రైతన్న ఆగమాగం! | banks harraced to formers for intrest loans | Sakshi
Sakshi News home page

రైతన్న ఆగమాగం!

Published Tue, Feb 23 2016 2:07 AM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM

రైతన్న ఆగమాగం! - Sakshi

రైతన్న ఆగమాగం!

బ్యాంకులకు ‘వడ్డీ’ ఎగ్గొట్టిన రాష్ట్ర ప్రభుత్వం
క్షేత్రస్థాయిలో రైతులపై ప్రతాపం చూపుతున్న బ్యాంకులు
అనధికారికంగా నిలిచిపోయిన రబీ పంట రుణాల పంపిణీ
ఏడాదిగా రూ. 250 కోట్లకుపైగా బ్యాంకులకు బాకీ


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం రైతుల పంట రుణాలకు ఎసరు పెడుతోంది.. బ్యాంకులకు ‘వడ్డీ’ ఎగ్గొట్టిన సర్కారు నిర్వాకం అన్నదాతలను ఆందోళనలో ముంచెత్తుతోంది. ‘వడ్డీ రహిత పంట రుణాల’ కింద వడ్డీ రీయింబర్స్‌ను ప్రభుత్వం వాయిదా వేస్తూ పోతుంటే... అటు బ్యాంకర్లు రైతులకు రుణాలు ఇవ్వకుండా మొండికేస్తున్నారు. రుణాల మంజూరును వాయిదాలు వేస్తూ బ్యాంకుల చుట్టూ తిప్పించుకుంటున్నారు. ప్రభుత్వ తీరు ఇలాగే కొనసాగితే అసలు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే పరిస్థితే ఉండదని హెచ్చరిస్తున్నాయి.

ఏడాదిగా పంట రుణాలకు సంబంధించిన వడ్డీని చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. ఈ వడ్డీకి సంబంధించి రాష్ట్రంలో ఉన్న అన్ని బ్యాంకులకు దాదాపు రూ. 250 కోట్లకుపైగా బాకీ పడింది. తమకు వడ్డీ సొమ్ము రీయింబర్స్ చేయాలంటూ బ్యాంకులు వరుసగా క్లెయిమ్‌లు దాఖలు చేయడంతో పాటు లేఖల మీద లేఖలు రాసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులకు కొత్త రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు మొండికేస్తున్నాయి. అసలే రబీ సాగుకు పెట్టుబడులు లేక తల్లడిల్లుతున్న లక్షలాది మంది రైతులను ప్రభుత్వ నిర్వాకం మరింత ఆందోళనలో కూరుకుపోయేలా చేసింది. గత ఆరు నెలల్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ (ఎస్‌ఎల్‌బీసీ) సమావేశాలన్నింటిలోనూ బ్యాంకర్లు ఈ అంశాన్ని ప్రస్తావించారు. సర్కారు ప్రతిసారీ దాటవేసే వైఖ రిని అనుసరిస్తోంది. దీంతో ఆర్థిక లావాదేవీలు తక్కువ మొత్తంలో ఉండే చిన్న బ్యాంకులు దిక్కులు చూస్తున్నాయి. వడ్డీ సొమ్మును విడుదల చేయాలంటూ సర్కారుకు పదే పదే విన్నవించుకుంటున్నాయి. బడా బ్యాంకులు సైతం వడ్డీ సొమ్ము రాబట్టుకునేందుకు ఉన్నతాధికారులకు లేఖాస్త్రాలు సంధిస్తున్నాయి.

కేంద్రం ఇచ్చినా లెక్కచేయని రాష్ట్రం
రాష్ట్రంలో పంట రుణాలకు ‘వడ్డీ లేని రుణ పథకం’ అమలవుతోంది. దాని ప్రకారం రైతులకు ఇచ్చే పంట రుణాలకు చెల్లించాల్సిన ఏడు శాతం వడ్డీని ప్రభుత్వమే చెల్లిస్తుంది. అందులో కేంద్ర ప్రభుత్వం మూడు శాతం, రాష్ట్ర ప్రభుత్వం మిగతా నాలుగు శాతం వడ్డీ సొమ్మును తమ వాటాగా బ్యాంకులకు అందజేస్తాయి. నిబంధనల ప్రకారం పంట రుణాలను ఆరు నెలలకోసారి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్రకారం తమకు ఎంత మొత్తం వడ్డీ సొమ్మును రీయింబర్స్ చేయాల్సి ఉందో బ్యాంకులు లెక్కగట్టి, సంబంధిత రైతుల వివరాలతో వ్యవసాయ శాఖకు క్లెయిమ్‌లు సమర్పిస్తాయి. వ్యవసాయ శాఖ వాటిని పరిశీలించి, ధ్రువీకరించినట్లుగా ‘క్లియరెన్స్’ ఇస్తుంది. ఈ జాబితాను బ్యాంకులు రిజర్వు బ్యాంకుకు పంపించి కేంద్రం నుంచి రావాల్సిన మూడు శాతం వడ్డీ రీయింబర్స్‌ను పొందుతాయి. అదే సమయంలో మిగతా నాలుగు శాతం వడ్డీ సొమ్మును చెల్లించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరతాయి. క్లెయిమ్‌లు అందిన మూడో రోజున ప్రభుత్వం ఈ మేరకు నిధులను బ్యాంకులకు అందజేయాలి. కేంద్రం ఎప్పటికప్పుడు తాను చెల్లించాల్సిన వాటాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గత ఏడాదిగా బ్యాంకర్లకు వడ్డీ సొమ్ము చెల్లించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీనిపై ఆగ్రహంగా ఉన్న బ్యాంకర్లు... ఆ ప్రభావాన్ని రైతులపై చూపుతున్నారు. పంట రుణాల పంపిణీకి రకరకాల కొర్రీలు పెడుతున్నారు. దీంతో రైతులు ఆందోళనలో కూరుకుపోతున్నారు. ఫలితంగా రబీ పంట రుణాల పంపిణీ ఎక్కడికక్కడే ఆగిపోయింది. ఇప్పటికి వార్షిక రుణ ప్రణాళికలో నిర్దేశించిన లక్ష్యంలో నాలుగోవంతు రుణాలూ పంపిణీ కాలేదు.

 వచ్చే సీజన్‌పై ఆందోళన
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 2015 ఏప్రిల్ ఒకటి నుంచి ఇప్పటి వరకు వడ్డీ లేని రుణాల పథకంలో 25.91 లక్షల మంది రైతులు లబ్ధి పొందారు. రాష్ట్రంలో ఉన్న బ్యాంకులు వారందరికీ రూ. 12,757.29 కోట్లు పంట రుణాలను పంపిణీ చేశాయి. వీటి క్లెయిమ్‌లను వ్యవసాయ శాఖ పరిశీలించడంతో పాటు బ్యాంకులకు క్లియరెన్స్ ఇచ్చింది. కానీ సర్కారు వడ్డీ సొమ్ము ఇవ్వక పరిస్థితి ఇబ్బందికరంగా మారిం ది. ఇదే తీరు కొనసాగితే వచ్చే ఏడాది వడ్డీ లేని రుణాలు పంపిణీ చేసే పరిస్థితి లేదని బ్యాంకర్లు ఆగ్రహాన్ని వెలిబుచ్చుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement