అరకొర నగదే...
యథావిధిగా కరెన్సీ కష్టాలు
పాతనోట్ల డిపాజిట్‌కు మరో మూడు రోజులే అవకాశం..
సిటీబ్యూరో: రోజులు గడుస్తున్నా గ్రేటర్ సిటీజనులకు కరెన్సీ కష్టాలు తీరడంలేదు. మంగళవారం కూడా పలు బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల వద్ద జనం బారులు తీరారు. అయినా అరకొర నగదుతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తొలుత వచ్చిన 50 మంది వినియోగదారులకు బ్యాంకుల్లో రూ.3 నుంచి రూ.5 వేలతో సరిపెట్టగా..ఏటీఎం కేంద్రాల వద్ద కేవలం రూ.2 వేల నోటుతోనే నిరాశగా వెనుదిరగాల్సి వచ్చింది. ఈ నోట్లను మార్పించుకునేందుకు షరామామూలుగానే జనం అవస్థలు పడ్డారు. నగరంలో ప్రధాన మార్కెట్లలో వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు స్తంభించాయి.
బ్యాంకులు, ఏటీఎంలలో సరిపడినంతగా నగదు అందుబాటులో ఉంచాలని వినియోగదారులు కోరుతున్నారు. ఇక పాత రూ.500, రూ.వెయ్యి నోట్లను బ్యాంకుల్లో డిపాజిట్ చేసేందుకు ఈనెల 30 వరకు మాత్రమే అవకాశం ఉండడంతో వినియోగదారులు తమ వద్దనున్న పాతనోట్లను బ్యాంకు అకౌంట్లలో డిపాజిట్ చేసుకోవాలని బ్యాంకర్లు సూచిస్తున్నారు. అపరిచిత వ్యక్తుల డబ్బును సొంత అకౌంట్లలో జమచేసి కష్టాలు కొనితెచ్చుకోవద్దని స్పష్టంచేశారు. ఐటీశాఖ వినియోగదారులకు సంబంధించిన అన్నిరకాల డిపాజిట్లపై ఆరాతీస్తోందని పేర్కొన్నారు.