వ్యాపకం.. వ్యాపారమైతే.. | online shopping | Sakshi
Sakshi News home page

వ్యాపకం.. వ్యాపారమైతే..

Published Fri, Sep 5 2014 11:04 PM | Last Updated on Sat, Sep 2 2017 12:55 PM

వ్యాపకం.. వ్యాపారమైతే..

వ్యాపకం.. వ్యాపారమైతే..

గడప దాటకుండానే గడించడానికి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ మార్గాలనేకం ఉన్నాయి. వ్యాపకాన్ని వ్యాపారావకాశంగా మార్చుకోవడం కూడా వాటిల్లో ఒకటి. కమ్మని వంటకాలు చేయడం మీ హాబీనా? ఎంచక్కా క్యాటరింగ్ బిజినెస్ మొదలుపెట్టొచ్చు. మేకప్, ఫ్యాషన్, సౌందర్య సాధనాలపై మంచి అభిరుచి ఉంటే దాన్ని కూడా ఆదాయ వనరుగా మార్చుకోవచ్చు. ఇదంతా జరగాలంటే హాబీని వ్యాపారావకాశంగా మల్చుకునేది ఎలా, ఏయే జాగ్రత్తలు తీసుకోవాలి మొదలైనవి తెలియాలి. అందులో కొన్ని ఇవి..
 
1. సరదా కోసమే కాకుండా మనసుకు కాస్త సంతృప్తి కూడా కలిగించే వాటిని హాబీలుగా ఎంచుకుంటూ ఉంటాం. అలాంటి వాటికి వ్యాపారపరమైన రూపునిస్తున్న పక్షంలో ప్రశ్నించుకోవాల్సిన విషయం ఒకటుంది. మనస్సుకు సాంత్వననిచ్చే హాబీ కాస్తా హోమ్ బిజినెస్‌గా మారిన తర్వాత కూడా దానిపై ఆసక్తి కొనసాగించగలమా, ఆస్వాదించగలమా అన్నది ఆలోచించుకోవాలి. వ్యాపకంలో లాభనష్టాలు, ఆర్థిక కోణాల ప్రసక్తి ఉండదు. అదే వ్యాపారం అంటే.. అనేక లెక్కలు ఉంటాయి. అప్పటిదాకా హాబీగా ఉన్నది కాస్తా ప్రధాన ఆదాయ వనరుగా మారితే లాభనష్టాల గురించి ఆలోచించడం ఎక్కువవుతుంది కనుక.. దాన్ని ఆస్వాదించే అవకాశాలు తగ్గొచ్చు. కనుక ఇలాంటివన్నీ బేరీజు వేసుకుని ముందడుగు వేయాలి.
 
2.
హాబీని బిజినెస్‌గా మార్చుకుందామని నిర్ణయించుకుంటే అసలు దానికి మార్కెట్ అనేది ఉందా అన్నది తెలుసుకోవాలి. మీరు చేసే వంటకాలను, తయారుచేసే ఆభరణాలు మొదలైన వాటిని మీ చుట్టుపక్కాలు, స్నేహితులు మెచ్చుకోవచ్చు. కానీ మార్కెట్లో వాటిని అమ్మితే డబ్బులిచ్చి కొనుక్కునేంత నాణ్యత, ప్రత్యేకత ఉందా అన్నది చూసుకోవాలి. మన ఇంటి దగ్గర అద్భుతంగా ఉందనుకున్నా మార్కెట్లోకి వెళ్లినప్పుడు అట్టర్‌ఫ్లాప్ కావొచ్చు. కనుక, ఇందుకోసం మార్కెట్ రీసెర్చ్ చేయాలి. మిగతా వాటికి ఎంత భిన్నంగా, ఎంత నాణ్యంగా మీరు ప్రొడక్టును అందించగలరన్నదానిపై దృష్టి పెట్టాలి. అప్పుడే కస్టమర్లు మీ వైపు వస్తారన్నది గుర్తుపెట్టుకోవాలి.
 
3. టెస్ట్ చేయండి. యెకాయెకిన వ్యాపారంలోకి దూకేయకుండా ముందుగా ఒకసారి మీ హాబీని వ్యాపారంగా మార్చుకుంటే వర్కవుట్ అవుతుందో లేదో టెస్ట్ చేసి చూడండి. ఒకవైపు జాబ్ మానకుండా కొనసాగిస్తూనే మరోవైపు పార్ట్‌టైమ్ వ్యాపారంగా హాబీని పరీక్షించండి. కొంతైనా సరే ఆదాయం ఎలా వస్తోంది, విస్తరిస్తే ఎలా వచ్చే అవకాశం ఉంది అన్నది పరిశీలిస్తే రంగంలోకి దిగొచ్చా లేదా అన్నదానిపై అవగాహన వస్తుంది.
 
4.  ప్రణాళిక ఉండాలి.. టెస్ట్ డ్రైవ్‌ని బట్టి ముందుకెళ్లవచ్చు అనుకున్న పక్షంలో బిజినెస్ ప్లాన్‌ని ఒకటి తయారు చేసుకోండి. ఏ స్థాయిలో మొదలుపెడుతున్నారు, ఎప్పటికల్లా ఏ స్థాయికి చేర్చాలనుకుంటున్నారు వంటి లక్ష్యాలను నిర్దేశించుకోండి. ఏముందీ, ఇప్పటిదాకా పార్ట్‌టైమ్‌గా ఉన్నది కాస్తా ఫుల్‌టైమ్ అవుతుంది .. దీనికంటూ పెద్దగా ప్రణాళికలు వగైరా అంటూ హడావుడి అనవసరం అని తేలిగ్గా తీసిపారేయకండి. వ్యాపారం వృద్ధి చెందాలంటే ప్లానింగ్ చేసుకోవడం, సమీక్షించుకోవడం, బిజినెస్ వ్యూహంలో మార్పులు, చేర్పులు చేపట్టడం అనివార్యం. అలాగే, చట్టబద్ధంగా అనుమతులు మొదలైనవి తీసుకోవాల్సి ఉందేమో చూసుకోవాలి.
 
5. మార్కెటింగ్.. మార్కెటింగ్.. మార్కెటింగ్. హోమ్ బిజినెస్ విజయవంతం కావాలంటే కావాల్సినది నాణ్యమైన ఉత్పత్తి లేదా సర్వీసు అందించడమో మాత్రమే సరిపోదు. సాధ్యమైనంత ఎక్కువమందికి వాటి గురించి తెలియాలి. కనుక రోజువారీ వ్యాపార కార్యకలాపాల్లో మార్కెటింగ్ కచ్చితంగా భాగం కావాలి. ప్రస్తుతం ఫేస్‌బుక్ వంటి సోషల్ నెట్‌వర్కింగ్ సైట్లు ఇందుకు చాలా ఉపయోగపడుతున్నాయి. కేవ లం మీ చుట్టుపక్కల ప్రాంతాలకే పరిమితం కాకుండా ఇలాంటి వాటితో ఎక్కడెక్కడో ఉన్న కస్టమర్లకు కూడా చేరువ కావొచ్చు. వ్యాపారావకాశాలను ఎలా మెరుగుపర్చుకోవచ్చన్న దానిపై ఈ తరహా సైట్స్‌లో ఎక్స్‌పర్ట్‌ల నుంచి సలహాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, దీని కన్నా ముందుగానే ఎవరు కొనే అవకాశం ఉంది, ఏ విధంగా వారి దృష్టిని ఆకర్షించాలి, ఎలా వారిని చేరాలి మొదలైన వాటి కోసం ఒక ప్రణాళిక అంటూ తయారుచేసుకోవాలి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement