బ్యాంకు వద్ద తొక్కిసలాట
- విరిగిపోయిన బారికేడ్లు
- ఐదుగురికి గాయాలు
- లాఠీలకు పని చెప్పిన పోలీసులు
గూడూరు: స్థానిక స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద జరిగిన తొక్కిసలాటలో ఐదుగురు గాయపడగా.. మరికొంత మంది వృద్ధులు, మహిళలు అస్వస్థతకు గురయ్యారు. బ్యాంక్ అధికారులు అందిస్తున్న టోకన్ల కోసం ప్రజలు ఎగబడడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. గురువారం నగదు ఇస్తామని బ్యాంకు అధికారులు ముందుగానే ప్రకటించడంతో ఖాతాదారులు ఉదయం 6 గంటలకే పెద్ద ఎత్తున తరలి వచ్చి క్యూ కట్టారు. బ్యాంకు సిబ్బంది 10:30 గంటలకు చేరుకొని టోకెన్ల ద్వారా 400 మందికి రూ. 4 వేలు చొప్పున నగదు అందిస్తామని చెప్పారు. మిగిలిన వారికి సోమవారం టోకెన్లు ఇస్తామని మేనేజర్ ప్రదీప్‌కుమార్ మైక్‌లో ప్రకటించారు. దీంతో క్యూ లైన్‌లో ఉన్న వందలాది మంది ఆందోళనకు గురయ్యారు. నగదు అందదనే ఆందోళనతో ఖాతాదారులు ఒకరిపై ఒకరు ఎగబడ్డారు. దీంతో కట్టెలతో కట్టిన బ్యారికేడ్లు విరిగిపోయి.. క్యూలైన్‌లో ఉన్న వారంతా ఒక్కసారిగా కింద పడిపోయారు. ఈ నేపథ్యంలో తొక్కిసలాట జరిగడంతో ఖాతాదారులను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీలకు పని చెప్పారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.