ఆదాయపన్ను రిటర్నులు దాఖలు చేసే వారు... స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ ఆదాయాన్ని చూపించడం, పన్ను చెల్లించడం తప్పనిసరి. అయితే, ఈ విషయమై స్పష్టమైన అవగాహన తక్కువ మందిలోనే ఉంటుందని చెప్పుకోవాలి. నేటి తరం యువతలో చాలా మంది ట్రేడింగ్ వైపు ఆకర్షితులవుతున్నారు. అత్యాధునిక ఆల్గో ట్రేడింగ్ సాఫ్ట్‌వేర్‌లు అందుబాటు, మొబైల్ నుంచే అన్ని రకాల సేవలు, విస్తృతమైన సమాచారం ఇవన్నీ ఇందుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. మరి ట్రేడింగ్‌ను ఓ ప్రొఫెషన్‌గా ఎంచుకున్నవారు ఇందుకు సంబంధించిన పన్ను బాధ్యతలను తెలుసుకోవడం ఎంతో అవసరం. ఆ వివరాలే ఈ వారం ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం.
ఇంట్రాడే ట్రేడింగ్ (ఒకే రోజు కొని, విక్రయించడం) ద్వారా వచ్చే లాభ/నష్టాలను వ్యాపార ఆదాయంగా చట్టం పరిగణిస్తుంది. బిజినెస్ లేదా ప్రొఫెషన్ ద్వారా వచ్చిన లాభాలుగా (పీజీబీపీ) వీటిని చూపించాల్సి ఉంటుంది. ఇక ట్రేడింగ్ ద్వారా వచ్చే ఆదాయాన్ని స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్‌గా వేరు చేయాల్సి ఉంటుంది. ఈక్విటీలో ఇంట్రాడే ట్రేడింగ్‌పై వచ్చే లాభ, నష్టాలను స్పెక్యులేటివ్‌గా పరిగణించాలి. అదే ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (ఎఫ్‌అండ్‌వో) ద్వారా వచ్చే లాభ, నష్టాలు నాన్ స్పెక్యులేటివ్ అవుతాయి. పీజీబీపీ కింద స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ లాభాలన్నవి మీ పన్ను వర్తించే ఆదాయానికే కలుస్తాయి. మీ ఆదాయం ఏ శ్లాబు పరిధిలో ఉంటే ఆ మేరకు పన్ను చెల్లించడం తప్పనిసరి.
మినహాయింపులు
అయితే, వ్యాపార ఆదాయం కింద చూపించే స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ లాభాల నుంచి, మీకు అయిన ఖర్చులను మినహాయించుకునే అవకాశం ఉంటుంది. అంటే బ్రోకర్ల కమీషన్, డీమ్యాట్ చార్జీలు, ఇంటర్నెట్ ఖర్చులు ఇవన్నీ కూడా ట్రేడింగ్ కోసం చేసిన ఖర్చులే అవుతాయి. కనుక మొత్తం లాభాల్లో ఈ ఖర్చులను మినహాయించుకున్న తర్వాతే మిగిలిన ట్రేడింగ్ ఆదాయాన్ని పేర్కొంటే సరిపోతుంది. అయితే, నష్టాలు వస్తే మాత్రం స్పెక్యులేటివ్, నాన్ స్పెక్యులేటివ్ ఆదాయంపై పన్ను వేర్వేరుగా ఉంటుంది. ఎఫ్‌అండ్‌వో నుంచి నాన్ స్పెక్యులేటివ్ రూపంలో నష్టం వచ్చిందనుకుంటే... ఈ నష్టాన్ని సంబంధిత వ్యక్తి వేతనం మినహా ఇతర ప్రధాన ఆదాయం నుంచి సర్దుబాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ అప్పటికీ నష్టం మిగిలిపోతే దాన్ని తదుపరి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల కోసం బదలాయించుకోవచ్చు. తద్వారా తర్వాతి ఎనిమిది ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడైనా చూపించుకుని పన్ను భారం తగ్గించుకోవచ్చు.
ఉదాహరణకు వార్షికాదాయం రూ.6 లక్షలు అనుకోండి, అలాగే, అద్దె రూపంలో మరో రూ.2 లక్షలు వచ్చిందనుకోండి.. వీటికి అదనంగా ఎఫ్‌అండ్‌వోలోనూ వేలుపెట్టి రూ.3 లక్షలు నష్టపోయారనుకుందాం. అప్పుడు మీ ఆదాయం రూ.6 లక్షలే. వాస్తవంగా వేతనం రూపంలో రూ.6 లక్షలు, అద్దె రూపంలో రూ.2 లక్షలు కలిపితే ఆదాయం రూ.8 లక్షలు. కానీ అద్దె ఆదాయం రూ.2 లక్షల్లో, నష్టం రూ.2 లక్షలను సర్దుబాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఇతర ఆదాయం రూ.2 లక్షలే ఉండడంతో రూ.3 లక్షల నష్టం వచ్చినా కానీ, కేవలం రూ.2 లక్షలు మినహాయించుకోవడం జరిగింది.
మిగిలిన రూ.లక్ష నష్టాన్ని తదుపరి ఏడాదికి బదిలీ చేసుకోవచ్చు. ఇక ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ స్పెక్యులేటివ్ కిందకు వస్తుంది కనుక.. ఇంట్రాడే ట్రేడింగ్‌లో నష్టం వస్తే దాన్ని కేవలం స్పెక్యులేటివ్ ఆదాయం నుంచే మినహాయించుకునేందుకు వీలుంటుంది. ఒక ఆర్థిక సంవత్సరంలో వచ్చిన స్పెక్యులేటివ్ నష్టాన్ని, అదే సంవత్సరం స్పెక్యులేటివ్ ఆదాయం కింద సర్దుబాటుకు వీలు పడకపోతే, తదుపరి 4 ఆర్థిక సంవత్సరాల్లో ఎప్పుడైనా దాన్ని సెట్ ఆఫ్ చేసుకోవచ్చు. అంటే స్పెక్యులేటివ్ నష్టాలను, స్పెక్యులేటివ్ ఆదాయం నుంచే సర్దుబాటు చేసుకోవడానికి ఉంటుంది. నాన్ స్పెక్యులేటివ్(ఎఫ్‌అండ్‌వో) ఆదాయం నుంచి స్పెక్యులేటి వ్ నష్టాలను మినహాయించుకోవడానికి కుదరదు.
ఆడిటింగ్ అవసరమే...
స్టాక్ ట్రేడింగ్ ఆదాయం వ్యాపార ఆదాయం అవుతుంది కనుక ఆదాయపన్ను చట్టం ప్రకారం ఆడిట్ తప్పనిసరి. ఆదాయపన్ను చట్టం ప్రకారం వ్యాపార ఆదాయం రూ.కోటి దాటితే ఆడిట్ తప్పనిసరి అవుతుంది. ట్రేడింగ్ రూపంలో వచ్చిన నష్టాలను క్యారీ ఫార్వార్డ్ చేసుకోవాలంటే, ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ తీసుకోవాలా? అని చాలా మంది పన్ను రిటర్నులు దాఖలు చేసే వారు ఎదుర్కొనే సందేహం. ఈ విషయమై క్లియర్‌ట్యాక్స్ సీఈవో అర్చిత్ గుప్తా స్పందిస్తూ... ఒక వ్యక్తి వార్షిక టర్నోవర్ రూ.కోటి దాటకపోతే కనుక నష్టాలను మినహాయించి చూపించుకునేందుకు, తదుపరి సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్ చేసుకునేందుకు ట్యాక్స్ ఆడిట్ రిపోర్ట్ అవసరం లేదని తెలిపారు.
అయితే, తమకు ఇంత ఆదాయం వస్తుందంటూ స్వచ్ఛందంగా పన్ను చెల్లించే ‘ప్రిజంప్టివ్ ట్యాక్స్ స్కీమ్’ కింద రిటర్నులు దాఖలు చేసే వారికి ట్యాక్స్ ఆడిట్ నిబంధనలు వేరుగా ఉన్నాయి. ఈ స్కీమ్ కింద టర్నోవర్‌లో 6/8 శాతం కంటే తక్కువ లాభం (ట్రేడింగ్ రూపంలో) ఉందని చూపిస్తే మాత్రం ట్యాక్స్ ఆడిట్ తప్పనిసరి అవుతుంది. అదే సమయంలో ఇతర మార్గాలు అయిన.. వేతనం, అద్దె ఆదాయం, వ్యాపార రూపంలో ఆదాయం కనీస పన్ను మినహాయింపు పరిమితి రూ.2.5 లక్షలు మించి ఉన్నా కానీ ఆడిటింగ్ అవసరం అవుతుంది. ఉదాహరణకు.. ఓ వ్యక్తి ప్రిజంప్టివ్ ట్యాక్సేషన్ పథకం కింద తనకు ట్రేడింగ్‌పై నష్టం వచ్చినట్టు చూపించారనుకోండి... అదే సమయంలో ఆ వ్యక్తి మొత్తం ఆదాయం (వేతనం సహా) రూ.2.5 లక్షలు మించి ఉంటే ట్యాక్స్ ఆడిట్ అవసరం అవుతుంది.
టర్నోవర్ అంటే...
టర్నోవర్ అంటే ఏమిటీ..? అన్న సందేహం వస్తే... ఉదాహరణకు ఈక్విటీ ఇంట్రాడే ట్రేడింగ్ సెటిల్‌మెంట్‌లో పేయింగ్ అవుట్/పేయింగ్ ఇన్ తేడాయే టర్నోవర్ అవుతుంది. అంటే రూ.5 లక్షలు కొనుగోలు చేసి, రూ.4 లక్షలకు అమ్మితే, మిగిలిన రూ.లక్ష టర్నోవర్ అవుతుంది. అదే ఎఫ్‌అండ్‌వోలో ట్రేడింగ్ అయితే, నికర లాభం, నష్టం, ఆప్షన్లపై ప్రీమియం టర్నోవర్ కిందకు వస్తాయి. ఉదాహరణకు ఓ కాంట్రాక్టును రూ.5,00,000కు కొనుగోలు చేసి, దాన్ని రూ.5,50,000కు విక్రయించారని అనుకుంటే... అప్పుడు లాభం రూ.50,000 వచ్చినట్టు అవుతుంది. ఇదే టర్నోవర్ అవుతుంది. అదే ఆప్షన్ కాంట్రాక్టులో ఫలానా కంపెనీ లాట్ (1,000 షేర్లు)ను రూ.200కు కొనుగోలు చేసి రూ.180కు అమ్మారనుకోండి. ఈ కేసులో రూ.20,000 నష్టంతోపాటు, ట్రేడర్‌కు నికరంగా లభించే ప్రీమియం రూ.1,80,000 కూడా టర్నోవర్ కిందకు వస్తుంది. ఈ రెండు కేసులను కలిపి చూస్తే, ఫ్యూచర్ కాంట్రాక్టులో నికర లాభం రూ.50,000తోపాటు, ఆప్షన్ కాంట్రాక్టులో మొత్తం రూ.2 లక్షలు కలిపి టర్నోవర్ రూ.2,50,000 అవుతుంది.
Comments
Please login to add a commentAdd a comment