. వీటిపై వచ్చే వడ్డీకి పన్ను విధించరు. అంతే!!. అందుకే ఇవి 20, 30 శాతం ట్యాక్స్ శ్లాబ్‌లో ఉన్న వారికి అనువైనవని చెప్పొచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement