సేమ్ సీన్
► ఆఖరి రోజున అదే తీరు
►బ్యాంకుల్లో అదే రద్దీ
►మెజారిటీ ఏటీఎంల్లో డబ్బుల్లేవు..
సాక్షి, పెద్దపల్లి : పాత పెద్ద నోట్లు రద్దు చేసి 50 రోజులు దాటింది. రూ.500, 1000లను జమ చేసేందుకు శుక్రవారం ఆఖరు దినమైనా బ్యాంకుల్లో అవే బారులు కనిపించాయి. కరెన్సీ కోసం అదే జనం రద్దీ ఉంది. డబ్బులున్న ఏటీఎంల్లో ఎప్పటిలాగే క్యూలైన్లు కనిపించాయి.
కేంద్ర ప్రభుత్వం రూ.500, రూ.1000 నోట్లను నవంబరు 8న రద్దు చేసింది. వాటిని బ్యాంకుల్లో జమచేసుకునేందుకు శుక్రవారంతో గడువు ముగిసింది. నెలాఖరు నాటికి ప్రజల కరెన్సీ కష్టాలు తీరుతాయని కేంద్రం చెప్పినా మార్పు లేదు. పెద్దపల్లి, సుల్తానాబాద్, గోదావరిఖని, మంథని, ధర్మారం మండలాల్లోని బ్యాంకుల్లో అదే రద్దీ నెలకొంది. నగదుకోసం జనం బ్యాంకుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కరెన్సీకొరతతో బ్యాంకుల్లో డబ్బులు ఇవ్వకపోవడంతో రోజు పనిమాని తిరుగుతున్నారు. ఏటీఎంల వద్ద అదే పరిస్థితి. ఎస్‌బీఐ, ఎస్బీహెచ్, ఇండియన్ బ్యాంకు ఏటీఎంల్లో మాత్రమే డబ్బులు పెడుతున్నారు. మిగతా బ్యాంకులకు చెందిన ఏటీఎంల్లో నేటికీ డబ్బులు పెట్టడం లేదు. చాలా ఏటీఎంల్లో నోట్లరద్దు నాటి నుంచి ఇంతవరకు డబ్బులే పెట్టలేదనడంలో ఎలాంటి అతిశయోక్తిలేదు.