ఇంటి ధర పెంచుకుందాం! | increase the home cost! | Sakshi
Sakshi News home page

ఇంటి ధర పెంచుకుందాం!

Published Mon, Nov 16 2015 1:46 AM | Last Updated on Sat, Jul 6 2019 3:20 PM

ఇంటి ధర పెంచుకుందాం! - Sakshi

ఇంటి ధర పెంచుకుందాం!

కొనేటప్పుడు కాస్త తక్కువకు రావాలి. అమ్మేటపుడు బాగా ఎక్కువకు పోవాలి!! ఇలా అనుకునేది ఒక్క రియల్టీ విషయంలోనే. ప్రస్తుతం మార్కెట్లో అంత బూమ్ లేదు కాబట్టి మనం కోరుకున్న ధర రావడం కొద్దిగా కష్టమే. అయితే కొంచెం ప్రణాళిక, మరికొంచెం నేర్పుతో కాసింత ఖర్చు పెడితే... ప్రతికూల సమయంలోనూ స్థిరాస్తి విక్రయం పెద్ద కష్టమేమీ కాదు. మరి మీ ఇంటికి విలువ జోడించటం ఎలా? దాన్ని ఆకర్షణీయంగా తయారు చేయటం ఎలా? ఇదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం...

* కొంచెం నేర్పు.. కాసింత ఖర్చు పెడితే చాలు    
* ప్రతికూలంలోనూ స్థిరాస్తి అమ్మకం కష్టం కాదు     
* ఏరియా, సౌకర్యాలు, నిర్వహణ... అన్నీ ముఖ్యమే
సదరు స్థిరాస్తి ఉన్న ప్రాంతం, దాని నిర్మాణ ఖర్చులు, స్థలం ధర... ఇవే ఇంటి ధరను ప్రధానంగా నిర్ణయిస్తాయి. అలాగని పూర్తిగా ఈ అంశాలే ధరను నిర్ణయిస్తాయని అనుకుంటే పొరపాటే. ధరపై అత్యధిక ప్రభావం చూపించేది నిజానికి మార్కెట్ సెంటిమెంటే. అప్పుడు బూమ్ బాగా ఉంటే ఎక్కువ ధరకు కూడా అమ్ముడుపోతుంటాయి.

అదే డీలా పడ్డ పరిస్థితుల్లో ధర తగ్గించినా అమ్ముడుపోవటం కష్టం. గిరాకీ, సరఫరాలు కూడా కొంతమేర ప్రభావం చూపుతాయి. కాబట్టి స్థిరాస్తిని అమ్మాలనుకున్నప్పుడు ముందుగా మార్కెట్ స్థితిగతుల్ని అధ్యయనం చేయాలి. ధరల పోకడ, ఆ ప్రాంతంలో సగటు ధర వంటి విషయాలపై దృష్టిపెట్టాలి.
 
నిర్వహణతోనే రెట్టింపు విలువ..
గేటెడ్ కమ్యూనిటీల్లో పిల్లలకు, పెద్దలకు ప్రత్యేకంగా పార్కులు, ఆట స్థలాలు, స్విమ్మింగ్ పూల్, జిమ్ వంటి ఆధునిక సదుపాయాలు కల్పించగానే సరిపోదు. వాటిని పక్కాగా నిర్వహించే సామర్థ్యం కూడా ఉండాలని, అప్పుడే ఇంటి విలువ రెట్టింపవుతుందని చెబుతున్నారు తెలంగాణ బిల్డర్స్ ఫెడరేషన్ వైస్ ప్రెసిడెంట్ వెంకట్‌రెడ్డి. ‘‘సొసైటీ మెంబర్లు సక్రమంగా ఉండాలి. ప్రతి పైసా ఖర్చుకూ లెక్కలుండాలి.

ప్రతి ఫ్లాట్ యజమానులతో స్నేహపూర్వకంగా మెలగాలి. విద్యుత్, డ్రైనేజీ, మంచినీరు, లిఫ్టు వంటి మౌలిక వసతుల నిర్వహణకు ప్రత్యేకంగా ఉద్యోగులుండాలి. అప్పుడే ఆ గృహ సముదాయం బాగుంటుంది’’ అని చెప్పారాయన. రిపేర్ల విషయంలో నాణ్యమైన వస్తువులనే వినియోగించాలంటూ... ఇంటి విలువ అనేది కేవలం ఫ్లాట్‌కో.. ప్లాట్‌కో పరిమితం కాదని, అందులోని సౌకర్యాలు, నిర్వహణతో కలిపి ఉంటాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారాయన.

ఈ మధ్య కాలంలో వైఫై, జనరేటర్, హౌజ్ కీపింగ్ వంటి వసతులు కూడా ఉంటేనే ధర ఎక్కువ పలుకుతోందని తెలియజేశారు. ఫుల్లీ ఫర్నిష్‌డ్, సెమీ ఫర్నిష్‌డ్ ఫ్లాట్లకు ఇంకాస్త ఎక్కువరేటొస్తుందని చెప్పారు.
 
చిక్కులుండొద్దు..
స్థిరాస్తికి ఎన్ని అనుకూలతలున్నా సరే! ఒక్క విషయంలో చిన్నపాటి తేడా ఉంటే కొనుగోలుదారులు ముందుకురారని గుర్తుంచుకోవాలి. అదే లీగల్ సమస్యలు. మీరు విక్రయించాలనుకున్న స్థిరాస్తికి సంబంధించిన న్యాయపరమైన అంశాల్ని కొనుగోలుదారులకు స్పష్టంగా వివరించాలి. అతనికేమైనా సందేహాలుంటే ఓపిగ్గా నివృత్తి చేయాలి. యాజమాన్య హక్కుల విషయంలో ఎలాంటి వివాదాలు లేవని తేలాకే కొనుగోలుదారుడు ముందడగు వేస్తాడని గుర్తుంచుకోండి.
 
సౌకర్యాలే ముఖ్యం కాదు..
అయితే ఇల్లు కొనే ప్రతి ఒక్కరూ తమ సౌకర్యాల్నే చూసుకోకూడదు. భవిష్యత్తు అవసరాల్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. కారు లేదా బైకు ఉన్నవారికి ప్రజా రవాణా వ్యవస్థ అవసరం ఉండకపోవచ్చు. ఈ-మెయిళ్లు, కొరియర్ల యుగంలో పోస్టాఫీసులు అనవసరం కావచ్చు. ఇవే అంశాలు ఇతరులకు ముఖ్యమవుతాయని గుర్తుంచుకోండి.

ఇంటిని అమ్మేటప్పుడు కీలకంగా మారతాయి. చేరువలోనే షాపింగ్ చేసుకోవడానికి అవకాశముందనుకోండి.. వారాంతపు రోజుల్లో బయటికి షికారు వెళ్లడానికి ఆసక్తిని చూపకపోవచ్చు. కానీ, భవిష్యత్తులో ఇల్లు కొనేవారికి ఇవే కీలకమవుతాయి. ఇలాంటి అంశాల ఆధారంగా ఇంటి అంతిమ విలువను లెక్కగడతారని ప్రతి ఒక్కరూ తప్పక గుర్తుంచుకోవాలి.
 
ప్రాంతం కూడా ముఖ్యమే..
మన ఇంటికి అధిక ధర రావాలంటే అది ఉన్న ప్రాంతమూ ముఖ్యమే. ఇంట్లోని వసతులను మార్చినట్టుగా ప్రాంతాన్ని మార్చలేమనుకోండి. కాకపోతే మన ఇంటి నిర్మాణం ఎంత అభివృద్ధి చెంది ఉంటుందో ఆ ప్రాంతం కూడా అంతే వృద్ధి చెంది ఉండాలనేది మర్చిపోవద్దు. అంటే ఇంట్లోని వసతులకే కాదు ఇంటికి దగ్గర్లో పాఠశాలలు, ఆసుపత్రులు, సినిమా థియేటర్లు, షాపింగ్ మాళ్లకు కూడా ప్రాధాన్యం ఉంటుంది.

అలాగే ఆ ఇంటికొచ్చేందుకు లిఫ్ట్, పార్కింగ్ వంటి వసతులతో పాటుగా అడ్రస్ సులువుగా అర్థమయ్యేలా ల్యాండ్‌మార్క్, ఇంటి నుంచి మెయిన్ రోడ్డుకు వెళ్లేందుకు అనువైన రోడ్డు ఉండాలి.
 
వసతులు చాలా కీలకం...
ఒక ఇంటి అంతిమ విలువ రెండు రకాలుగా నిర్ణయిస్తారు. మొదటిది... ప్రస్తుతం నివసించడానికి సౌకర్యాలన్నీ ఉన్నాయా? అనేది చూసి. రెండోది... ఒకవేళ భవిష్యత్తులో ఇల్లు అమ్మాలనుకుంటే మంచి ధర వస్తుందా? అనేది చూసి. ఉదాహరణకు చేరువలో షాపింగ్ మాళ్లు లేదా దుకాణాలు ఉన్నాయా? స్కూళ్లు, ఆసుపత్రులు, రవాణా సదుపాయాలు వంటివి ఉన్నాయా లేదా అనేవి చూడాల్సిందే.

చుట్టుపక్కల వాళ్లు స్నేహపూర్వకంగా ఉంటేనే ప్రశాంతంగా నివసించొచ్చు. కొత్తగా పెళ్లయిన జంటలకు స్కూళ్ల అవసరముండదు కాబట్టి వీరు ఇల్లు కొనే ముందు ఈ అంశం గురించి పట్టించుకోరు. కాకపోతే ఇంటిని అమ్మాలనుకుంటే మాత్రం ఇదే కీలకంగా మారుతుందన్న విషయం మరిచిపోవద్దు. ప్రజా రవాణా వ్యవస్థ, పోస్టల్ సదుపాయాలు కూడా కీలకమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement