కరెన్సీ కల్లోలం!
కరెన్సీ కల్లోలం!
Published Wed, Dec 14 2016 10:37 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
- జిల్లాలో తీవ్రమైన నగదు కొరత
-బ్యాంకుల్లో నో క్యాష్‌బోర్డులు
- దిష్టిబొమ్మల్లా ఏటీఎంలు
- సహనం కోల్పోతున్న ప్రజలు
- జిల్లాలో పలుచోట్ల రాస్తారోకోలు
కర్నూలు(అగ్రికల్చర్): కరెన్సీ కష్టాలు రోజు రోజుకూ రెట్టింపవుతున్నాయి. బ్యాంకులో దాచుకున్న డబ్బు అవసరాలకు తీసుకునేందుకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. బుధవారం జిల్లా వ్యాప్తంగా బ్యాంకుల దగ్గర వందలాది మంది బారులు తీరారు. కలెక్టరేట్‌లోని ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచీకు ఉద్యోగులు పోటెత్తారు. నెలలో ఒక్క రూపాయికూడ తీసుకోని వారికి రూ.10వేలు, రెండో సారి వచ్చిన వారికి రూ.6 వేలు ప్రకారం పంపిణీ చేశారు. ఇంత వరకు తీసుకోని వారిలో 150 మందికి, రెండోసారి తీసుకోవడానికి వచ్చిన వారికి 600 మందికి మొత్తంగా 750 మందికి నగదు పంపిణీ చేశారు. నగదు లభ్యత, ఎంత మందికి ఎంత ప్రకారం పంపిణీ చేసేదీ బ్యాంకు బయట బోర్డు పెట్టారు. ట్రెజరీ బ్రాంచి దగ్గర ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. కర్నూలు తహసీల్దారు రమేష్..లావాదేవీలను పరిశీలించారు. బ్యాంకు లోపల, బయట వీడియో గ్రాఫర్లను ఏర్పాటు చేసి మొత్తం ప్రక్రియను వీడీయోలో చిత్రీకరించారు.
నగదు మెరుగు...
ఆంధ్రబ్యాంకుకు వచ్చిన రూ.49 కోట్ల నగదును దాదాపు అన్ని బ్యాంకులకు పంపిణీ చేశారు. అయితే ఎస్‌బీఐ బ్రాంచీల్లో మాత్రం నగదు కొరత ఏర్పడింది. ట్రెజరీ బ్రాంచికి రూ.51 లక్షలు ఇచ్చినా మిగిలిన బ్రాంచీల్లో నగదు కొరత ఏర్పడింది. శనివారం నుంచి సోమవారం వరకు రెండు, మూడు ఏటీఎంల్లో నగదు నిరంతరం పెట్టడం వల్ల వచ్చిన కరెన్సీ దాదాపు ఖాళీ అయిందనే ప్రచారం జరుగుతోంది.
ఏటీఎంలు మూతే...
ఏటీఎంల సేవలు అందుబాటులోకి రాలేదు. కర్నూలులో ఎస్‌బీఐ ఏటీఎంలు రెండు, ఆంధ్రబ్యాంకు ఏటీఎం ఒక్కటి, ఇండస్ ఇండ్ ఏటీఎం ఒక్కటి.. మొత్తంగా నాలుగు మాత్రమే పనిచేస్తున్నాయి. వీటి దగ్గర వందలాది మంది క్యూ కడుతున్నారు. జిల్లాకు ఆర్‌బీఐ నుంచి కొత్త కరెన్సీ కేవలం రూ.850 కోట్లు మాత్రమే వచ్చింది.
ఎలా బతకాలి: చంద్రశేఖర్, రిటైర్డ్ ఉద్యోగి
ఎస్‌బీఐ ట్రెజరీ బ్రాంచీ ఖాతాలో పెన్షన్ జమ అయింది. తీసుకోవడానికి 10 రోజులుగా బ్యాంకు చుట్టూ తిరుగుతున్నాను. కొన్ని రోజులు నో క్యాష్ బోర్డు పెడుతున్నారు. నగదు ఉన్న రోజు వస్తే అయిపోయిందని చెబుతున్నారు. నా దగ్గర కేవలం 40 రుపాయలు మాత్రమే ఉన్నాయి. ఈ డబ్బుతో ఏలా బతకాలి. బ్యాంకులో డబ్బు ఉన్నా అవసరాలకు ఉపయోగపడటం లేదు.
Advertisement
Advertisement