కర్షకుడికి కరెన్సీ కష్టాలు
కర్షకుడికి కరెన్సీ కష్టాలు
Published Thu, Jul 6 2017 11:17 PM | Last Updated on Mon, Oct 1 2018 2:44 PM
– బ్యాంకులు, ఏటీఎంల్లో నగదు లేక అల్లాడుతున్న రైతులు
–ఇన్‌పుట్ సబ్సిడీ ఖాతాలకు జమ అయినప్పటికీ తీసుకోలేని పరిస్థితి
– క్యాష్ లేదంటూ వెనక్కి పంపుతున్న బ్యాంకర్లు
– నిలిచిపోయిన పంట రుణాల పంపిణీ
కర్నూలు(అగ్రికల్చర్): ఈ రైతు పేరు వెంకటస్వామి. దేవనకొండ మండలం తెర్నేకల్ గ్రామం. 2014 ఇన్‌పుట్ సబ్సిడీ రూ.15 వేలు ఇటీవల బ్యాంకు ఖాతాకు జమ అయ్యింది. పంట పెట్టుబడి కోసం ఆ మొత్తాన్ని తీసుకోవడానికి వెళ్లాడు. నగదు లేదని బ్యాంకు అధికారుల నుంచి సమాధానం వచ్చింది. మూడు సార్లు వెళ్లినా అదే జవాబు రావడంతో నిరాశకు గురయ్యాడు. ఒక్క వెంకటస్వామి మాత్రమే కాదు.. జిల్లాలో వేలాది మంది రైతులు ఇదే పరిస్థితి ఎదుర్కొంటున్నారు.
కరువు మండలాలకు సంబంధించి 2014, 15, 16 ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అవుతోంది. ఖరీఫ్ పంటల సాగు సమయంలో పరిహారం రావడంతో రైతులకు ఊరట లభించింది. పెట్టుబడుల సమస్య తీరినట్లేనని సంతోషించారు. తీరా బ్యాంకులకు వెళితే ఆ సంతోషం నీరుగారుతోంది. నగదు లేదని బ్యాంకర్లు చెబుతున్నారు. కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లో పడిన ఇన్‌పుట్ సబ్సిడీని పంట రుణాలకు జమ చేసుకుంటున్నాయి. నిబంధనల ప్రకారం ఇన్‌పుట్ సబ్సిడీని పాత బకాయిలకు జమ చేసుకోరాదు. కానీ పలు మండలాల్లో జమ చేసుకొని రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారు.
రూ.628 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ
మూడేళ్లకు సంబంధించి జిల్లాకు రూ.628 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ వచ్చింది. కీలక సమయంలో వచ్చినప్పటికీ రైతులకు ఉపయోగం లేకుండా పోతోంది. జిల్లాకు ఆర్‌బీఐ నుంచి నెల రోజులుగా నగదు రావడం లేదు. గత ఏడాది రూ.500, రూ.1000 నోట్ల రద్దు సమయంలో నగదు రహిత లావాదేవీలు అంటూ హడావుడి చేసినా ఇప్పడు పట్టించుకునే వారు లేరు. దీంతో జిల్లా వ్యాప్తంగా నగదు సమస్యలు తీవ్రమయ్యాయి. జిల్లాలో 34 బ్యాంకులు, 458 బ్రాంచీలు ఉన్నాయి. వీటికి అనుబంధంగా 485 ఏటీఎంలు ఉన్నాయి. దాదాపు అన్ని బ్యాంకులు నగదు కొరత ఎదుర్కొంటున్నాయి. 85 నుంచి 90 శాతం ఏటీఎంల్లో నగదు లేదు. ఇటు ఏటీఎంల్లోను, అటు బ్యాంకుల్లోను నగదు లేకపోవడంతో రైతులు, ఉద్యోగులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.
అప్పులు చేయక తప్పడం లేదు...
బ్యాంకు ఖాతాల్లో డబ్బు ఉన్నా రైతులు కీలక సమయంలో తీసుకునే అవకాశం లేకుండా పోయింది. దీంతో పంట పెట్టుబడుల కోసం అప్పులు చేయక తప్పడం లేదు. పంట రుణాల పంపిణీకి కూడా నగదు కొరత అడ్డంకిగా మారింది. ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి రూ.3,297.68 కోట్ల పంట రుణాలు పంపిణీ చేయాల్సి ఉంది. నగదు లేకపోవడంతో రుణాల పంపిణీ ఎక్కడికక్కడ నిలిచిపోయింది. రోజువారీగా వస్తున్న డిపాజిట్లతోనే బ్యాంకులు కొంత వరకు నెట్టుకొస్తున్నాయి.
ఒకట్రెండు రోజుల్లో నగదు వచ్చే అవకాశం - వి.మోహన్, ఎల్‌డీఎం
జిలాల్లో నగదు కొరత ఎక్కువగా ఉన్న మాట వాస్తవమే. ఈ విషయాన్ని ఆర్‌బీఐ, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాం. ఖరీఫ్ పంటల సాగు ముమ్మరంగా ఉన్న నేపథ్యంలో రైతులకు పెట్టుబడుల అవసరం ఉంది. ఈ సమయంలోనే ఇన్‌పుట్ సబ్సిడీ కూడా వచ్చింది. రైతుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని జిల్లాకు అవసరమైన నగదు పంపాలని కోరాం. విజయవాడకు వచ్చినట్లు సమాచారం ఉంది. జిల్లాకు ఒకట్రెండు రోజుల్లో నగదు వచ్చే అవకాశముంది.
Advertisement