ఔషధంలా వాడితే మంచిదే!
ఓవర్ డ్రాఫ్ట్...
వెంకట్ మొబైల్‌కు తన బ్యాంక్ నుంచి ఒక మెసేజ్ వచ్చింది. ‘మీరు ఉద్యోగం చేస్తున్న సంస్థ నుంచి క్రమం తప్పకుండా ఆరు నెలలుగా వేతనం మీ ఖాతాలో జమ అవుతోందా? అయితే... ఓవర్ డ్రాఫ్ట్ సౌలభ్యం కోసం మా బ్రాంచ్ మేనేజర్‌ని సంప్రదించండి.’ ఇదీ ఆ మెసేజ్ సారాంశం. దీంతో వెంకట్ ఆలోచించటం మొదలెట్టాడు. చివరకు తన ఆఫీసులో ఆర్థికాంశాలపై అవగాహన ఉన్న స్నేహితుడు రామును దీని గురించి అడిగాడు. రాము ఏం చెప్పాడనేదే ఈ వారం ప్రాఫిట్ ప్లస్ ప్రత్యేకం...
ఉద్యోగులకైతే వేతనాన్ని బట్టే ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఆస్తులు, ఎఫ్‌డీలు, బీమా పాలసీలు తనఖా పెట్టి కూడా మిగిలిన రుణాలతో పోల్చితే వడ్డీ రేటు తక్కువే విత్‌డ్రా చేసుకున్న మొత్తానికే వడ్డీ కనక ఉత్తమం ఈ రుణంతో రిస్కు చేస్తే మాత్రం ఇబ్బందులే!!
వినియోగించుకున్న డబ్బుపైనే వడ్డీ...
ఉదాహరణకు మీకు రూ.6 లక్షలు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్ని మంజూరు చేశారనుకుందాం. ఆ మేరకు డబ్బు మొత్తాన్ని మీ చేతికివ్వటం జరగదు. అలాగని వారి దగ్గరే ఉంచుకోరు కూడా. ఇది మీ ఇష్టాయిష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేమిటంటే... రూ.6 లక్షలనేది మీ రుణ పరిమితి. అక్కడి వరకూ మీరు ఉపయోగించుకోవచ్చన్న మాట. అందులో మీరు ఎంత వినియోగించుకున్నారో.. అంత మొత్తానికే వడ్డీరేటు పడుతుంది. ఎప్పటికప్పుడు ఈ ప్రాతిపదికనే వడ్డీని కట్టాల్సి ఉంటుంది. అంటే ఒక్కసారే కాకుండా.. మీ అవసరాన్ని బట్టి కావాల్సినప్పుడు డబ్బు విత్‌డ్రా చేసుకుంటూ.. అంతే మొత్తానికి వడ్డీ చెల్లించే వెసులుబాటు ఇక్కడ లభిస్తుంది.
అత్యవసర సమయాల్లో...
మనలో ప్రతి ఒక్కరికీ ఒకో సమయంలో డబ్బు అవసరం పడుతుంది. సిద్ధంగా ఉంటే సరే. లేదంటే ఎక్కడన్నా... అప్పు పుడుతుందా? అని చూస్తాం. క్రెడిట్ కార్డు వాడాలా..! దానిపై లిమిట్ అయిపోతే రుణం తీసుకోవాలా? లేకపోతే బ్యాంక్‌లో పర్సనల్ లోన్ దొరుకుతుందా? ఇవన్నీ చూస్తాం. ఇంత చేసినా మనకు కావాల్సిన మొత్తానికి కొంత అటు, ఇటు పడుతున్నట్లు అనిపిస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం గురించి తెలిసిన వారికి ఈ దారి కొండంత అండలా కనిపిస్తుంది. చాలా మందికి దీని గురించి తెలియకపోవడమే ఇక్కడ సమస్య.
తనఖాతో తక్కువ వడ్డీపైనే...
మీకు వస్తున్న వేతనం ప్రాతిపదికగా... లేదా మీరేదైనా ఆస్తిని తనఖా పెట్టిన సందర్భంలో స్వల్పకాలానికి బ్యాంకు రుణాన్ని మంజూరు చేస్తుంది. మిగిలిన వివిధ రకాల రుణాలతో పోలిస్తే దీని వడ్డీ రేటు తక్కువే ఉంటుంది. గృహం, జీవిత బీమా పాలసీ, బ్యాంక్ స్థిర డిపాజిట్లు, షేర్లు, బాండ్లు వంటి వాటిని ఆస్తులుగా ఇక్కడ పరిగణించవచ్చు. ఇక్కడ మీరు తనఖాగా బ్యాంకు దగ్గర ఏం పెట్టారన్న విషయంపైనే వడ్డీ రేటు ఆధారపడి ఉంటుంది.
వడ్డీలు ఎలా ఉంటాయి...?
ఆస్తిని తనఖా పెట్టి తీసుకున్న రుణమైతే వడ్డీరేటు సంవత్సరానికి 12 నుంచి 14 శాతం వరకూ ఉంది. ఒకవేళ స్థిర డిపాజిట్లను తనఖాగా పెట్టారనుకుందాం. ఇందులో 70 శాతం వరకూ రుణంగా లభిస్తుంది. గృహ తనఖాపై విధించే వడ్డీరేటుకన్నా... తక్కువ వడ్డీరేటు ఉంటుంది. స్థిర డిపాజిట్ పథకంపై చెల్లించే వడ్డీరేటుకన్నా ఒకశాతం వడ్డీని మాత్రమే బ్యాంకు అదనంగా వసూలు చేస్తుంది. అంటే మీకు స్థిర డిపాజిట్‌పై వచ్చే వడ్డీ 9 శాతం అయితే మీ నుంచి వసూలు చేసేది 10 శాతం ఉంటుంది.
ఓవర్‌డ్రాఫ్ట్ వాడుకునే ముందు ఇవి గుర్తుంచుకోండి...
* ఓవర్‌డ్రాఫ్ట్ కేవలం అత్యవసరాలకు ఉద్దేశించిన ఒక సౌలభ్యం.
* ఈ రుణంతో తీవ్ర ఒడిదుడుకులతో కూడిన స్టాక్స్, కమోడిటీల్లో పెట్టుబడులు పెట్టొద్దు.
* మీ ఓవర్‌డ్రాఫ్ట్‌పై వడ్డీని సకాలంలో సక్రమంగా చెల్లించండి.
* సకాలంలో ఓవర్‌డ్రాఫ్ట్ మొత్తాన్ని బ్యాంకుకు జమ చేసేయండి.
* ఒకవేళ మీరు చెల్లించలేకపోతే... మీరు తనఖాగా ఉంచిన ఆస్తిని బ్యాంక్ లిక్విడేట్ చేసుకునే ప్రమాదం ఉంటుంది.
* మరిన్ని అంశాలను స్పష్టంగా మీ బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్‌ను అడిగి తెలుసుకోండి.
రుణ మంజూరు ఎలా...?
ఉదాహరణకు మీరు మీ ఇంటిని తనఖాగా ఉంచి ఓవర్‌డ్రాఫ్ట్ తీసుకుంటున్నారనుకోండి. ఆస్తి విలువ రూ.10 లక్షలు అనుకుందాం. ఇందులో 50 నుంచి 60 శాతం వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యం లభిస్తుంది. ఒకవేళ మీరు గనక అదే బ్యాంకులో రుణం తీసుకుని ఉంటే... దానిని తిరిగి సరిగా చెల్లించారా లేదా? మీ పునఃచెల్లింపుల సామర్థ్యం ఎంత? వంటి అంశాలను కూడా బ్యాంక్ పరిగణనలోకి తీసుకుంటుంది. ఆయా అంశాల ప్రాతిపదిన ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యం ఇస్తుంది. ఉద్యోగికి వేతనం విషయంలోనూ ఇలాంటి అంశాలనే పరిగణనలోకి తీసుకోవడం జరుగుతుంది.
ఉద్యోగులకైతే వేతనాన్ని బట్టే...
ఇక మీరు వేతన జీవి అనుకోండి. మీ నెలవారీ వేతనంపై బ్యాంకు తాత్కాలిక ఓవర్‌డ్రాఫ్ట్ సౌలభ్యాన్ని కల్పిస్తుంది. మీకు నెలకు రూ.50వేలు వేతనం ఉంటే రూ.25 వేల వరకూ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్నిచ్చే అవకాశముంది. మీ అవసరం, గతంలో మీ రుణ చెల్లింపు సామర్థ్యం... అదే ఖాతాలో మీరు పని చేస్తున్న సంస్థ నుంచి వేతన జమ... వంటి అంశాలపై కూడా ఈ పరిమితి ఆధారపడి ఉంటుంది. పర్సనల్ లోన్‌కన్నా తక్కువ రుణ రేటుకు ఓవర్‌డ్రాఫ్ట్ దొరుకుతుందనేది గమనార్హం.
ఓవర్‌డ్రాఫ్ట్‌కు చేయాల్సిందేంటి?
మీకు ఎంత వేగంగా రుణం మంజూరవుతుందనేది మీరు తనఖా పెట్టే ఆస్తిపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు ఆస్తిని తనఖాగా ఉంచితే... దానికి విలువ కట్టడం, దాన్ని వెరిఫై చేయటం వంటివి ఆలస్యమవుతాయి కనక కొంత సమయం పడుతుంది. అదే ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటివైతే వెంటనే మంజూరవుతుంది. ఈ రుణాల ఫీజుల విషయానికొస్తే 0.5 శాతం నుంచి రూ.25,000 వరకూ ఉంటాయి. మీరు పెట్టిన తనఖా ప్రాతిపదికన ఓవర్‌డ్రాఫ్ట్ పునః చెల్లింపు గడువు ఆధారపడి ఉంటుంది. దీనిని బ్యాంక్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంది.