కథలకు ఓ బ్యాంకు.. ‘కథా పచ్చీస్‌– స్టోరీ బ్యాంక్‌’ | Katha Pachisi-the story bank: the power of storytelling for better communication | Sakshi
Sakshi News home page

కథలకు ఓ బ్యాంకు.. ‘కథా పచ్చీస్‌– స్టోరీ బ్యాంక్‌’

Published Thu, Dec 16 2021 12:10 AM | Last Updated on Fri, Dec 17 2021 6:28 PM

Katha Pachisi-the story bank: the power of storytelling for better communication - Sakshi

మనుషుల్ని ఆకట్టుకోవాలంటే వారికో కథ చెప్పు అంటుంది మోనికా టాండన్‌. ఢిల్లీలో ఆమె ఒక బ్యాంకు తెరిచింది. దాని పేరు ‘కథా పచ్చీస్‌– స్టోరీ బ్యాంక్‌’. ఆ బ్యాంకులో కథలు ఉంటాయి. తల్లిదండ్రులు, టీచర్లు, ఎంట్రప్రెన్యూర్లు, నాయకులు... అందరూ సరైన కమ్యూనికేషన్‌ స్కిల్స్‌ అలవర్చుకోవాలంటే వారికి కథలు చెప్పడం రావాలి అంటుంది మోనికా. కథలు చెప్తూ పోతే విజయం దానంతట అదే వస్తుందని ఆమె సూత్రం. తనను తాను ‘కార్పొరేట్‌ స్టోరీ టెల్లర్‌’ అని చెప్పుకుంటుంది. ఊళ్లో అవ్వలు కథలు చెప్తారు. ఎవరూ డబ్బు ఇవ్వరు. మోనికా అలా కాదు. కథలతో కరెన్సీ సంపాదించవచ్చని నిరూపిస్తోంది.

ఒక సంస్థలోని ఉద్యోగులతో మోనికా టాండన్‌ ‘స్టోరీ టెల్లింగ్‌’ సెషన్‌ పెట్టి ఈ కథ చెబుతుంది. ‘ఇది ఒక పీత కథ. దానిని హెర్మిట్‌ పీత అంటారు. హెర్మిట్‌ జాతి పీతలు తమ సైజు పెరిగే కొద్దీ ఒక పని చేస్తాయి. ఏమిటో తెలుసా? తమను కప్పి ఉన్న పెంకును వదిలి కొత్త పెంకును వెతుక్కుంటాయి. అవి పాత పెంకును నాశనం చేయవు. అలాగే పాత పెంకే నాకు కావాలి అనుకోవు. దానిని మరొక పీత కోసం వదిలిపెట్టి తమ సైజుకు తగ్గ కొత్త పెంకులోకి మారి తమని తాము కాపాడుకుంటాయి. మళ్లీ సైజు పెరిగాయనుకో.

మరో కొత్త పెంకును వెతుక్కుని వెళ్లిపోతాయి. ఇలా హెర్మిట్‌ జాతి పీతలు జీవితాంతం చేస్తూనే ఉంటాయి. ఆలోచించండి. మనం అలా చేస్తున్నామా? ఒక పెంకును వదిలి దానితో డిటాచ్‌మెంట్‌ పాటిస్తూ కొత్త పెంకులోకి వెళుతున్నామా? ఇవాళ కోవిడ్‌ రోజులు. ఉద్యోగంలో మార్పు ముఖ్యం. మారాల్సి వస్తే ధైర్యంగా మారాలి. కాదు... సేఫ్‌ జోన్‌లో ఉండిపోదామని అనుకుంటే ఎదుగుతామా? ఒక పీతకే అంత ధైర్యం ఉంటే మనిషికి ఎంత ధైర్యం ఉండాలి. మారడానికి సిద్ధంగా ఉండండి. కొత్తది వెతకండి. కొత్తది చేయడమే ఎదుగుదల’...

ఈ కథ చెప్పాక ఉద్యోగులలో ఒక ధైర్యం వచ్చే అవకాశం ఉంది. ‘పరిస్థితిని బట్టి మీ కుటుంబ సభ్యులను, ఆఫీస్‌ బాస్‌ను, కలీగ్స్‌ను ఒప్పించడానికి సరైన కథ చెప్పండి. లేదా మీకు మీరే ఒక కథ చెప్పుకుని సందర్భాలకు సిద్ధం కండి’ అంటుంది మోనికా టాండన్‌.

ఢిల్లీ సమీపంలో ఉన్న గుర్‌గావ్‌లో ఆమె సంస్థ ఉంది. దాని పేరు ‘కథా పచ్చీస్‌’. అది ఒక స్టోరీ బ్యాంక్‌. జీవితంలో సరైన పదాలతో సరైన కమ్యూనికేషన్‌ చేస్తే ఎదుటివారి మనసు గెలుచుకోవచ్చని ఈ సంస్థ నమ్ముతుంది. టీచర్లు, బిజినెస్‌ ప్రొఫెషనల్స్, విద్యార్థులు, యువ నాయకులు, తల్లిదండ్రులు.. అందరూ సరిగ్గా ఒక కథ చెప్పడం నేర్చుకుంటే సరిగ్గా తాము చెప్పాలనుకున్నది ఎదుటివారికి చెప్పగలరని అంటుంది మోనికా టాండన్‌. హెచ్‌ఆర్‌ రంగంలో 15 ఏళ్ల పాటు పని చేసిన టాండన్‌ ఆ ఉద్యోగంలో ఎక్సయిట్‌ చేసేది ఏమీ లేదని అర్థమయ్యి ఆ ‘పాత పెంకును’ వదిలి స్టోరీటెల్లర్‌గా కొత్త పెంకులోకి వచ్చింది.

‘కథ చెప్పడం ఆదిమ కళ. ఒక కథ చెప్పనా అనగానే ఎదుటి మనిషి ఎలాంటివాడైనా ఊ కొట్టడానికి రెడీ అయిపోతాడు. గొప్ప గొప్ప నాయకులు ప్రజలకు తమ ప్రసంగాల్లో కథలూ కాకరకాయలు చెబుతారు. కార్పొరేట్‌ అధిపతులు తమ ఉద్యోగులను మోటివేట్‌ చేయడానికి కథలు చెబుతారు. బో«ధకులు కూడా విద్యార్థులను ఆకర్షించడానికి కథలు చెబుతారు. అంతెందుకు? రాత్రిపూట రకరకాల కథలు చెప్పే తల్లిదండ్రులను పిల్లలు ఎంతో ఇష్టపడతారు. కథను ఎలా వదలుకుంటాం. ఇది సావధాన కొరత ఉన్న ప్రపంచం. అంటే మనం చెప్పేదానికి ఎవరూ అటెన్షన్‌ ఇవ్వడం లేదు. ఏ ఫోన్‌లోనో తల దూర్చి ఉంటారు. వారిని దారిలోకి తెచ్చుకోవాలంటే కథ చెప్పడమే మార్గం’ అంటుంది మోనికా టాండన్‌.

సేల్స్‌లో లక్ష్యాలు ఉన్న ఉద్యోగులు ఆ లక్ష్యాలు సాధించగలమా లేదా అనుకుంటూ ఉంటే మోనికా వారికి దశరథ్‌ మాంజీ కథ చెబుతుంది. ‘బిహార్‌లోని గయాలో కొండను పిండి కొట్టి ఆ నిరుపేద గ్రామీణుడు దారి వేశాడు. 22 ఏళ్ల పాటు ఉత్త చేతులతో అతడా పని చేశాడు. మీరు మీ లక్ష్యాలను సాధించగలరు... ఈ కథను పదే పదే తలుచుకుంటే’ అంటుందామె. ‘ఒక కాలు కోల్పోయిన అరుణిమ సిన్హా నిరాశలో కూరుకుపోలేదు. ప్రపంచంలోని అన్ని పర్వతాలను ఎక్కింది. ఎవరెస్ట్‌ ఎక్కిన తొలి దివ్యాంగ మహిళగా రికార్డు స్థాపించింది. మనకు ఆమె స్ఫూర్తి’ అంటుంది.

చిన్నప్పుడు అవ్వ చెప్పే కథల్లో ‘ఏ దిక్కైనా వెళ్లు... ఉత్తరం దిక్కు తప్ప’ అని పూటకూళ్లామె అంటే రాకుమారుడు ఉత్తరం దిక్కుకే వెళతాడు. ఆ దారిలో ప్రమాదాలు ఉన్నా వాటిని దాటి ఊహించని లాభాలు పొందుతాడు. ఇంట్లో పిల్లలు అలా కథలతో ధైర్యం తెచ్చుకునేవారు. కథలతో, ఘటనలతో నూరి పోసే విషయాలు జ్ఞాపకం ఉంటాయి అంటుంది టాండన్‌. అందుకే కథల బ్యాంకు తెరిచి ప్రతి కథను విలువైన మణిగా ఆమె భావిస్తుంది.

తల్లి చెప్పిన కథలు విని శివాజీ వీరుడయ్యాడు. జీవితంలో కష్టాలపై విజయం సాధించే వీరులం కావాలంటే... ఉపాధిలో సవాళ్లను ఎదిరించే వీరులం కావాలంటే కథ డాలుగా... ఖడ్గంగా ఉపయోగపడుతుంది. ఫోన్‌ పక్కన పెట్టండి. ఏదైనా కథ వినండి.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement