సాక్షి, హైదరాబాద్ : ప్రస్తుత పండుగల సీజన్‌లో... ‘హైబ్రిడ్ షాపింగ్’నకు రోజురోజుకూ క్రేజ్ పెరుగుతోంది. ‘రాఖీ బంధన్’తో మొదలై వచ్చే ఏడాది ప్రథమార్థం దాకా ఈ ఫెస్టివల్ సీజన్ సుదీర్ఘంగా సాగనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే మొదలైన ఈ సీజన్‌లో హైబ్రిడ్ షాపింగ్‌నకే అధికశాతం మొగ్గుచూపుతున్నట్టు వివిధ అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుత వినియోగదారులు మరీ ముఖ్యంగా నవ, యువతరం ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకోవడంతో పాటు డిజిటల్ టెక్నాలజీని విరివిగా ఉపయోగిస్తున్నారు.
ఈ నేపథ్యంలో...ఆన్‌లైన్‌తో పాటు ఆఫ్‌లైన్‌లోనూ షాపింగ్‌కు కస్టమర్లు సిద్ధమవుతున్నారు. కోవిడ్ తెచ్చి న మార్పుచేర్పులతో... షాపింగ్, ఇతర విషయాల్లో కొత్త కొత్త విధానాలు, పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. గతేడాదితో పోల్చితే ఈసారి 84 శాతం వినియోగదారులు తమ షాపింగ్ బడ్జెట్‌ను గణనీయంగా పెంచినట్టు అడ్వర్టయిజ్‌మెంట్ యూనికార్న్ సంస్థ ‘ఇన్‌మోబీ’తాజా నివేదికలో వెల్లడైంది.
నివేదికలో ఏముందంటే...
చేతిలో ఇమిడిపోయే మొబైల్ ఫోన్లతోనే షాపింగ్ చేయడం, సంస్థల సైట్లను ఆన్‌లైన్‌లోనే వీక్షించి, సమీక్షించుకునే సౌలభ్యం ఉన్నందున పలువురు ఆన్‌లైన్ కొనుగోళ్లకు మొగ్గుచూపుతున్నారు. ఐతే...ఆన్‌లైన్‌తో పాటు స్వయంగా షాప్‌లకు వెళ్లి వివిధరకాల వస్తువులు, ఇతరత్రా సామగ్రి కొనేందుకు ఇష్టపడుతున్న వారి సంఖ్య గణనీయంగా ఉన్నట్టుగా... అ రెండింటిని సమ్మిళితం చేసి హైబ్రిడ్ షాపింగ్ చేసే వారు 54 శాతం ఉన్నట్టుగా ఈ నివేదిక వెల్లడించింది. దేశవ్యాప్తంగా మొబైల్‌ఫోన్లను వినియోగించే వారి నుంచి వివిధ అంశాల వారీగా ఈ సంస్థ సమాచారాన్ని సేకరించింది.
ఆఫర్ల సమాచారం ఎలా తెలుసుకుంటున్నారు?
- మొబైల్‌లో సెర్చింగ్, ప్రకటనల ద్వారా.. 46%
- బ్రాండ్ వెబ్‌సైట్లు/ వివిధ యాప్‌ల ద్వారా.. 15%
- ప్రత్యక్షంగా షాపులకు వెళ్లి తెలుసుకునేవారు.. 11%
- కుటుంబం, స్నేహితుల ద్వారా.. 7%
- టీవీ ప్రకటనలు, ఇతర రూపాల్లో.. 7%
- వార్తాపత్రికలు, మ్యాగజైన్ల ద్వారా.. 6%
- ఈమెయిళ్లు, బ్రాండ్ల నుంచి న్యూస్‌లెటర్లతో.. 4%
- వాట్సాప్‌లో బ్రాండ్ల ద్వారా వచ్చే సమాచారంతో.. 3%
తదనుగుణంగా మార్కెటింగ్ వ్యూహాలు...
‘తమ స్మార్ట్‌ఫోన్ల ద్వారానే షాపింగ్ చేయాలని 78 శాతం మంది భావిస్తున్నారు. దీనికి తగ్గట్టుగా వివిధ కంపెనీలు, సంస్థలు కూడా తమ మార్కెటింగ్ వ్యూహాలను రూపొందించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ విధంగా ప్రస్తుత పండుగల సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించేందుకు, వారు కోరుకున్న విధంగా ఆయా వస్తువులను అందించేందుకు, వారితో నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ఇది ఉపయోగపడుతుందని భావిస్తున్నాము’ - వసుత అగర్వాల్,చీఫ్ బిజినెస్ ఆఫీసర్, కన్జ్యూమర్ అడ్వర్టయిజింగ్ ప్లాట్‌ఫామ్, ఇన్‌మోబీ
Comments
Please login to add a commentAdd a comment