సాక్షి, హైదరాబాద్: అధిక రుణాలు, నిధుల లేమిలతో ఒడిదుడుకులను ఎదుర్కొంటున్న దేశీయ డెవలపర్లకు నిర్మాణ సామగ్రి ధరల పెరుగుదల మరొక గుదిబండలాగా మారింది. నిర్మాణ వ్యయంలో అధిక వాటా ఉండే సిమెంట్, స్టీల్ ధరలు గత ఏడాది కాలంలో 20 శాతం మేర పెరిగాయి. దీంతో నిర్మాణ వ్యయం 10–12 శాతం పెరిగిందని కొల్లియర్స్ రీసెర్చ్ తెలిపింది.
టోకు ధరల ద్రవ్యోల్బణం, మెటీరియల్ ధరలు రెండంకెల పెరుగుదలను నమోదు చేస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది డిసెంబర్ నాటికి నిర్మాణ వ్యయం అదనంగా 8–9 శాతం మేర పెరగొచ్చని అంచనా వేసింది. కరోనా మహమ్మారి నేపథ్యంలో రవాణా పరిమితులు, ఇంధన వనరుల ధరలు పెరుగుదల కారణంగా ఇన్‌పుట్ కాస్ట్ పెరిగాయని కొల్లియర్స్ ఇండియా ఎండీ అండ్ సీఈఓ రమేష్ నాయర్ తెలిపారు.
2021 మార్చితో పోలిస్తే ఈ ఏడాది మార్చిలో స్టీల్ ధరలు 30 శాతం, సిమెంట్ 22 శాతం, కాపర్ 40 శాతం, అల్యూమీనియం 44 శాతం, ఇంధన వనరుల ధరలు 70 శాతం మేర పెరిగాయని వివరించారు. దీంతో గతేడాది మార్చిలో నివాస సముదాయాల నిర్మాణ వ్యయం చ.అ.కు రూ.2,060గా ఉండగా.. ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,300లకు, అలాగే ఇండస్ట్రియల్ నిర్మాణ వ్యయం గతేడాది రూ.1,900ల నుంచి ఈ ఏడాది మార్చి నాటికి రూ.2,100లకు పెరిగిందని వివరించారు. ఇప్పటికే తక్కువ మార్జిన్లతో నిర్మాణ పనులను చేపడుతున్న అందుబాటు, మధ్య స్థాయి గృహ నిర్మాణ డెవలపర్లకు తాజాగా పెరిగిన నిర్మాణ వ్యయం మరింత ఇబ్బందులకు గురి చేస్తుందని చెప్పారు. వ్యయ భారం నుంచి కాసింత ఉపశమనం పొందేందుకు డెవలపర్లు ప్రాపర్టీ ధరలను పెంచక తప్పని పరిస్థితని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment