సమస్య ఉత్పన్నమైనప్పుడు సమర్థతను చూపలేక చిక్కుల్లో పడినవారున్నట్టే.. సమస్యల్లో ఉన్నవారిని అత్యంత సమర్థతతో కాపాడే ధీరులూ ఉన్నారు. ఈ రెండవ కేటగిరికి చెందుతారు పైలట్ కెప్టెన్ మోనికా ఖన్నా.
ఎగురుతున్న విమానం అకస్మాత్తుగా మంటల్లో చిక్కుకుంటే.. అందులోని 185 ప్రాణాలు భయం గుప్పిట్లో బితుకుబితుకుమంటుంటే.. కెప్టెన్ మోనికా ఖన్నా సమర్థత... సత్వర నిర్ణయం ప్రయాణికులతో సహా తననూ సురక్షితంగా భూమికి చేర్చింది. ఆ ధైర్యానికి, సమయస్ఫూర్తికి దేశ ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
ఇటీవల పాట్నా నుంచి ఢిల్లీకి స్పైజ్ జెట్ లిమిటెడ్ ఫ్లైట్ ఎస్‌జి723 విమానం బయల్దేరింది. పైలట్–ఇన్–కమాండ్ కెప్టెన్ మోనికా ఖన్నా ఈ విమానాన్ని పైలట్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. టేకాఫ్ అయిన కొద్దిసేపటికే సాంకేతిక లోపం కారణంగా మిడ్–ఎయిర్ ఇంజిన్‌లో మంటలు రేగాయి.
ఇలాంటి హఠాత్పరిణామాలు సంభవించినప్పుడు సాహసాన్ని, సమర్థతను చూపడంలో ఆడా–మగ తేడా అనేది ఏమీ లేదు. అందరినీ కాపాడటం ఒక్కటే వారి కర్తవ్యం. ఆ దక్షతను చూపడంలో మోనికా ఏ మాత్రం జంకలేదు.
తక్షణ నిర్ణయం..
క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఆమె వెంటనే ఇంజిన్‌ను స్విచ్ ఆఫ్ చేసి, పాట్నా విమానాశ్రయంలోనే విమానాన్ని సురక్షితంగా ల్యాండ్ చేసింది. ఫస్ట్ ఆఫీసర్ బలప్రీత్ సింగ్‌భాటియా కూడా ఆమె తక్షణ నిర్ణయాన్ని స్వాగతించారు. ప్రయాణికులతో సహా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత విమానాన్ని నిపుణులు పరీక్షించి పక్షి ఢీకొట్టడంతో ఫ్యాన్ బ్లేడ్, ఇంజన్ దెబ్బతిన్నట్టు నిర్ధారించారు.
ఫ్యాషన్ ట్రెండ్స్
ప్రయాణాలను అమితంగా ఇష్టపడే మోనికా ఖన్నా తాజా ఫ్యాషన్, ట్రెండ్స్‌పై అత్యంత ఆసక్తి చూపుతుందని ఆమె ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ సూచిస్తుంది. అంటే, అందం, నలుగురిలో ఆనందంగా ఉండటం అనే అంశాల పట్ల వీరోచితులు దృష్టి పెట్టరు అనేవారికి మోనికా ఓ పెద్ద ఉదాహరణ అని చెప్పుకోవచ్చు.
మహిళా శక్తి అనడం కన్నా వీరోచితమైన ప్రజల జాబితాలో మోనికాఖన్నా చేరుతారని ప్రముఖులు ఆమెను కొనియాడుతున్నారు. ‘ఎగురుతున్న విమానం మంటల్లో చిక్కుకున్నప్పుడు అందులోని ప్రయాణికులు ప్రాణాలను గుప్పిట్లో పట్టుకొని భయంతో బతికిన క్షణాల నుంచి ఆమె విముక్తి కలిగించారు. మోనికా ఖన్నా ధైర్యానికి వందనాలు’ అంటూ దేశవ్యాప్తంగా సిటిజనుల నుంచి నెటిజనుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment