ఆర్డర్ చేసినా రావటం 'కస్టమ్'
శ్రీధర్‌కు అంతర్జాతీయ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ షాపింగ్ చేయటం మహా సరదా! అలాగే సెర్చ్ చేస్తుండగా... ఇండియాలో రూ.20 వేలకు దొరుకుతున్న ఫోన్... చైనా ఆన్‌లైన్ దిగ్గజం అలీబాబా వెబ్‌సైట్లో రూ.12 వేలకే కనిపించింది. ఇంకేం! 8 వేలు తక్కువకు వస్తోంది కదా అని ఆర్డర్ ఇచ్చాడు. దాదాపు 40 రోజుల తరవాత ప్యాకేజీ శ్రీధర్ ఇంటికొచ్చింది. కాకపోతే రూ.10 వేలు కస్టమ్స్ ఛార్జీలు చెల్లించాలని, అప్పుడే డెలివరీ ఇస్తానని చెప్పాడు పోస్ట్‌మ్యాన్. శ్రీధర్‌కు చుక్కలు కనిపించాయి. వద్దులే అని వెనక్కి పంపేశాడు. కాకపోతే సదరు వెబ్‌సైట్లో అమ్మేటపుడే ఓ కండిషన్ ఉంది. ‘‘మీ చేతుల్లో లేని కారణాల వల్ల పార్సిల్ మీకు అందకపోతే పూర్తి రిఫండ్ ఇస్తాం.
కానీ మీ చేతుల్లో ఉన్న కారణాల వల్ల అయితే కొంత కోత వేస్తాం’’ అని. కస్టమ్స్ చార్జీలేమైనా ఉంటే కస్టమరే చెల్లించాలనే షరతు కూడా అందులో ఉంది. దీంతో శ్రీధర్‌కు మరో 30 రోజులు గడిచాక... రూ.4 వేలు కోత పడి, రూ.8 వేలు వెనక్కి వచ్చాయి.
అవినాష్ ఉండేది అమెరికాలో. ఇండియాలో ఉన్న తన స్నేహితుడు ఆనంద్‌ను సంతోషపెట్టాలనుకున్నాడు. ఆనంద్ బర్త్‌డేకు... అమెరికా నుంచి ఓ సర్‌ప్రైజ్ గిఫ్ట్‌ను పంపించాడు. కాకపోతే ఆనంద్ బర్త్‌డే అయిపోయినా అది తనకు అందలేదు. అనంద్ నుంచి సమాధానం లేకపోవటంతో... తను పంపిన గిఫ్ట్ ఎలా ఉందని అవినాషే అడిగాడు.
ఏ గిఫ్టంటూ తెల్లమొహం వేశాడు ఆనంద్. చివరకు ట్రాకింగ్ నంబరు అదీ ఇవ్వటంతో... అది కస్టమ్స్ దగ్గర ఇరుక్కుపోయిందని తెలుసుకున్నాడు ఆనంద్. ఎందుకు ఇరుక్కుంది? ఎప్పుడొస్తుంది? అనే విషయాలు తెలియక సతమతమయ్యాడు. శ్రీధర్, ఆనంద్‌లే కాదు. విదేశాల నుంచి పార్శిళ్లు, వస్తువులు తెప్పించుకునే చాలామందిది ఇదే పరిస్థితి. ఎందుకంటే 120 కోట్ల మంది ఉన్న ఇండియాకు లక్షల కొద్దీ పార్శిళ్లు విదేశాల నుంచి వస్తుంటాయి. అందులో ఏం ఉంది? దాన్ని కస్టమ్స్ డ్యూటీ చెల్లించి తెస్తున్నారా? లేకుంటే అవి డ్యూటీ (సుంకాలు) చెల్లించాల్సిన అవసరం లేనివా? తక్కువ ధరవా? వాటిని ఇండియాలోకి ఉచితంగా అనుమతించటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోందా? అవి ఇండియాలోని పర్యావరణాన్నో, మనుషుల్నో దెబ్బతీసే వస్తువులా?..
ఇలాంటివన్నీ క్షుణ్నంగా పరిశీలించటం కస్టమ్స్ విభాగం బాధ్యత. ఈ ప్రక్రియలో కొన్ని వస్తువులు నెలల పాటు కస్టమ్స్ వద్దే క్లియర్ కాకుండా ఉండిపోతుంటాయి. ఇంకొన్ని అక్కడి నుంచే వెనక్కి తిప్పి పంపేస్తుంటారు. మరికొన్నిటికి భారీ పెనాలిటీలు వేస్తుంటారు. ఇవన్నీ ముందే తెలుసుకోవటం ఎలా? అలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవటమెలా? కస్టమ్స్ అధికారుల్ని సంప్రదించటమెలా? ..ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం...
ఆన్‌లైన్లో ఎక్కడి నుంచైనా కొనటానికి వీలు
* అంతర్జాతీయ వస్తువులకు సుంకం తప్పనిసరి
* కొన్ని డ్యూటీ ఫ్రీ వస్తువులు కూడా ఉంటాయ్...
* గిఫ్ట్ అంటూ అబద్ధాలాడితే ఇరుక్కోవచ్చు
* ట్రాక్ చేయటానికి; సంప్రదింపులకు ఎన్నో మార్గాలు
సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం: ఉన్న ఊళ్లోనే ఏ వస్తువైనా కొనటానికి అలవాటు పడ్డ వ్యక్తుల్ని... ఏకంగా విదేశాల నుంచి కూడా కొని తెప్పించుకునేలా చేసింది ఈ-కామర్స్.
అమెరికా, చైనా సహా ఏ దేశం నుంచైనా ఆర్డరు చేస్తే... కొన్ని రోజుల్లోనే మన రాష్ట్రాల్లోని మారుమూల పల్లెలక్కూడా పార్సిళ్లు వచ్చేస్తున్నాయి. కాకపోతే డ్యూటీ ఫ్రీ వస్తువులు మినహా... ఏ వస్తువును మనం విదేశాల నుంచి తెప్పించుకుంటున్నా కొంత సుంకం చెల్లించాల్సి ఉంటుంది. అయితే డిజిటల్ కెమెరాలు, ఎల్‌సీడీ మానిటర్లు, ర్యామ్, ప్రాసెసర్ల వంటి కొన్ని ఐటీ సంబంధిత ఉత్పత్తుల్ని మాత్రం ‘డ్యూటీ ఫ్రీ’గా పరిగణిస్తుంటారు. వాటిపై సుంకాలుండవు. మిగిలిన వస్తువులన్నిటిపైనా కస్టమ్స్ డ్యూటీ ఉంటుంది. ఇక ఈ వస్తువుల్ని పెద్ద ఎత్తున ఇండియాకు తెచ్చి విక్రయించేవారికి ఐఈసీ (ఇంపోర్ట్, ఎక్స్‌పోర్ట్ కోడ్) తప్పనిసరి. వ్యక్తిగత అవసరాలకు తెచ్చుకునే వారికి మాత్రం ఈ కోడ్ అవసరం లేదు. దేనికి డ్యూటీ చెల్లించాలి? ఎంతవరకూ మినహాయింపులుంటాయి? అక్రమంగా తెచ్చుకుంటే పరిస్థితేంటి? ఒక్కసారి చూద్దాం....
ఆన్‌లైన్ కంపెనీలకు కస్టమర్లు ముఖ్యం. కొనుగోళ్లు ముఖ్యం. అందుకని అవి తమ కస్టమర్లు భారీ కస్టమ్స్ ఛార్జీలు చెల్లించకూడదన్న ఉద్దేశంతో వస్తువుల్ని పంపేటపుడు కొన్ని చర్యలు తీసుకుంటుంటాయి. అవేంటంటే...
* ఐఈసీ లేకుండా భారీగా దిగుమతులు చేసుకుంటున్న పక్షంలో మీరు పూర్తిగా ఇరుక్కున్నట్టే.
* ప్యాకేజ్‌కు సంబంధించిన కస్టమ్స్ డిక్లరేషన్ ఫారంలో దాన్ని బహుమతి ఇస్తున్నట్లుగా పేర్కొంటాయి. నిజానికి వేరొక వ్యక్తి కోసం ఒక వ్యక్తి ఆర్డర్ చేస్తే... అది బహుమతి. కానీ సొంతంగా ఆర్డర్ చేసుకుని తెప్పించుకునేదానికి కూడా విక్రేతలు గిఫ్ట్ ఇస్తున్నట్లుగా పేర్కొంటుంటారు. ఇది చట్ట విరుద్ధం. అయితే ఇది నిజంగా బహుమతేనా? కాదా? అనేది తెలుసుకోవటం కష్టం. ఒకవేళ ఆ గిఫ్ట్‌లో కూడా ఇన్వాయిస్ పెట్టారంటే... అప్పుడు పట్టుబడ్డట్టే.
* గిఫ్ట్‌గా పేర్కొన్నా కూడా... సదరు వస్తువు ధర రూ.10 వేలు దాటితే కస్టమ్స్ అధికారులు సుంకం విధిస్తారు. అందుకని విక్రేతలు వస్తువుల ధరను తక్కువగా చూపిస్తారు. ఇదీ చట్ట విరుద్ధమే. ఒకవేళ ఆ వస్తువు పోయిన పక్షంలో మీకు బీమా పూర్తిగా రాదు. వస్తువు ధరను తక్కువగా చూపించారు కనక ఆ మేరకే వస్తుంది.
* పైన పేర్కొన్న రెండు మార్గాలూ చట్టవిరుద్ధమైనవే. వాటి పరిణామాలు కూడా మీకు తెలిసి ఉండాలి.
* ముఖ్యమైన విషయమేంటంటే... 4-5 రోజుల్లో షిప్పింగ్ చేస్తానన్నారు కదా అని చాలా మంది ఖరీదైన కొరియర్లను ఎంచుకుంటారు. కొరియర్ ఎంత ఖరీదైనదైతే నిఘా అంత ఎక్కువ ఉంటుందని గమనించాలి. ఈఎంఎస్, డీహెచ్‌ఎల్ వంటి కొరియర్లను తక్కువ ధర వస్తువులకు వినియోగించరని, ఖరీ దైన వస్తువులకే వాడతారని కస్టమ్స్‌కు బాగా తెలుసు. అందుకని వీటిని మిగతా వాటికన్నా నిశితంగా స్కాన్ చేస్తారు.
* అలాగని మామూలు రిజిస్టర్డ్ ఎయిర్ మెయిల్‌లో తెప్పిస్తే... భద్రతకు పూర్తి గ్యారంటీ ఉండదు. అది చేతికి వస్తుందన్న నమ్మక ం ఉండదు. ఒకవేళ చేతికి వచ్చినా భద్రంగా... ఎక్కడా డ్యామేజీ లేకుండా రావటం కూడా కష్టం. వీటన్నిటికీ తోడు షిప్పింగ్ సమయం బాగా ఎక్కువ.
* దీన్నిబట్టి ఒకటి అర్థం చేసుకోవాలి. నిజంగా వస్తువు కావాలనుకునేవారు కొంత డ్యూటీ చెల్లించటానికి వెనకాడరు. కొన్ని సందర్భాల్లో అన్నీ నిజం చెప్పినా కస్టమ్స్ ఇబ్బందులనేవి ఉంటుంటాయి.
కస్టమ్స్ గుర్తిస్తే...?
ఒకవేళ మీ వస్తువుపై సుంకం చెల్లించలేదని ది కస్టమ్స్ గుర్తిస్తే ఏమవుతుంది? మరీ మిమ్మల్ని అరెస్టు చేయటమో, కేసు పెట్టడమో చేయరు. అది కూడా మీరు తెచ్చిన వస్తువు స్థాయిని బట్టి ఉంటుందనేది గుర్తుంచుకోవాలి. సాధారణంగా ఇలా గుర్తిస్తే కస్టమ్స్‌లో ఆ వస్తువును సీజ్ చేస్తారు. వివరాలడుగుతూ మీకు లెటర్ రాస్తారు. మీరు గనక నిజాయితీగా స్పందిస్తే... వారు సంతృప్తి చెందితే... కొంత సుంకం లెక్కించి చెల్లించమంటారు. చెల్లిస్తే మీ వస్తువు మీకు ఇచ్చేస్తారు.
కొన్నిసార్లు ఏ లేఖా లేకుండానే పోస్ట్‌మ్యాన్‌తో నేరుగా పార్సిల్ మీ ఇంటికి పంపి సుంకం చెల్లించమంటారు. తప్పుడు డిక్లరేషన్ ఇచ్చినందుకు కొంత పరిహారం కూడా తప్పదు. అయితే పదేపదే ఇలా చేస్తే మాత్రం ఇబ్బందులు ఖాయం. కస్టమ్స్ అడిగాక కూడా మీరు ఛార్జీలు చెల్లించకపోయినా... పోస్ట్‌మ్యాన్ తెచ్చినపుడు అందులో పేర్కొన్న మొత్తం చెల్లించకపోయినా ఆ వస్తువును వెనక్కి తిరిగి పంపేస్తారు. అయితే మీరు ఆన్‌లైన్లో కొన్నారు కనక... దాన్ని తిరిగి వెనక్కి పంపేస్తే ఆన్‌లైన్ కంపెనీ పూర్తి మొత్తాన్ని రిఫండ్ ఇవ్వదని గుర్తుంచుకోవాలి. పోస్టేజీ కింద కొంత మొత్తాన్ని అది మినహాయిస్తుంది.
కస్టమ్స్ వివరాలు తెలుసుకోవటమెలా?
సాధారణంగా మీరు ట్రాకింగ్ చేసినపుడు దాని పరిస్థితి ఏంటన్నది తెలుస్తుంది. అది కస్టమ్స్ వద్ద ఉందా? లేక అక్కడి నుంచి క్లియర్ అయ్యి మీ ప్రాంతానికి పంపించారా? లేక కస్టమ్స్ వద్దే అధికారి క్లియరెన్స్ కోసం నిలిపేశారా? ఇవన్నీ తెలుస్తాయి. ఒకవేళ మీ వస్తువు కనక ముంబైలోని కస్టమ్స్ వద్ద ఉండిపోయిన పక్షంలో అది ఎందుకు ఉంది? ఛార్జీలేమైనా చెల్లించాలా? వంటి వివరాలు తెలుసుకోవటానికి ముంబై పోస్టల్ విభాగం ఒక బ్లాగ్‌ను నిర్వహిస్తోంది. దాన్లో మీ ప్రశ్నను పోస్ట్ చేస్తే అధికారులు స్పందించే అవకాశమూ ఉంది. అయితే దీనికి కొంత సమయం పట్టొచ్చు.
నేరుగా ముంబై వెళ్లి సంప్రదించే బదులు ఈ బ్లాగ్ ద్వారా సంప్రతించటం కొంత ఈజీ కదా? ప్రయివేట్ వ్యక్తులు నిర్వహిస్తున్న ఆ బ్లాగ్ పేరు... http://mumbaiforeignpost.blogspot.in/p/mainpage.html అయితే ఇలాంటి బ్లాగ్‌లలో పూర్తి వివరాలిచ్చేటపుడు జాగ్రత్తగా ఉండాలి. మీ చిరునామా, మొబైల్ నంబరు ఎక్కడా పబ్లిక్ వెబ్‌సైట్లలో ఉండకపోవటమే ఉత్తమమనేది ఎప్పుడూ గుర్తుంచుకోవాలి. ముంబయి కస్టమ్స్‌కు సంబంధించి మీకు అధికారిక సమాచారం కావాలంటే... టఞఛి.ఝఠఝఛ్చజీః జీఛీజ్చీఞౌట్ట.జౌఠి.జీ ద్వారామెయిల్‌లో సంప్రదించవచ్చు.
వస్తువు ట్రాక్ చేయటం ఎలా?
ఇప్పుడు ప్రతి కొరియర్‌కూ సొంత వెబ్‌సైట్ ఉంది. కన్‌సైన్‌మెంట్ నంబరో, ట్రాకింగ్ నంబరో ఉంటుంది కనక వాటి సాయంతో ఈజీగానే ట్రాక్ చేయొచ్చు. అలా కాకుండా ఏ కొరియర్ సంస్థకు చెందిన పార్శిల్‌నైనా ట్రాక్ చేయటానికి 17ట్రాక్స్, ఆఫ్టర్‌షిప్ వంటి వెబ్‌సైట్లు అందుబాటులో ఉన్నాయి.
ఒకవేళ విక్రేత తన దేశానికి చెందిన పోస్టల్ విభాగం ద్వారా రిజిస్టర్డ్ పోస్ట్ పంపిస్తే... ఆయా దేశాల పోస్టల్ ట్రాకింగ్ కొంతవరకే పనికొస్తుంది. అంటే వస్తువు మన దేశానికి పంపేవరకూ ఆ సంస్థలు ట్రాక్ చేస్తాయి. అక్కడి నుంచి ట్రాకింగ్ ఉండదు. అయితే ఇలా ఏ దేశానికి చెందిన పోస్టల్ విభాగాన్నయినా... పంపిన దగ్గర్నుంచి డెలివరీ అయ్యేదాకా ట్రాక్ చేయటానికి ఇంటర్నేషనల్ పార్శిల్ సర్వీస్‌కు చెందిన ఐపీఎస్ వెబ్‌సైట్ అందుబాటులో ఉంటుంది. అవన్నీ చూస్తే...
ఏ కొరియర్‌నైనా ట్రాక్ చేయటానికి...
https://www.17track.net/en
https://www.aftership.com/
అంతర్జాతీయ పోస్టల్‌ను ట్రాక్ చేయటానికి...
http://ipsweb.ptcmysore.gov.in/ipswebtracking/IPSWeb_submit.htm