7 శాతానికి పైనే వడ్డీ అందిస్తున్న అత్యధిక బ్యాంకులు
సీనియర్ సిటిజన్స్‌కు 7.5 శాతం పైనే..
ఎస్‌బీఐ అమృత కలశ స్కీం మార్చి వరకు పొడిగింపు
డిసెంబర్ నుంచి వడ్డీ రేట్లు తగ్గే అవకాశం
బ్యాంకుల్లో డిపాజిట్ చేయడం ద్వారా వడ్డీ పొందాలనుకునే వారికి ఇదే మంచి తరుణం. ప్రస్తుతం డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ట స్థాయిలో ఉన్నాయి. అయితే భవిష్యత్తులో వీటిని తగ్గించే అవకాశముందంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్పష్టమైన సంకేతాలను అందించింది. డిసెంబర్‌కు పావు శాతం, వచ్చే మార్చి నాటికి మరో పావు శాతం కలిపి.. ఆరు నెలల్లో వడ్డీ రేట్లు అర శాతం వరకూ తగ్గుతాయని అంచనా.
ఇప్పటికే అమెరికా వడ్డీ రేట్లు తగ్గించడంతో మన దేశంలోనూ వడ్డీ రేట్లు తగ్గుతాయనుకుంటుండగా.. ద్రవ్యోల్బణం సాకుతో ఆర్‌బీఐ తగ్గింపును వాయిదా వేసింది. దీంతో బ్యాంకులు కూడా అధిక వడ్డీ రేటును అందిస్తున్న పరిమిత కాల డిపాజిట్ల పథకాలను కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ రంగ బ్యాంకులు సాధారణ ప్రజలకు 7.10 శాతం నుంచి 7.40 శాతం వరకు వడ్డీని అందిస్తుండగా, ప్రైవేటు రంగ బ్యాంకులు 7.25 నుంచి 8.10 శాతం వరకు అందిస్తున్నాయి. – సాక్షి, అమరావతి
కనిష్ట స్థాయికి డిపాజిట్లు.. మేల్కొన్న బ్యాంకులు
దేశీయ అతి పెద్ద బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమృత కలశ, అమృత వృష్టి పేరుతో ప్రవేశపెట్టిన రెండు ప్రత్యేక డిపాజిట్ల పథకాలను 31 మార్చి, 2025 వరకు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. 444 రోజుల కాల పరిమితి ఉన్న అమృత వృష్టి పథకంపై 7.25 శాతం, 400 రోజుల అమృత కలశ పథకంపై 7.10 శాతం వడ్డీ రేటును ఎస్‌బీఐ అందిస్తోంది.
అతి పెద్ద ప్రైవేటు రంగ హెచ్‌డీఎఫ్‌సీ నాలుగేళ్ల ఏడు నెలల కాలపరిమితికి 7.40 శాతం వడ్డీని అందిస్తోంది. చైతన్య గోదావరి వంటివి ఏడాది దాటి.. రెండేళ్ల లోపు కాల పరిమితికి 8.10 శాతం వడ్డీని అందిస్తున్నాయి. కొంతకాలంగా వడ్డీ రేట్లు తక్కువగా ఉండి బంగారం, స్టాక్ మార్కెట్లు మంచి రాబడి ఇస్తుండటంతో ప్రజలు బ్యాంకు డిపాజిట్ల వైపు అంతగా మొగ్గు చూపలేదు. దీంతో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బ్యాంకుల డిపాజిట్లు కనిష్ట స్థాయికి చేరాయి.
దీంతో ఇప్పుడు బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచి డిపాజిట్లను పెంచుకోవడానికి ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని చేపట్టాయి. ఈ స్థాయి వడ్డీ రేట్లు ఎంతోకాలం కొనసాగే అవకాశం లేదని, దీర్ఘకాలిక డిపాజిట్లలో ఇన్వెస్ట్ చేయడానికి ఇది మంచి తరుణమంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment