సేవింగ్స్ వడ్డీ ఆదాయంపై పన్ను ఉంటుందా..?
నేను బిర్లా సన్ లైఫ్‌కు చెందిన గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఫండ్‌లో ఏడాదిన్నర క్రితం కొంత మొత్తం ఇన్వెస్ట్ చేశాను. ఇటీవలే ఈ ఫండ్ యూనిట్లను విక్రయించాను. అయితే సదరు మ్యూచువల్ ఫండ్ సంస్థ 30 శాతం మూల««దlన లాభాల పన్ను విధించింది. ఏడాది దాటిన ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ యూనిట్లను విక్రయిస్తే ఎలాంటి మూలధన లాభాల పన్ను ఉండదు కదా? మరి ఈ సంస్థ ఎందుకు పన్ను విధించింది? – పరమేశ్వర్, విజయవాడ
దేశీయ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఈక్విటీ ఫండ్స్‌కే మీరు చెప్పిన పన్ను నిబంధనలు లేదా రాయితీలు వర్తిస్తాయి. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌కు ఈ రాయితీలు వర్తించవు. డెట్ ఫండ్స్‌కు వర్తించే పన్ను నిబంధనలే ఇలాంటి గ్లోబల్ ఫండ్స్‌కు వర్తిస్తాయి. వీటిని ఈక్విటీ(ఇంటర్నేషనల్) ఫండ్స్‌గా పరిగణిస్తారు. ఈ తరహా ఫండ్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను మూడేళ్ల తర్వాత విక్రయిస్తే, 20 శాతం మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మూడేళ్లలోపే ఈ ఫండ్ యూనిట్లను విక్రయిస్తే, స్వల్ప కాల మూలధన లాభాల పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇది మీ ఆదాయపు పన్ను స్లాబ్‌ననుసరించి ఉంటుంది. ఈ పరంగానే బిర్లా సన్ లైఫ్ గ్లోబల్ రియల్ ఎస్టేట్ ఫండ్ మీకు 30 శాతం పన్ను విధించి ఉంటుంది.
నేను కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. నా వయస్సు 50 సంవత్సరాలు. ఆదాయపు పన్ను చట్టం, సెక్షన్ 80 సీ కింద ఇప్పటికే రూ. లక్షన్నర వరకూ పన్ను ప్రయోజనాలు పొందుతున్నాను. అదనపు పన్ను ప్రయోజనాలు పొందడం కోసం ఏదైనా బీమా లేదా పెన్ష న్ ప్లాన్ ను తీసుకోవాలనుకుంటున్నాను. తగిన సూచనలివ్వండి. – సుధాకర్, విశాఖపట్టణం
ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ కింద జీవిత బీమా ప్రీమియమ్‌లు, పెన్షన్ ప్లాన్ ప్రీమియమ్‌లకు రూ. లక్షన్నర వరకూ పన్ను రాయితీ లభిస్తుంది. మీరు ఇప్పటికే ఈ పరిమితి వరకూ ప్రయోజనాలు పొందుతున్నారు. కాబట్టి, అదనంగా బీమా, పెన్షన్ ప్లాన్ లు తీసుకున్నా, ఈ సెక్షన్ కింద ఎలాంటి పన్ను మినహాయింపులు మీరు పొందలేరు. అయితే నేషనల్ పెన్షన్ సిస్టమ్(ఎన్ పీఎస్)లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80 సీ కింద మరో రూ.50,000 వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. ఆరోగ్య బీమా తీసుకుంటే దానికి సెక్షన్ 80 డి కింద మరో రూ.25,000 వరకూ పన్ను మినహాయింపులు పొందవచ్చు. వీటితో పాటు కొన్ని రుణాలు, వ్యయాలు, విరాళాలపై పన్ను ప్రయోజనాలు పొందవచ్చు.
నేను నా తల్లిదండ్రుల కోసం ఒక్కొక్కరికి రూ. 3 లక్షల ఆరోగ్య బీమా పాలసీలు తీసుకున్నాను. దీని నుంచి సూపర్ టాప్ అప్ ప్లాన్ కు పోర్ట్ చేసుకోవచ్చా ? – గణేశ్, తిరుపతి
సాధారణంగా మీరు ఒక సంస్థ నుంచి వైద్య బీమాను తీసుకున్నారనుకోండి. ఈ బీమా పాలసీని మరో సంస్థకు పోర్ట్ (బదిలీ) చేసుకోవచ్చు. నో క్లెయిమ్ బోనస్, బీమా తీసుకోకముందే ఉన్న జబ్బుల కవరేజ్ వంటి ప్రయోజనాలు నష్టపోకుండా ఇలా పోర్ట్ చేసుకోవచ్చు. మొబైల్ నంబర్ పోర్టబిలిటి(ఎంఎన్ పీ)లాగానే ఈ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ కూడా మొబైల్ నంబర్ పోర్టబిలిటీలో మీ నంబర్ మారకుండానే టెలిఫోన్ ఆపరేటర్‌ను మార్చుకునే వీలు ఉంది కదా. ఇలాంటిదే ఇది కూడా. ఈ బీమా పోర్టబిలిటీలో ఒకే విధమైన లేదా ఒకే సెగ్మెంట్ పాలసీలను బదిలీ చేసుకోవడానికే వీలుంటుంది. అంతేకాని మీరు తీసుకున్న బీమా పాలసీల నుంచి సూపర్ టాప్–అప్ ప్లాన్‌లకు పోర్ట్ చేసుకోవడానికి వీలుండదు.
నేను, నా భార్య కలసి ఒక బ్యాంక్‌లో జాయింట్ సేవింగ్స్ ఖాతా తెరిచాము. ఈ ఖాతాలోని నిల్వపై వచ్చే వడ్డీని ఐటీ రిటర్న్‌ల్లో చూపాలా ? సేవింగ్స్ ఖాతాపై వచ్చిన వడ్డీ ఆదాయంపై ఏమైనా రాయితీలు ఉన్నాయా? ఐటీ రిటర్న్‌ల్లో ఏ పద్దు కింద ఈ వడ్డీ ఆదాయాన్ని చూపాలి ? – జావేద్, కరీంనగర్
సేవింగ్స్ ఖాతాలోని మొత్తంపై వచ్చే వడ్డీని ఐటీ రిటర్న్‌ల్లో చూపాల్సిందే. మీది జాయింట్ అకౌంట్ కాబట్టి, మీ భార్యకు ఎలాంటి సంపాదన లేకపోతే, ఈ వడ్డీ ఆదాయాన్ని మీ ఆదాయంతో కలిపి చూపాలి. ఒక వేళ మీ భార్య ఉద్యోగం / వ్యాపారం నిర్వహిస్తున్నట్లయితే మీ ఆదాయంతో కానీ, లేద , మీ భార్య ఆదాయంతో కానీ కలిపి చూపించాలి. ఇతర మార్గాల ద్వారా వచ్చిన ఆదాయం అనే పద్దు కింద సేవింగ్స్ ఖాతా నుంచి వచ్చే వడ్డీని చూపించాలి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80 టీటీఏ ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో అన్ని సేవింగ్స్ ఖాతాల్లోని వడ్డీ ఆదాయంపై రూ.10,000 వరకూ పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇంతకు మించిన వడ్డీ ఆదాయం ఆర్జిస్తే ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్‌లు దాఖలు చేసేటప్పుడు వడ్డీ సర్టిఫికెట్‌లు దాఖలు చేయాల్సిన పనిలేదు. అయితే దీనికి సంబంధించిన ఒరిజినల్‌ను మాత్రం మీ దగ్గరే భద్రంగా ఉంచుకోవాలి. ఎవరైనా అసెసింగ్ ఆఫీసర్ ట్యాక్స్ స్క్రూటినీ నిర్వహిస్తే అప్పుడు ఈ వడ్డీ సర్టిఫికెట్ ఒరిజినల్‌ను చూపించాల్సి ఉంటుంది.
– ధీరేంద్ర కుమార్ సీఈవో, వ్యాల్యూ రీసెర్చ్