రిటర్నుల దాఖలుకు మార్గాలివే.. | Property purchased need not be disclosed in income tax return | Sakshi
Sakshi News home page

రిటర్నుల దాఖలుకు మార్గాలివే..

Published Mon, Dec 14 2020 3:46 AM | Last Updated on Mon, Dec 14 2020 8:44 AM

Property purchased need not be disclosed in income tax return - Sakshi

ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్‌) దాఖలుకు మరో రెండు వారాల వ్యవధే మిగిలి ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు వాస్తవానికి జూలైతోనే ముగియాలి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూతలతల నేపథ్యంలో గడువు కాస్తా డిసెంబర్‌ ఆఖరు వరకు పెరిగింది. దీంతో రిటర్నులను ఇప్పటి వరకు చేయని వారు.. డిసెంబర్‌ 31 నాటికి సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నుల దాఖలుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి.
ఆన్‌లైన్‌ వేదికలతోపాటు, ఆఫ్‌లైన్‌లోనూ రిటర్నుల దాఖలులో సాయపడేవారు ఉన్నారు. పన్ను అంశాల పట్ల మీకు అవగాహన ఉంటే స్వయంగా ఈ పనిని చేసుకోవచ్చు. లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను ఆశ్రయించొచ్చు. ఆ వివరాలను ఈ వారం ప్రాఫిట్‌ ప్లస్‌ కథనంలో తెలుసుకుందాం.


ఇంటర్నెట్‌ వినియోగంపై అవగాహన ఉండి, పన్ను విషయాలు కూడా తెలిసిన వారు అయితే నేరుగా ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్‌ వెబ్‌సైట్‌ (incometaxindiaefiling. gov. in) కు వెళ్లి రిటర్నులు ఫైల్‌ చేయవచ్చు. ఈ పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాన్‌ నంబరే యూజర్‌ ఐడీ అవుతుంది. పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం.. తిరిగి లాగిన్‌ అయి రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. ఈ సేవ కోసం ఆదాయపన్ను శాఖ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు.

మీ ఆదాయ వివరాలు సమగ్రంగా సిద్ధం చేసుకుంటే రిటర్నుల దాఖలు పెద్ద కష్టమేమీ కాదు. ఐటీ పోర్టల్‌లో ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. ఫామ్‌ 26ఏఎస్, ఈపే సెల్ఫ్‌ అసెస్‌మెంట్, ఈ వెరిఫై లింక్‌లు కూడా అక్కడే ఉంటాయి. ఫామ్‌ 26ఏఎస్‌లో టీడీఎస్, టీసీఎస్‌ వివరాలు ఉంటాయి. గతంలో దాఖలు చేసిన రిటర్నులను, వాటి పురోగతి తీరును, అవుట్‌స్టాండింగ్‌ ట్యాక్స్‌ డిమాండ్‌ (కట్టాల్సిన పన్ను బకాయిలు ఉంటే), రిఫండ్‌ అభ్యర్థన దాఖలు పురోగతి, ఐటీఆర్‌ 5 రసీదు వివరాలు కూడా అక్కడే లభిస్తాయి.

దాఖలు సమయాన్ని తగ్గించేందుకు వీలుగా పన్ను లెక్కలను కూడా కొన్నింటిని ఆటోమేటెడ్‌ చేశారు. పాన్‌ డేటాబేస్‌ ఆధారంగా గతంలోని ఐటీఆర్‌లు, ఫామ్‌ 26ఏఎస్‌ ఆధారంగా ముందుగానే కొన్ని వివరాలు నింపిన రిటర్నులు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గత కొన్నేళ్ల కాలంలో కొన్ని అదనపు సౌకర్యాలను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది. భద్రతా కోణంలో లాగిన్‌కు రెండో దశ అథెంటికేషన్‌ను ‘ఈ ఫైలింగ్‌ వాల్ట్‌’ రూపంలో ప్రవేశపెట్టింది. యూజర్‌ ఐడీ, పాస్‌వర్డ్‌ సాయంతో కాకుండా.. మరింత భద్రత కోసం నెట్‌ బ్యాంకింగ్, ఆధార్‌ ఆధారిత ఓటీపీ రూపంలోనూ లాగిన్‌ కావొచ్చు.

మధ్యవర్తుల సాయం..
స్వయంగా రిటర్నులు దాఖలు చేసుకునేంత అవగాహన లేని వారు లేదా అంత తీరిక లేని వారు మధ్యవర్తుల సాయం తీసుకోవచ్చు. ఇందు కోసం ఎన్నో వెబ్‌ పోర్టళ్లు (వెబ్‌సైట్స్‌) అందుబాటులో ఉన్నాయి. ఈ పోర్టళ్లు మీ నుంచి అవసరమైన సమాచారం అంతా తీసుకుని, పన్ను చెల్లింపు బాధ్యతలను మదింపు చేసిన అనంతరం మీ తరఫున రిటర్నులను ఆదాయపన్ను పోర్టల్‌ వేదికపై దాఖలు చేస్తాయి. కొన్ని పోర్టళ్లు ఉచితంగానూ ఈ సేవలను ఆఫర్‌ చేస్తున్నాయి.

రూ.5లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ‘ట్యాక్స్‌స్మైల్‌’ పోర్టల్‌ ఉచితంగా రిటర్నుల ఫైలింగ్‌ సేవను అందిస్తోంది. అదే విధంగా క్లియర్‌ట్యాక్స్‌ పోర్టల్‌ కూడా కొందరికి ఇటువంటి సేవను ఆఫర్‌ చేస్తోంది. ఒకటికి మించిన మార్గాల్లో ఆదాయం కలిగి ఉండి లేదా విదేశీ ఆదాయం ఉండుంటే నిపుణుల సేవలను రిటర్నుల ఫైలింగ్‌ కోసం తీసుకోక తప్పదు. ఈ విషయంలో చార్టర్డ్‌ అకౌంటెంట్‌ (సీఏ) సేవలను వినియోగించుకోవచ్చు. ఒక వ్యక్తికి ఉన్న ఆదాయ వనరుల ఆధారంగా రిటర్నుల దాఖలుకు వెబ్‌ పోర్టళ్లు ఫీజులను నిర్ణయిస్తున్నాయి.

అందించే సేవల ఆధారంగా రూ.699 నుంచి రూ.7,999 వరకు ఫీజుల కింద ట్యాక్స్‌స్పానర్‌ అనే సంస్థ తీసుకుంటోంది. రిటర్నుల దాఖలే కాకుండా పలు పోర్టళ్లు విలువ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. ఐటీఆర్‌ దాఖలు తర్వాత వాటిల్లోని తప్పొప్పులను సరిచేసుకోవడం, డిమాండ్‌ నోటీసులకు స్పందించడం తదితర అంశాల్లో నిపుణుల సేవలను కూడా వీటి నుంచి పొందొచ్చు. పన్ను నిపుణులు లేదా సీఏలతో తమ సందేహాలను తీర్చుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు వాల్ట్‌ సేవను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. రిటర్నుల దాఖలుతోపాటు ఈ సేవలను కూడా పొందే విధంగా ప్యాకేజీలను ఆఫర్‌ చేస్తున్నాయి.  

టీఆర్‌పీలు
ప్రభుత్వం నియమించిన పన్ను దాఖలు సన్నాహకుల (టీఆర్‌పీలు) సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మీకు సమీపంలో ఉన్న టీఆర్‌పీల వివరాలను ఇన్‌కమ్‌ట్యాక్స్‌ఇండియా డాట్‌ జీవోవీ డాట్‌ ఇన్‌ పోర్టల్‌లో ‘ట్యాక్స్‌పేయర్‌ సర్వీసెస్‌’ ట్యాబ్‌ నుంచి పొందొచ్చు.  టీఆర్‌పీలు మొదటి ఏడాది రిటర్నుల దాఖలు, పన్ను చెల్లింపులపై 3% సర్వీసు చార్జీ కింద తీసుకుంటారు. అదే వ్యక్తి రెండో ఏడాది రిటర్నుల దాఖలు సేవను కోరుకుంటే 2%, తర్వాతి ఏడాది ఒక శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ట చార్జీ రూ.1,000. ఒకవేళ ఏదేనీ సంవత్సరం ఈ చార్జీ రూ.250 కూడా మించకపోతే అప్పుడు టీఆర్‌పీలు కనీస చార్జీ తీసుకునేందుకు అర్హులు. కాకపోతే వీరి సేవలు పన్ను రిటర్నుల దాఖలు వరకే అని గుర్తుంచుకోవాలి. ఆన్‌లైన్‌ పోర్టళ్ల మాదిరి ఏడాది పొడవునా సేవలు, విలువ ఆధారిత సేవలు వీరి నుంచి లభించవు.  

గడువు దాటొద్దు..
కరోనా కారణంగా 2019–20 ఆర్థిక సంవత్సరం రిటర్నుల దాఖలు గడువును జూలై నుంచి తొలుత నవంబర్‌ ఆఖరుకు, ఆ తర్వాత డిసెంబర్‌ 31కు కేంద్రం పొడిగించింది. ఈ గడువులోపు రిటర్నులను దాఖలు చేయకపోతే.. ఆ తర్వాత వడ్డీ చార్జీలు, పెనాల్టీలను చెల్లించుకోవాలి. రిఫండ్‌లు కూడా ఆలస్యమవుతాయి. గతంలో పెనాల్టీలు విధించడం అన్నది పన్ను అధికారుల విచక్షణపైనే ఆధారపడగా, ఇప్పుడైతే అది చట్ట ప్రకారం అమలవుతోంది.

ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 234 ఎఫ్‌ కింద.. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు, ఆలోపు ఉంటే డిసెంబర్‌ 31 తర్వాత రిటర్నుల దాఖలుకు రూ.1,000 పెనాల్టీ చార్జీగా చెల్లించాలి. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు మించి ఉంటే ఈ పెనాల్టీ రూ.10,000. గడువు లోపు రిటర్నులు దాఖలు చేయకుండా, ఆలస్యంగా రిటర్నులు వేసి పన్ను చెల్లించినట్టయితే ఆ మొత్తంపై వడ్డీ కూడా వసూలు చేయాలని సెక్షన్‌ 234ఏ చెబుతోంది. ఆలస్యమైన ప్రతీ నెలకు ఒక శాతం చొప్పున వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది కూడా పన్ను బాధ్యత రూ.లక్ష వరకు ఉన్న వారికే. ఒకవేళ రూ.లక్షకు మించి పన్ను చెల్లించాల్సి ఉండి, డిసెంబర్‌ 31 తర్వాత రిటర్నులు వేసినట్టయితే.. అప్పుడు 2020 జూలై 31 తర్వాతి నుంచి రిటర్నులు వేసే నాటి వరకు ఈ మేరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.  

మీరు రిటర్నులు వేయాల్సిందే..!
కనీస మినహాయింపు పరిధిలో ఆదాయం ఉన్న వారు (60ఏళ్లలోపు వ్యక్తులకు రూ.2.5 లక్షలు) రిటర్నులు దాఖలు చేయక్కర్లేదు. కానీ, ఏదేనీ ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను వర్తించే స్థాయిలో ఆదా యం లభిస్తే ఆ ఏడాదికి రిటర్నులు వేస్తే సరిపోయేది. అయితే, ఇక మీదట పన్ను వర్తించే ఆదాయ పరిధిలో లేకపోయినా కానీ.. నిర్దేశిత లావాదేవీలలో ఏవైనా నిర్వహించినట్టయితే తప్పకుండా రిటర్నులు వేయాలి. డిపాజిట్లు రూ.కోటికి మించి చేసినా (ఒకటి లేదా అంతకుమించిన కరెంటు ఖాతాలలో), విదేశీ పర్యటన కోసం రూ.2లక్షలపైన ఖర్చు పెట్టినా, ఒక ఏడాదిలో విద్యుత్తు బిల్లు రూ.లక్ష దాటినా తమ ఆదాయంతో సంబంధం లేకుండా ఐటీఆర్‌ దాఖలు చేయాలి.

ఎవరు ఏ రిటర్నులు వేయాలి?
ఐటీఆర్‌–1: రూ.20 లక్షల ఆదాయం మించని వ్యక్తులు ఐటీఆర్‌–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక్క వేతనం లేదా ఇంటిపై ఆదాయం లేదా వడ్డీ ఆదాయం, లేదా వ్యవసాయంపై ఆదాయం రూ.5,000 వరకు ఉన్న వారు, లేదా ఇవన్నీ కలిగిన వారు ఐటీఆర్‌–1 ఫైల్‌ చేయాలి.

ఐటీఆర్‌–2: ఐటీఆర్‌–1 పరిధిలోని వారు కాకుండా.. ఒక వ్యక్తి కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటే లేదా స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో నమోదు కాని కంపెనీలో ఇన్వెస్ట్‌ చేసినట్టయితే ఐటీఆర్‌–2 దాఖలు చేయాలి. అలాగే, క్రితం ఆర్థిక సంవత్సరాల్లోని మూలధన లాభాలను చూపించుకునేట్టు అయితే లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నష్టాలను తర్వాతి సంవత్సరాలకు కొనసాగించుకోవాలనుకుంటే, ఇతర వనరుల ద్వారా ఆదాయం వచ్చిన వారు కూడా ఇదే రిటర్న్‌ వేయాల్సి ఉంటుంది.  

ఐటీఆర్‌–3: వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్‌) వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆర్జించి ఉంటే ఐటీఆర్‌–3ను ఫైల్‌ చేయాలి.

ఐటీఆర్‌–4: భారతీయ నివాసితులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు (ఎల్‌ఎల్‌పీ కాకుండా) వ్యాపారం, వృత్తి రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉంటే ఐటీఆర్‌–4 వేయాల్సి ఉంటుంది.
ఐటీఆర్‌–5/6/7: నిర్దేశిత వ్యక్తులు, ఎల్‌ఎల్‌పీలు, సంస్థలు, కంపెనీలకు ఇవి వర్తిస్తాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement