BRAND SUTRA: ప్రముఖ సంస్థ లావి ప్యారెంట్ బ్రాండ్ 'బ్యాగ్‌జోన్' (Bagzone) మల్టీ-కేటగిరీ, మల్టీ-బ్రాండ్ వ్యాపారంగా వృద్ధి సాధించాలనే లక్ష్యంతో ఉన్నట్లు కంపెనీ సీఈఓ 'ఆయుష్ తైన్‌వాలా' వెల్లడించారు. ఈ క్రమంలోనే బ్రాండ్ ఇటీవల వాచ్‌ల విభాగంలోకి కూడా ప్రవేశించింది. ఈ సంస్థ 2023 ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా రూ. 500 కోట్ల అమ్మకాలను సాధించి రికార్డ్ క్రియేట్ చేసిందని, రానున్న రోజుల్లో కంపెనీ రూ. 800 కోట్లకు చేరటానికి సన్నద్ధమవుతోందని తెలిపాడు.
ఈ ఆర్థిక సంవత్సరంలో కంపెనీ సుమారు 10 రెట్లు వృద్ధి సాధించడానికి.. మల్టీ-కేటగిరీ, మల్టీ-బ్రాండ్ వ్యాపారాలను లక్ష్యంగా చేసుకున్నట్లు తెలుస్తోంది. అంతే కాకుండా సంస్థ 300 బ్రాండ్ అవుట్‌లెట్‌లను ప్రారంభించడం ద్వారా 70 శాతం స్థానిక సోర్సింగ్ లక్ష్యాన్ని సాధించడం, ఆఫ్‌లైన్ విధానం పెంచడానికి ఆలోచిస్తోంది. అనుకున్న విధంగా అన్ని సజావుగా జరిగితే.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు 1000 మందికి ఉపాధి అవకాశాలు లభించే అవకాశం ఉంది.
నిధుల ప్రకటన సమయంలో, కంపెనీ తయారీ సామర్థ్యాలను విస్తరించే ప్రణాళికలను వెల్లడించింది. ఇందులో భాగంగా ఇగత్‌పురి జిల్లాలోని నాసిక్ వెలుపల, ప్రస్తుతం ఉన్న ఫ్యాక్టరీకి సమీపంలో రెండవ ఫ్యాక్టరీని నిర్మించే ప్రక్రియలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త ఫ్యాక్టరీ త్వరలోనే ప్రారంభమవుతుందని, దీంతో ఉత్పత్తి సామర్థ్యం నెలకు 5 లక్షలకు పెరుగుతుందని సమాచారం. ఇప్పటి వరకు నాసిక్ ప్లాంట్‌లో నెలకు సుమారుగా 2 లక్షల బ్యాగులను ఉత్పత్తి చేస్తున్నట్లు తైన్‌వాలా తెలిపారు.
కంపెనీ హ్యాండ్‌బ్యాగ్‌లు, స్లింగ్ బ్యాగ్‌లు, టోట్ బ్యాగ్‌లు, మహిళల పర్సులు, ల్యాప్‌టాప్ హ్యాండ్‌బ్యాగ్‌లు, ఫ్యాషన్ బ్యాక్‌ప్యాక్‌లు, బాక్స్ బ్యాగ్‌లు వంటివి తయారు చేస్తోంది.
కంపెనీ 2020లో తన బ్రాండ్ ఎక్స్‌టెన్షన్ లావి స్పోర్ట్ కింద యునిసెక్స్ బ్యాక్‌ప్యాక్‌లను ప్రారంభించింది. ఇప్పుడు డఫిల్ బ్యాగ్‌లు, బ్రీఫ్‌కేస్‌లు, వాలెట్‌లు, స్లింగ్‌ల వంటి యాక్సెసరీస్ కూడా తయారు చేస్తుంది. కాగా ఏడాది ప్రారంభంలో రీజనబుల్ ధరల వద్ద బ్రాండ్ బ్యాగులను అందించడానికి లావి లక్స్‌ను సృష్టించింది. వీటి ధర రూ. 3000 నుంచి రూ. 7000 మధ్య ఉంటుంది. మహిళల వాచ్‌ల ధరలు రూ. 5999 నుంచి ఉన్నాయి.
బ్రాండ్ వాచ్‌లు లావి అధికారిక వెబ్‌సైట్‌లో లేదా దేశవ్యాప్తంగా ఉన్న లావి రిటైల్ అవుట్‌లెట్‌లలో అందుబాటులో ఉంటాయి. కంపెనీ ఈ ఉత్పత్తుల మీద ఏకంగా ఒక సంవత్సరం వారంటీ కూడా అందిస్తోంది. సర్వీస్ సెంటర్లు కూడా అందుబాటులో ఉంటాయి.
కంపెనీ రిటైల్ విస్తరణకు కూడా ప్రణాళికలు ఉన్నాయని, దక్షిణాదిలో రిటైల్ ఉనికిని పెంచడానికి దృష్టి సారించే ప్రయత్నం చేస్తున్నట్లు ఆయుష్ తైన్‌వాలా తెలిపాడు. ఇందులో మెట్రో నగరాలు, చిన్న నగరాలు వంటి వాటితో పాటు టైర్ 1 నగరాల్లో బ్రాండ్ విస్తరణ గురించి ఆలోచిస్తున్నట్లు వెల్లడించారు.
టైర్ 2, టైర్ 3 నగరాలను కవర్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ.. టైర్ 1 నగరాలే ప్రధానమని తైన్‌వాలా వెల్లడిస్తూ.. పశ్చిమ దేశాలలో మా ఉనికి బలంగా ఉందని, దక్షిణాదిలో కొంచెం బలహీనంగా ఉన్నట్లు తెలిపాడు. ఈ నగరాలను వృద్ధి చేసుకోవాలంటే రిటైల్ స్టోర్లను పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే ఆలోచనను వ్యక్తం చేశారు.
మొత్తం విక్రయాలు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ విధానంలో సాగుతున్నాయి. ఆఫ్‌లైన్ విధానంలో రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేసుకోవచ్చు, అయితే ఆన్‌లైన్ కొనుగోలు కోసం 'లావీవరల్డ్.కమ్'లో మాత్రమే కాకుండా అమెజాన్, మింత్రా, ఫ్లిప్‌కార్ట్, నైకా వంటివాటిని ఉపయోగించుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment