రిస్కులేని పథకాలివి... ఎంచుకోండి..! | Riskless schemes | Sakshi
Sakshi News home page

రిస్కులేని పథకాలివి... ఎంచుకోండి..!

Published Mon, Oct 23 2017 1:15 AM | Last Updated on Mon, Oct 23 2017 1:15 AM

Riskless schemes

వడ్డీ రేట్లు బాగానే దిగివచ్చాయి. మరికొన్నాళ్ల పాటు ఈ స్థాయిలోనే ఉంటాయంటున్నారు విశ్లేషకులు. నిజం చెప్పాలంటే బ్యాంకుల్లోని రేట్ల కంటే ప్రస్తుతం పోస్టాఫీసు చిన్న మొత్తాల పొదుపు పథకాల్లోనే కాస్తంత మెరుగైన వడ్డీ రేట్లున్నాయి.  ప్రస్తుతమున్న రేట్లే కొన్ని త్రైమాసికాల పాటు కొనసాగే అవకాశముంది.  ఈ నేపథ్యంలో ఆయా పథకం రాబడులు, పన్ను మినహాయింపులను పరిగణనలోకి తీసుకుని సరైన పథకాన్ని ఎంచుకోవడం మంచిది. ఏఏ పథకం ఎంత రాబడినిస్తోంది, లాభనష్టాలేంటన్న వివరాలివిగో...


రిస్క్‌ వద్దా?... ఇదిగో పీపీఎఫ్‌
రిస్క్‌ తీసుకోవడం ఇష్టం లేని వారికి ప్రజా భవిష్యనిధి (పీపీఎఫ్‌) చక్కని సాధనం. దీనికి ఉన్న పన్ను మినహాయింపుల వల్ల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే మెరుగైన సాధనమనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై వచ్చే ఆదాయం పన్ను పరిధిలోకి వస్తుంది. ఒకవేళ బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌పై రేటు 7.5 శాతం ఉంటే 30 శాతం పన్ను పరిధిలోని వారికి పన్ను పోను నికరంగా గిట్టుబాటయ్యేది 5.25 శాతమే. కానీ, పీపీఎఫ్‌లో 7.5 శాతం వడ్డీ రేటు పూర్తిగా పన్ను రహితం.

కాకపోతే పీపీఎఫ్‌లో వార్షిక పెట్టుబడి పరిమితి రూ.1.5 లక్షలే. అంతకన్నా ఎక్కువ పెట్టడానికి వీలుండదు. పీపీఎఫ్‌లో మరో ఆకర్షణీయమైన అంశం దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు. పీపీఎఫ్‌ కాల వ్యవధి 15 సంవత్సరాలు. ఆ తర్వాత ఇష్టమైతే మరో ఐదేళ్లు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. 15 ఏళ్ల తర్వాత మూడు ఆప్షన్లు ఉంటాయి. మూల నిధిని వెనక్కి తీసుకుని, ఖాతాను తదుపరి ఎటువంటి చందాలు లేకుండా కొనసాగించుకోవడం...  లేదా పెట్టుబడి కొనసాగించుకోవడం! పెట్టుబడిని కొనసాగించే ఆప్షన్‌ ఎంచుకుంటే అందుకోసం మరో ఐదేళ్ల పాటు కాల వ్యవధికి పొడిగించాలని దరఖాస్తు ఇవ్వాల్సి ఉంటుంది.

15 ఏళ్ల కాల వ్యవధి ముగిశాక ఏడాది లోపు ఎప్పుడైనా దరఖాస్తును (ఫామ్‌ హెచ్‌) ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ కాల వ్యవధి పొడిగించాలని కోరుతూ దరఖాస్తు చేయకుండా అలానే వదిలేస్తే దానంతట అదే ఐదేళ్లకు పొడిగింపునకు లోనవుతుంది. ఇలా జరిగితే పెట్టుబడి పెట్టేందుకు అవకాశం ఉండదు. ఖాతాలో ఉన్న బ్యాలన్స్‌పై మాత్రం వడ్డీ లభిస్తుంది. ఉద్యోగుల మాదిరిగా నెలసరి వేతనం లేని, జీవిత మలి సంధ్యలో రిటైర్మెంట్‌ ప్రయోజనాలు లేనివారికి ఇది అత్యంత అనుకూల సాధనం. వైద్యులు, ఆర్కిటెక్ట్‌లు, చార్టర్డ్‌ అకౌంటెంట్ల తరహా వృత్తులు, స్వయం ఉపాధిలో ఉన్న వారు తమ పెట్టుబడుల్లో డెట్‌ విభాగం కోసం పీపీఎఫ్‌ను ఎంచుకోవచ్చు.

అయితే, అందరికీ పీపీఎఫ్‌ ఆకర్షణీయం కాదనే చెప్పాలి. యువతీ యువకులై ఉండి... పన్ను ఆదా కోరుకునేట్టు అయితే అటువంటి వారికి ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్లే పీపీఎఫ్‌ కంటే అధిక రాబడులను ఇస్తాయనేది వ్యాల్యూ రీసెర్చ్‌ సంస్థ సీఈవో ధీరేంద్ర కుమార్‌ సూచన. భార్యాభర్తలు ఉద్యోగులై ఉంటే వారికి అప్పటికే ఈపీఎఫ్‌ ఉంటుంది కనుక దానికి బదులు పన్ను ఆదా చేసే ఈఎల్‌ఎస్‌ఎస్‌ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి అధిక రాబడులు పొందొచ్చు.

కూతుళ్లకు ప్రత్యేకం... సుకన్య సమృద్ధి
పదేళ్లలోపు కుమార్తెలున్న తల్లిదండ్రుల కోసం ప్రవేశపెట్టిన పథకమిది. అలాంటి కుమార్తెల పేరిట మాత్రమే ఈ పథకంలో పెట్టుబడి పెట్టే వీలుంది. ఆమె ఉన్నత విద్య, వివాహం వంటి అవసరాల కోసం ఈ సుకన్య సమృద్ధి యోజనను మంచి పెట్టుబడి సాధనమనే చెప్పాలి. 14 ఏళ్ల కాల వ్యవధి కలిగిన ఈ పథకంపై ప్రస్తుతం 8.3 శాతం వడ్డీ రేటుంది. ఇది ఎప్పటికప్పుడు మారుతుంది కూడా. రాబడులు పీపీఎఫ్‌ కంటే దీన్లోనే ఎక్కువ.

పీపీఎఫ్‌ మాదిరే సుకన్య సమృద్ధి యోజనలోనూ వార్షికంగా రూ.1.50 లక్షలకు మించి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు. ఏదైనా పోస్టాఫీసు, ఎంపిక చేసిన బ్యాంకుల్లో రూ.1,000తో ఖాతాను ప్రారంభించుకోవచ్చు. తండ్రి లేదా తల్లి గరిష్టంగా తన ఇద్దరు కుమార్తెల  కోసం రెండు ఖాతాల వరకే దీన్ని ప్రారంభించే అవకాశముంది. రెండు ఖాతాలున్నప్పటికీ సెక్షన్‌ 80సీ కింద పన్ను మినహాయింపు రూ.1.50 లక్షల పెట్టుబడికే పరిమితం.

కుమార్తె భవిష్యత్తు అవసరాలకు డెట్‌ పథకమైన సుకన్య సమృద్ధి యోజన ఒక్కటే సరైనది కాదన్నది కొందరి నిపుణుల సూచన. దీనితోపాటు ఈక్విటీ ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయడం ద్వారా అధిక రాబడులను అందుకునేందుకు అవకాశం ఉంటుంది. అదే సమయం లో సుకన్య సమృద్ధి యోజన పథకంలో ముందుగా డబ్బులను వెనక్కి తీసుకునే అవకాశం లేకపోవడం సానుకూలం. మెచ్యూరిటీనాటికి కుమార్తె ఉన్నత విద్య, వివాహ బాధ్యతలు ఉంటాయి కనుక దాదాపుగా దుర్వినియోగానికి అవకాశం ఉండదు.

ఎఫ్‌డీకన్నా బెటర్‌... పొదుపు సర్టిఫికెట్లు
పీపీఎఫ్‌ మాదిరిగా నేషనల్‌ సేవింగ్స్‌ సర్టిఫికెట్‌లో పెట్టుబడులకు వార్షిక పరిమితి లేదు. ఐదేళ్ల కాల వ్యవధిపై వడ్డీ రేటు 7.8 శాతంగా ఉంది. కాకపోతే వడ్డీ ఆదాయం పూర్తిగా పన్ను పరిధిలోకి వస్తుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి పన్ను అనంతరం రాబడులు చూస్తే 5.38 శాతంగా ఉంటాయి. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే కొంచెం ఎక్కువగా ఉంటాయని అర్థమవుతుంది.

వడ్డీ రేటు పరంగా మాత్రం ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కంటే ఒక శాతం వరకు ఎన్‌ఎస్‌సీలోనే ఎక్కువగా ఉన్నట్టు తెలుస్తోంది. ఎన్‌ఎస్‌సీలో ఏటా వడ్డీ రూపంలో పొందే ఆదాయంపై పన్ను మినహాయింపునకు అవకాశం ఉంది. బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లపై 9–9.5% వడ్డీ రేట్లున్న సమయంలో తక్కువ వడ్డీ రేటుతో ఎన్‌ఎస్‌సీ వెలవెలబోయింది. బ్యాంకు రేట్లు బాగా తగ్గిపోవడంతో ఇప్పుడు ఎన్‌ఎస్‌సీకి తిరిగి డిమాండ్‌ ఏర్పడింది. బ్యాంకుల్లో వడ్డీ రేట్లు 7% మించి లేవు. దీనిప్రకారం ఎన్‌ఎస్‌సీ ఆకర్షణీయమే.

సీనియర్‌ సిటిజన్స్‌కు... సేవింగ్‌ స్కీమ్‌
ఐదేళ్ల కాల వ్యవధితో కూడిన ఈ పథకంలో పెట్టుబడిపై ప్రస్తుతం 8.3% వడ్డీ లభిస్తోంది. కాల వ్యవధిని ఐదేళ్ల తర్వాత మరో మూడేళ్లకు పొడిగించుకోవచ్చు. రిటైర్‌ అయిన వారికి క్రమం తప్పకుండా ఆదాయాన్నందించే పథకమిది. ఇందులో గరిష్టంగా రూ.15 లక్షల వరకే పెట్టుబడి పెట్టేందుకు అనుమతి ఉంది. 60 ఏళ్లు దాటిన వారే అర్హులు. ముందుగానే స్వచ్చంద పదవీ విరమణ తీసుకుని, మరో ఉద్యోగంలో చేరకపోతే 58 ఏళ్లకే ఈ ఖాతా తెరుచుకోవచ్చు.

రక్షణ శాఖలో పనిచేసిన వారికి వయసుపరంగా పరిమితులు లేవు. రిటైర్‌ అయిన వారికి నిరంతర ఆదాయం కోసం సీనియర్‌ సిటిజన్స్‌ సేవింగ్‌ స్కీమ్‌ అనువైనదని నిపుణుల సూచన. హామీతో కూడిన రాబడులను ప్రతి 3 నెలలకు అందిస్తుంది. రూ.15 లక్షలు ఇన్వెస్ట్‌ చేశాక ఇంకా కార్పస్‌ మిగిలితే బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, పోస్టాఫీసు నెలసరి ఆదాయ పథకంలో ఇన్వెస్ట్‌ చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement