ఎన్నాళ్లిలా!
ఎన్నాళ్లిలా!
Published Wed, Dec 28 2016 10:54 PM | Last Updated on Sat, Sep 22 2018 7:50 PM
50 రోజులు దాటినా చేతికందని నగదు
నేటికీ సగానికి పైగా ఏటీఎంలు మూతే
సాక్షి ప్రతినిధి, ఏలూరు :
పెద్ద నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోదీ నిర్ణయం తీసుకుని 50 రోజులు దాటింది. నగదు కష్టాలకు మాత్రం నేటికీ తెరపడలేదు. 50 రోజుల్లో సమస్య పరిష్కారమవుతుందని ప్రకటించినా కనుచూపు మేరలో కనిపించడం లేదు. బ్యాంక్‌ల వద్ద క్యూలు, మూతపడ్డ ఏటీఎంలు, డబ్బుల కోసం ఇక్కట్లు తప్పడం లేదు. సమస్య పరిష్కారం విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. మరోవైపు తన లేఖ వల్లే పెద్ద నోట్లు రద్దు చేశారని మొదటి రోజున ప్రకటించిన చంద్రబాబునాయుడు.. ఇంత పెద్ద సమస్య తన జీవితంలో ఎప్పుడూ చూడలేదంటూ మాట మార్చేశారు. నగదు రహిత లావాదేవీలంటూ ఊదరగొడుతున్నా ప్రజలకు మాత్రం అందుబాటులోకి రావడం లేదు. ఈ 50 రోజుల వ్యవధిలో ఖాతాదారులకు సంతోషం కలిగించేలా రూ.24 వేలను వారంలో ఒక్కసారే ఇచ్చిన బ్యాంక్‌లు లేవు. కొన్ని బ్యాంక్‌లు ఖాతాదారులు తక్కువగా ఉండటంతో రెండు రోజులలో ఈ మొత్తాన్ని ఇచ్చే ప్రయత్నం చేశాయి. ఇదిలావుంటే.. నగదు అందుబాటులోకి రాకపోవడంతో జిల్లాలోని పలు బ్యాంక్‌ల వద్ద బుధవారం ప్రజలు నిరసనకు దిగారు. ఇరగవరంలో రాస్తారోకో చేశారు. బ్యాంక్‌ల్లో పరిమితులు ఎత్తివేయాలంటూ పలు బ్యాంక్‌ల వద్ద ధర్నాలు జరిగాయి. ఉదయాన్నే బ్యాంక్‌ల వద్ద క్యూ కట్టిన జనం నగదు అందుతుందని ఆశిస్తే.. మధ్యాహ్నానికి చేతులెత్తేయడంతో ఇబ్బంది పడ్డారు. భీమడోలు ఆంధ్రాబ్యాంక్ అధికారులు 12 గంటలకే నగదు లేదని చెప్పడంతో అప్పటివరకు క్యూలో నిలబడిన జనం సిబ్బందిపై అసహనం ప్రదర్శించారు. తాడేపల్లిగూడెం ఎస్‌బీఐలో రూ. 2 వేల నోట్లను మాత్రమే ఇచ్చారు. ఏటీఎంలలో రూ.500 కొత్త నోట్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఉంగుటూరు, కైకరం బ్యాంక్‌ల వద్ద క్యాష్ లేదని బోర్డులు పెట్టడంతో ఖాతాదారులు నిరుత్సాహంతో వెనుదిరిగారు. ఖాతాల్లో డబ్బులున్నా తీసుకోవటానికి అనేక ఇబ్బందులు పడుతున్నామంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కైకరంలోని స్టేట్‌బ్యాంక్, ఉంగుటూరులోని యూనియన్ బ్యాంక్‌లో నో క్యాష్ అని బోర్డులు పెట్టడంతో డబ్బులు కోసం పడిగాపులు కాసిన రైతులు, ప్రజలు, ఉద్యోగులు ఇబ్బందులు పడ్డారు. ఉంగుటూరు మండలంలో ఉన్న ఆరు ఏటీఎంలు పనిచేయటం లేదు. దేవరపల్లి స్టేట్ బ్యాంక్‌లో మధ్యాహ్నం వరకు నగదు లేకపోవడంతో ఖాతాదారులు అసహనం వ్యక్తం చేశారు. 12 గంటలకు క్యాష్ రావడంతో ఒక్కొక్కరికీ రూ.2000 చొప్పున అందజేశారు. మొగల్తూరు ఎస్‌బీఐలో రూ.4వేలు, ఆంధ్రాబ్యాంక్ నుంచి రూ.2వేలు చొప్పున ఇచ్చారు. నరసాపురం మండలం ఎల్బీచర్లలోని ఎస్‌బీహెచ్, సీతారాంపురం ఎస్‌బీఐ శాఖల్లో సాయంత్రం వరకు క్యూలు కొనసాగాయి. చింతలపూడి మండలం ప్రగడవరం ఆంధ్రాబ్యాంక్ వద్ద ఖాతాదారులు బుధవారం అందోళనకు దిగారు. నగదు లేదని చెప్పడంతో బ్యాంక్ అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. లింగపాలెం మండలంలో 4 ఏటీఎంలు ఉండగా, ధర్మాజీగూడెంలో ఎస్‌బీఐ ఏటీఎం ఒక్కటి మాత్రమే పనిచేసింది. ఉండి మండలం మహదేవపట్నం ఆంధ్రాబ్యాంక్‌కు 3 రోజుల నుంచి డబ్బులు రాకపోవడంతో ఖాతాదారులు సిబ్బందితో వాగ్వాదానికి దిగారు. పాలకొల్లు ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌ను ఎమ్మెల్సీ మేకా శేçషుబాబు సందర్శించి ఖాతాదారులతో మాట్లాడారు. ప్రజల ఇబ్బందులను బ్యాంక్ చీఫ్ మేనేజర్ జీజీకే మూర్తికి వివరించారు. వృద్ధులకు ముందుగా నగదు అందజేసే ఏర్పాట్లు చేయాలని కోరారు.
Advertisement
Advertisement