విద్యార్థుల మైండ్‌సెట్ మారుతోంది.. | sakshi interview with Neeraj Saxena! | Sakshi
Sakshi News home page

విద్యార్థుల మైండ్‌సెట్ మారుతోంది..

Published Mon, Jun 27 2016 2:16 AM | Last Updated on Thu, Jul 11 2019 5:07 PM

విద్యార్థుల మైండ్‌సెట్ మారుతోంది.. - Sakshi

విద్యార్థుల మైండ్‌సెట్ మారుతోంది..

సాక్షి’ ఇంటర్వ్యూ: అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్స్ సీఈవో నీరజ్ సక్సేనా...
విద్యా రుణాలకు డిమాండ్ పెరుగుతోంది
ఈసారి రూ. 800 కోట్ల రుణాలివ్వాలనేది లక్ష్యం
విద్యా సంస్థల మౌలిక సదుపాయాలకూ రుణాలు
కోర్సుల భవితను చూసి రుణాలిస్తాం కనక డిఫాల్ట్‌లు తక్కువే
మా మొత్తం రుణాల్లో ఎన్‌పీఏల శాతం 0.05
రెండేళ్లలోనే బ్రేక్ ఈవెన్ దాటి లాభాలు నమోదు చేశాం


హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చదువుకోసం రుణం తీసుకోవటమంటే ఒకప్పుడు విచిత్రం. ఇపుడు సాధారణం. ఇలా ఉన్నత విద్య విషయంలో దృక్పథాలు మారుతుండటంతో విద్యా రుణాల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఈ నేపథ్యంలో విద్యారంగంపై పూర్తి అవగాహనతో, విద్యార్థుల అవసరాలకు తగిన రుణాల్ని అందిస్తోంది అవాన్స్ ఎడ్యుకేషన్ లోన్స్. చదువుకునే విద్యార్థులకు మాత్రమే కాకుండా... మౌలిక సదుపాయాలు మెరుగు పరచుకునేందుకు విద్యా సంస్థలకు కూడా రుణాలిస్తోంది ఈ సంస్థ. విద్యా రుణాల కోసం ప్రత్యేకంగా ఏర్పడిన ఈ సంస్థ తాజా పరిస్థితులకు తగ్గట్టు ఎలా మారుతోందనే విషయమై సంస్థ సీఈఓ నీరజ్ సక్సేనా ‘సాక్షి’ ప్రాఫిట్ ప్లస్ ప్రతినిధితో మాట్లాడారు. ఇంటర్వ్యూ ముఖ్యాంశాలివీ...
 
దేశీయంగా విద్యా రుణాల మార్కెట్ ఎంత?
ప్రస్తుతం దేశీయంగా విద్యా రుణాల పోర్ట్‌ఫోలియో రూ. 60,000 కోట్ల పైనే ఉంది. ఇందులో ప్రభుత్వ రంగ బ్యాంకులదే ప్రధాన వాటా. ప్రస్తుతం ఉన్నత విద్య విషయంలో దృక్పథం మారుతోంది. చదువు కోసం తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించే బాధ్యతను పిల్లలే స్వీకరించాలని, దాన్ని వారు గుర్తెరిగి వ్యవహరించాలని తల్లిదండ్రులు కోరుకుంటుకున్నారు.

ఇలా మారుతున్న ధోరణి, డిమాండు తదితరాల వల్ల విద్యారుణాల మార్కెట్ మరింత పెరిగే అవకాశముంది. ఏటా 2.5 లక్షల మంది పైగా విద్యార్థులు విదేశాలకు వెళుతున్నారు. దేశీయంగా వివిధ కోర్సుల్లో 2 కోట్ల మంది పైగా విద్యార్థులు ఉన్నారు. దేశ, విదేశీ వర్సిటీ ల్లో పెరుగుతున్న ఫీజులు, కరెన్సీ హెచ్చుతగ్గుల వల్ల విద్యా రుణాల డిమాండు పెరుగుతోంది. మా విషయానికొస్తే 2013లో కార్యకలాపాలు  ప్రారంభించాం. ఈ ఏడాది మార్చి 31 నాటికి 4000 మంది విద్యార్థులకు రూ.450 కోట్ల రుణాలిచ్చాం. కళాశాలల విస్తరణ కోసం రూ.80 కోట్ల ఎడ్యుకేషన్ ఇన్‌ఫ్రా రుణాలిచ్చాం.
 
ఈ రంగంలో బ్యాంకులున్నాయి కదా!
మరి మీ ప్రత్యేకతలేంటి?

మేం ఉన్నత విద్యా రంగాన్ని పూర్తిగా అధ్యయనం చేశాం. విద్యార్థి మా దగ్గరకు వచ్చినప్పుడు వారి నేపథ్యం, ప్రమాణాలు, స్కోరు అన్నీ విశ్లేషిస్తాం. వారు ఎంచుకోబోయే కళాశాల రేటింగ్ బట్టి రుణ నిబంధనలుంటాయి. కోర్సులు, వర్సిటీలను విశ్లేషించి, రేటింగ్ నిర్ణయించడానికి మా దగ్గర ప్రత్యేక టీమ్ ఉంది. సాధారణంగా విదేశాల్లో చదవాలనుకునే విద్యార్థులు ఫీజులు చెల్లించేందుకు అడ్మిషన్‌కు ముందే తమ ఆర్థిక స్థోమతను చూపించుకోవాలి.

ఇది గుర్తించే.. మేం అడ్మిషన్‌కు ముందే రుణాన్ని మంజూరు చేస్తున్నాం. ఈ లె టర్‌ను చూపించుకుని ఆయా విద్యార్థులు అడ్మిషన్ నిర్ధారించుకోవచ్చు. అంతేకాదు సందర్భాన్ని బట్టి మార్జిన్ మనీ, డౌన్‌పేమెంట్ లేకుండా కూడా మా దగ్గర లోన్ పొందవచ్చు. దేశీయంగా విద్యాభ్యాసానికి సగటున రూ. 10 లక్షలు, విదేశీ విద్యకు రూ. 25 లక్షల దాకా రుణం అవసరమవుతోంది. కోర్సు, విద్యార్థి నేపథ్యం, పూచీకత్తు, క్రెడిట్ హిస్టరీ మొదలైన వాటిని బట్టి వడ్డీ రేటు 11-14% మేర ఉంటోంది. క్రెడిట్ హిస్టరీ సరిగ్గా లేకపోయినా, కోర్సులు.. వర్సిటీలకూ సరైన అనుమతులు లేకపోయినా, కుటుంబ బాధ్యతలు మరీ ఎక్కువగా ఉన్నా రుణ మంజూరుపై ప్రభావం చూపవచ్చు.
 
ఒకేషనల్ కోర్సులకు కూడా రుణాలిస్తున్నారా?
మేనేజ్‌మెంట్, మెడిసిన్, ఇంజనీరింగ్ వంటి రెగ్యులర్ కోర్సులకు విద్యా రుణం పొందడం సులభమే. కొత్త తరం కోర్సులైన ఫిలిం మేకింగ్, ఫొటోగ్రఫీ, ప్యాషన్ డిజైనింగ్ మొదలైన వాటికి కాస్త కష్టమే అయినప్పటికీ... మేం వీటికి కూడా రుణాలిస్తున్నాం. ప్రస్తుతం కొన్ని ఒకేషనల్ కోర్సులకు రుణాలిస్తున్నాం.
 
ఎగవేత రిస్కులు అందరిలానే మీకూ ఉంటాయా?
విద్యార్థి కోర్సు పూర్తయ్యాక ఉద్యోగం దొరక్క రుణం తిరిగి కట్టలేకపోవడమే ఈ రంగానికెదురయ్యే ప్రధాన సమస్య. దీనికోసం మేం భవిష్యత్‌లో ఎకానమీ స్థితిగతులు, ఆయా కోర్సుల ఉపాధి అవకాశాలను ముందే అధ్యయనం చేస్తున్నాం. అలాగే క్రెడిట్ హిస్టరీపై రుణం తీసుకునే వారిలో అవగాహన కల్పిస్తాం. ఇక కోర్సు చదివే కాలంలో పూర్తి స్థాయిలో రీపేమెంట్ హాలిడేలాంటిది ఉండదు. దీనివల్ల కోర్సు పూర్తయ్యే నాటికి ఈఎంఐల భారం కొంత తగ్గుతుంది. అటు విద్యార్థి పనితీరు కూడా పరిశీలిస్తుంటాం. విద్యా రుణాలను కేవలం ఆర్థికంగానే కాకుండా మిగతా కోణాల నుంచి కూడా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. డిఫాల్టులను నియంత్రించడానికి ఇది ఉపయోగపడుతుంది.
 
మీ విషయంలో డిమాండ్ ఉన్న కోర్సులేంటి?
ఇంజనీరింగ్, మేనేజ్‌మెంట్, మెడిసిన్ వంటి విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులకు ఎక్కువగా డిమాండ్ ఉంటోంది. అయితే, హ్యుమానిటీస్, సోషల్ సెన్సైస్ మొదలైన వాటితో పాటు ఫిలిం మేకింగ్, సంగీతం, ఫ్యాషన్ డిజైనింగ్ తదితర కోర్సులకు సైతం ఆదరణ పెరుగుతోంది.
 
మీ ఎన్‌పీఏల శాతమెంత? విస్తరణ ప్రణాళికలున్నాయా?
స్వల్ప వ్యవధిలోనే బ్రేక్ ఈవెన్ సాధించడంతో పాటు గతేడాది లాభాలు కూడా నమోదు చేశాం. ఇప్పటిదాకా హైదరాబాద్‌లో 700 మంది పైచిలుకు విద్యార్థులకు విద్యా రుణాలిచ్చాం. మార్చి 31 నాటికి మా విద్యా రుణం పోర్ట్‌ఫోలియో సుమారు రూ. 450 కోట్లు. అందులో హైదరాబాద్ వాటా 16 శాతం పైగా ఉంది. మా ఖాతాల్లో ఎన్‌పీఏలు 0.05 శాతంగా ఉన్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో మేం రూ. 343 కోట్ల మేర విద్యా రుణాలిచ్చాం. ఈసారి రెట్టింపు స్థాయిలో రూ. 800 కోట్లు లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement