ITR-1
-
ఐటీ రిటర్న్స్.. కీలక మార్పులు
ITR filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. వ్యక్తులు, వ్యక్తిగత సంస్థలు లేదా సంఘాలు జూలై 31 లోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.ఐటీఆర్-1 ఫారంఅత్యధిక పన్ను రిటర్న్స్ ఐటీఆర్-1 (ITR-1) ఫారం ద్వారానే దాఖలవుతాయి. దీన్ని సహజ్ ఫారం అని కూడా పిలుస్తారు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 50 లక్షలకు మించని వ్యక్తులు ఈ కేటగిరీ కింద రిటర్న్స్ ఫైల్ చేయడానికి అర్హులు. జీతం, ఒకే ఇంటి ఆస్తి, కుటుంబ పెన్షన్, వ్యవసాయం (రూ. 5,000 వరకు), పొదుపు ఖాతాల నుంచి వడ్డీ, డిపాజిట్లు (బ్యాంక్/పోస్ట్ ఆఫీస్/కోఆపరేటివ్ సొసైటీ), ఆదాయపు పన్ను రీఫండ్ వడ్డీ.. ఇలా వివిధ మార్గాలలో లభించే ఆదాయంపై పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.ITR-1కి చేసిన కీలక మార్పులు2024-25 అసెస్మెంట్ ఇయర్‌కి గానూ ఐటీఆర్-1 ఫారం దాఖలులో ఆదాయపు పన్ను శాఖ పలు కీలక మార్పులు చేసింది. అవేంటంటే..ITR-1 ఫారమ్‌ను ఫైల్ చేసే వ్యక్తులు తమ పన్ను రిటర్న్ ఫైలింగ్‌లో తమకు ఇష్టమైన పన్ను విధానాన్ని పేర్కొనాలి.సెక్షన్ 115BACలో ఫైనాన్స్ యాక్ట్ 2023 ప్రవేశపెట్టిన సవరణలను అనుసరించి కొత్త పన్ను విధానం ఇప్పుడు డిఫాల్ట్ పన్ను విధానం. వ్యక్తులు, హోచ్యూఎఫ్లు, ఏఓపీలు, బీఓఐలకు కొత్త పన్ను విధానం స్వయంచాలకంగా వర్తిస్తుంది. పాత పన్ను విధానాన్ని కొనసాగించాలనుకునే వారు సెక్షన్ 115BAC(6) నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టంగా తెలియజేయాలి.వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం కాకుండా ఇతర ఆదాయం ఉన్న వ్యక్తులు సెక్షన్ 139(1) ప్రకారం సంబంధిత అసెస్మెంట్ సంవత్సరానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లో తప్పనిసరిగా తమ ప్రాధాన్య పన్ను విధానాన్ని పేర్కొనాలి.ఆర్థిక చట్టం 2023 ద్వారా ప్రవేశపెట్టిన సెక్షన్ 80CCH ప్రకారం.. 2022 నవంబర్ 1, ఆ తర్వాత అగ్నిపథ్ స్కీమ్‌లో చేరి అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న వ్యక్తులు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేసిన మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపునకు అర్హులు.ఈ మార్పునకు అనుగుణంగా, ITR-1 ఫారంను కొత్త కాలమ్‌ను పొందుపరుస్తూ సవరణలు చేశారు. సెక్షన్ 80CCH కింద మినహాయింపు కోసం అర్హత ఉన్న మొత్తానికి సంబంధించిన వివరాలను కొత్త ఐటీఆర్-1 ఫారం ద్వారా పన్ను చెల్లింపుదారులు అందించాల్సి ఉంటుంది. -
రిటర్నుల దాఖలుకు మార్గాలివే..
ఆదాయపన్ను రిటర్నుల (ఐటీఆర్) దాఖలుకు మరో రెండు వారాల వ్యవధే మిగిలి ఉంది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రిటర్నుల దాఖలు గడువు వాస్తవానికి జూలైతోనే ముగియాలి. కానీ, కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూతలతల నేపథ్యంలో గడువు కాస్తా డిసెంబర్ ఆఖరు వరకు పెరిగింది. దీంతో రిటర్నులను ఇప్పటి వరకు చేయని వారు.. డిసెంబర్ 31 నాటికి సమర్పించాల్సి ఉంటుంది. రిటర్నుల దాఖలుకు ఎన్నో మార్గాలు ఉన్నాయి. ఆన్లైన్ వేదికలతోపాటు, ఆఫ్లైన్లోనూ రిటర్నుల దాఖలులో సాయపడేవారు ఉన్నారు. పన్ను అంశాల పట్ల మీకు అవగాహన ఉంటే స్వయంగా ఈ పనిని చేసుకోవచ్చు. లేదా అందుబాటులో ఉన్న ఇతర మార్గాలను ఆశ్రయించొచ్చు. ఆ వివరాలను ఈ వారం ప్రాఫిట్ ప్లస్ కథనంలో తెలుసుకుందాం. ఇంటర్నెట్ వినియోగంపై అవగాహన ఉండి, పన్ను విషయాలు కూడా తెలిసిన వారు అయితే నేరుగా ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ వెబ్సైట్ (incometaxindiaefiling. gov. in) కు వెళ్లి రిటర్నులు ఫైల్ చేయవచ్చు. ఈ పోర్టల్‌లో ముందుగా నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. మీ పాన్ నంబరే యూజర్ ఐడీ అవుతుంది. పాస్‌వర్డ్‌ను ఏర్పాటు చేసుకుని నమోదు ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం.. తిరిగి లాగిన్ అయి రిటర్నులను దాఖలు చేసుకోవచ్చు. ఈ సేవ కోసం ఆదాయపన్ను శాఖ ఎటువంటి చార్జీలు వసూలు చేయదు. మీ ఆదాయ వివరాలు సమగ్రంగా సిద్ధం చేసుకుంటే రిటర్నుల దాఖలు పెద్ద కష్టమేమీ కాదు. ఐటీ పోర్టల్‌లో ఎంతో సమాచారం అందుబాటులో ఉంది. ఫామ్ 26ఏఎస్, ఈపే సెల్ఫ్ అసెస్మెంట్, ఈ వెరిఫై లింక్‌లు కూడా అక్కడే ఉంటాయి. ఫామ్ 26ఏఎస్‌లో టీడీఎస్, టీసీఎస్ వివరాలు ఉంటాయి. గతంలో దాఖలు చేసిన రిటర్నులను, వాటి పురోగతి తీరును, అవుట్‌స్టాండింగ్ ట్యాక్స్ డిమాండ్ (కట్టాల్సిన పన్ను బకాయిలు ఉంటే), రిఫండ్ అభ్యర్థన దాఖలు పురోగతి, ఐటీఆర్ 5 రసీదు వివరాలు కూడా అక్కడే లభిస్తాయి. దాఖలు సమయాన్ని తగ్గించేందుకు వీలుగా పన్ను లెక్కలను కూడా కొన్నింటిని ఆటోమేటెడ్ చేశారు. పాన్ డేటాబేస్ ఆధారంగా గతంలోని ఐటీఆర్‌లు, ఫామ్ 26ఏఎస్ ఆధారంగా ముందుగానే కొన్ని వివరాలు నింపిన రిటర్నులు కూడా అందుబాటులో ఉంటాయి. ముఖ్యంగా గత కొన్నేళ్ల కాలంలో కొన్ని అదనపు సౌకర్యాలను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది. భద్రతా కోణంలో లాగిన్‌కు రెండో దశ అథెంటికేషన్‌ను ‘ఈ ఫైలింగ్ వాల్ట్’ రూపంలో ప్రవేశపెట్టింది. యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో కాకుండా.. మరింత భద్రత కోసం నెట్ బ్యాంకింగ్, ఆధార్ ఆధారిత ఓటీపీ రూపంలోనూ లాగిన్ కావొచ్చు. మధ్యవర్తుల సాయం.. స్వయంగా రిటర్నులు దాఖలు చేసుకునేంత అవగాహన లేని వారు లేదా అంత తీరిక లేని వారు మధ్యవర్తుల సాయం తీసుకోవచ్చు. ఇందు కోసం ఎన్నో వెబ్ పోర్టళ్లు (వెబ్‌సైట్స్) అందుబాటులో ఉన్నాయి. ఈ పోర్టళ్లు మీ నుంచి అవసరమైన సమాచారం అంతా తీసుకుని, పన్ను చెల్లింపు బాధ్యతలను మదింపు చేసిన అనంతరం మీ తరఫున రిటర్నులను ఆదాయపన్ను పోర్టల్ వేదికపై దాఖలు చేస్తాయి. కొన్ని పోర్టళ్లు ఉచితంగానూ ఈ సేవలను ఆఫర్ చేస్తున్నాయి. రూ.5లక్షల్లోపు ఆదాయం ఉన్న వారికి ‘ట్యాక్స్‌స్మైల్’ పోర్టల్ ఉచితంగా రిటర్నుల ఫైలింగ్ సేవను అందిస్తోంది. అదే విధంగా క్లియర్‌ట్యాక్స్ పోర్టల్ కూడా కొందరికి ఇటువంటి సేవను ఆఫర్ చేస్తోంది. ఒకటికి మించిన మార్గాల్లో ఆదాయం కలిగి ఉండి లేదా విదేశీ ఆదాయం ఉండుంటే నిపుణుల సేవలను రిటర్నుల ఫైలింగ్ కోసం తీసుకోక తప్పదు. ఈ విషయంలో చార్టర్డ్ అకౌంటెంట్ (సీఏ) సేవలను వినియోగించుకోవచ్చు. ఒక వ్యక్తికి ఉన్న ఆదాయ వనరుల ఆధారంగా రిటర్నుల దాఖలుకు వెబ్ పోర్టళ్లు ఫీజులను నిర్ణయిస్తున్నాయి. అందించే సేవల ఆధారంగా రూ.699 నుంచి రూ.7,999 వరకు ఫీజుల కింద ట్యాక్స్‌స్పానర్ అనే సంస్థ తీసుకుంటోంది. రిటర్నుల దాఖలే కాకుండా పలు పోర్టళ్లు విలువ ఆధారిత సేవలను కూడా అందిస్తున్నాయి. ఐటీఆర్ దాఖలు తర్వాత వాటిల్లోని తప్పొప్పులను సరిచేసుకోవడం, డిమాండ్ నోటీసులకు స్పందించడం తదితర అంశాల్లో నిపుణుల సేవలను కూడా వీటి నుంచి పొందొచ్చు. పన్ను నిపుణులు లేదా సీఏలతో తమ సందేహాలను తీర్చుకునే సదుపాయాన్ని అందిస్తున్నాయి. మీ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచుకునేందుకు వాల్ట్ సేవను కూడా అందుబాటులో ఉంచుతున్నాయి. రిటర్నుల దాఖలుతోపాటు ఈ సేవలను కూడా పొందే విధంగా ప్యాకేజీలను ఆఫర్ చేస్తున్నాయి. టీఆర్పీలు ప్రభుత్వం నియమించిన పన్ను దాఖలు సన్నాహకుల (టీఆర్పీలు) సేవలను కూడా వినియోగించుకోవచ్చు. మీకు సమీపంలో ఉన్న టీఆర్పీల వివరాలను ఇన్కమ్ట్యాక్స్ఇండియా డాట్ జీవోవీ డాట్ ఇన్ పోర్టల్‌లో ‘ట్యాక్స్‌పేయర్ సర్వీసెస్’ ట్యాబ్ నుంచి పొందొచ్చు. టీఆర్పీలు మొదటి ఏడాది రిటర్నుల దాఖలు, పన్ను చెల్లింపులపై 3% సర్వీసు చార్జీ కింద తీసుకుంటారు. అదే వ్యక్తి రెండో ఏడాది రిటర్నుల దాఖలు సేవను కోరుకుంటే 2%, తర్వాతి ఏడాది ఒక శాతం చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. గరిష్ట చార్జీ రూ.1,000. ఒకవేళ ఏదేనీ సంవత్సరం ఈ చార్జీ రూ.250 కూడా మించకపోతే అప్పుడు టీఆర్పీలు కనీస చార్జీ తీసుకునేందుకు అర్హులు. కాకపోతే వీరి సేవలు పన్ను రిటర్నుల దాఖలు వరకే అని గుర్తుంచుకోవాలి. ఆన్లైన్ పోర్టళ్ల మాదిరి ఏడాది పొడవునా సేవలు, విలువ ఆధారిత సేవలు వీరి నుంచి లభించవు. గడువు దాటొద్దు.. కరోనా కారణంగా 2019–20 ఆర్థిక సంవత్సరం రిటర్నుల దాఖలు గడువును జూలై నుంచి తొలుత నవంబర్ ఆఖరుకు, ఆ తర్వాత డిసెంబర్ 31కు కేంద్రం పొడిగించింది. ఈ గడువులోపు రిటర్నులను దాఖలు చేయకపోతే.. ఆ తర్వాత వడ్డీ చార్జీలు, పెనాల్టీలను చెల్లించుకోవాలి. రిఫండ్లు కూడా ఆలస్యమవుతాయి. గతంలో పెనాల్టీలు విధించడం అన్నది పన్ను అధికారుల విచక్షణపైనే ఆధారపడగా, ఇప్పుడైతే అది చట్ట ప్రకారం అమలవుతోంది. ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 234 ఎఫ్ కింద.. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు, ఆలోపు ఉంటే డిసెంబర్ 31 తర్వాత రిటర్నుల దాఖలుకు రూ.1,000 పెనాల్టీ చార్జీగా చెల్లించాలి. పన్ను వర్తించే ఆదాయం రూ.5లక్షలు మించి ఉంటే ఈ పెనాల్టీ రూ.10,000. గడువు లోపు రిటర్నులు దాఖలు చేయకుండా, ఆలస్యంగా రిటర్నులు వేసి పన్ను చెల్లించినట్టయితే ఆ మొత్తంపై వడ్డీ కూడా వసూలు చేయాలని సెక్షన్ 234ఏ చెబుతోంది. ఆలస్యమైన ప్రతీ నెలకు ఒక శాతం చొప్పున వడ్డీ చెల్లించుకోవాల్సి వస్తుంది. ఇది కూడా పన్ను బాధ్యత రూ.లక్ష వరకు ఉన్న వారికే. ఒకవేళ రూ.లక్షకు మించి పన్ను చెల్లించాల్సి ఉండి, డిసెంబర్ 31 తర్వాత రిటర్నులు వేసినట్టయితే.. అప్పుడు 2020 జూలై 31 తర్వాతి నుంచి రిటర్నులు వేసే నాటి వరకు ఈ మేరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. మీరు రిటర్నులు వేయాల్సిందే..! కనీస మినహాయింపు పరిధిలో ఆదాయం ఉన్న వారు (60ఏళ్లలోపు వ్యక్తులకు రూ.2.5 లక్షలు) రిటర్నులు దాఖలు చేయక్కర్లేదు. కానీ, ఏదేనీ ఒక ఆర్థిక సంవత్సరంలో పన్ను వర్తించే స్థాయిలో ఆదా యం లభిస్తే ఆ ఏడాదికి రిటర్నులు వేస్తే సరిపోయేది. అయితే, ఇక మీదట పన్ను వర్తించే ఆదాయ పరిధిలో లేకపోయినా కానీ.. నిర్దేశిత లావాదేవీలలో ఏవైనా నిర్వహించినట్టయితే తప్పకుండా రిటర్నులు వేయాలి. డిపాజిట్లు రూ.కోటికి మించి చేసినా (ఒకటి లేదా అంతకుమించిన కరెంటు ఖాతాలలో), విదేశీ పర్యటన కోసం రూ.2లక్షలపైన ఖర్చు పెట్టినా, ఒక ఏడాదిలో విద్యుత్తు బిల్లు రూ.లక్ష దాటినా తమ ఆదాయంతో సంబంధం లేకుండా ఐటీఆర్ దాఖలు చేయాలి. ఎవరు ఏ రిటర్నులు వేయాలి? ఐటీఆర్–1: రూ.20 లక్షల ఆదాయం మించని వ్యక్తులు ఐటీఆర్–1 దాఖలు చేయాల్సి ఉంటుంది. అది కూడా ఒక్క వేతనం లేదా ఇంటిపై ఆదాయం లేదా వడ్డీ ఆదాయం, లేదా వ్యవసాయంపై ఆదాయం రూ.5,000 వరకు ఉన్న వారు, లేదా ఇవన్నీ కలిగిన వారు ఐటీఆర్–1 ఫైల్ చేయాలి. ఐటీఆర్–2: ఐటీఆర్–1 పరిధిలోని వారు కాకుండా.. ఒక వ్యక్తి కంపెనీలో డైరెక్టర్‌గా ఉంటే లేదా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో నమోదు కాని కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టయితే ఐటీఆర్–2 దాఖలు చేయాలి. అలాగే, క్రితం ఆర్థిక సంవత్సరాల్లోని మూలధన లాభాలను చూపించుకునేట్టు అయితే లేదా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని నష్టాలను తర్వాతి సంవత్సరాలకు కొనసాగించుకోవాలనుకుంటే, ఇతర వనరుల ద్వారా ఆదాయం వచ్చిన వారు కూడా ఇదే రిటర్న్ వేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–3: వ్యక్తులు, హిందు అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్) వ్యాపారం లేదా వృత్తి రూపంలో ఆర్జించి ఉంటే ఐటీఆర్–3ను ఫైల్ చేయాలి. ఐటీఆర్–4: భారతీయ నివాసితులు, హెచ్‌యూఎఫ్‌లు, సంస్థలు (ఎల్ఎల్పీ కాకుండా) వ్యాపారం, వృత్తి రూపంలో రూ.50 లక్షల వరకు ఆదాయం ఉంటే ఐటీఆర్–4 వేయాల్సి ఉంటుంది. ఐటీఆర్–5/6/7: నిర్దేశిత వ్యక్తులు, ఎల్ఎల్పీలు, సంస్థలు, కంపెనీలకు ఇవి వర్తిస్తాయి. -
అందుబాటులోకి ఐటీఆర్-1 ఫామ్
న్యూఢిల్లీ : పన్ను చెల్లించే శాలరీ క్లాస్ ప్రజలు ఎక్కువగా ఉపయోగించే తాజా ఐటీఆర్-1 దరఖాస్తు ఆదాయపు పన్ను శాఖకు చెందిన అధికారిక ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఆదాయపు పన్ను శాఖకు చెందిన సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. సింగిల్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్ను(ఐటీఆర్) దరఖాస్తును ఏప్రిల్ 5న సీబీడీటీ నోటిఫై చేసిన సంగతి తెలిసిందే. దీన్ని ఆదాయపు పన్ను శాఖ తన వెబ్సైట్ https://www.incometaxindiaefiling.gov.inలో పొందుపరిచింది. మిగతా ఐటీఆర్ దరఖాస్తులు కూడా త్వరలోనే అందుబాటులోకి రానున్నట్టు అధికారి పేర్కొన్నారు. 2018-19 ఆర్థిక సంవత్సరానికి గాను కొత్త ఐటీఆర్ దరఖాస్తులు శాలరీ క్లాస్ ప్రజలకు తప్పనిసరి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్‌లో ఎలాంటి మార్పు చేయలేదు. ఏడు ఐటీఆర్ దరఖాస్తులను ఎలక్ట్రానిక్‌గా ఫైల్ చేయాల్సి ఉంటుంది. కానీ కొన్ని కేటగిరీల పన్నుచెల్లింపు దారులకు దీని నుంచి మినహాయింపు ఉంది. గతేడాది ఆర్థిక సంవత్సరంలో 3 కోట్ల మంది శాలరీ క్లాస్ పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-1ను ఫైల్ చేశారు. ఈ ఏడాది ఐటీఆర్ ఫైల్ చేయడానికి తుది గడువు జూలై 31గా ఉంది. -
ఐటీ రిటర్నుల్లో రుణాలు, క్రెడిట్‌కార్డు చెల్లింపులు కూడా...
♦ ఒక్క పేజీ కొత్త ఐటీఆర్–1లో ఇందుకోసం ప్రత్యేక కాలమ్ ♦ డీమోనిటైజేషన్ సమయంలో వివరాలన్నీ పేర్కొనాలి న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ సమయంలో రూ.2 లక్షలకుపైన రుణాల చెల్లింపులు చేసినా, క్రెడిట్‌కార్డు బిల్లుల చెల్లింపు ఆ మొత్తం దాటి ఉన్నా ఆదాయపన్ను చెల్లింపు దారులు పన్ను పత్రాల్లో తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను వివరాలను సులభంగా తెలియచేసేందుకు ఏడు పేజీలున్న ఐటీఆర్–1 స్థానంలో ఒకే ఒక్క పేజీతో కూడిన నూతన ఐటీఆర్ –1ను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇందులో డీమోనిటైజేషన్ సమయంలో (గతేడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు) బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలు, అంతకు మించి నగదు డిపాజిట్లు చేసిన వారు వివరాలు వెల్లడించేందుకు ఓ కాలమ్ ను ప్రవేశపెట్టారు. గతేడాది డీమోనిటైజేషన్ కార్యక్రమం జరిగిన 50 రోజుల సమయంలో రూ.2లక్షలకు మించి చేసిన రుణాలు, క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపులను సైతం ఇక్కడ పేర్కొనాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. పాన్ నంబర్‌తో ఆధార్ అనుసంధానం ఈజీ! పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్ నంబర్‌ను పాన్‌కార్డుతో అనుసంధానించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్, ఎన్ఎస్డీఎల్ ద్వారా ఇందుకు అవకాశం కల్పించింది. అయితే, ఆధార్ కార్డులో పేరు, పాన్ కార్డులో పేర్ల మధ్య తేడా ఉంటే అనుసంధానించేప్పుడు సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు... ఆధార్ కార్డులో ఇంటి పేరు పూర్తిగా ఉండడం, పాన్‌కార్డులో ఇంటి పేరులో మొదటి అక్షరమే ఉండడం. అలాగే, పెళ్లయిన తర్వాత మహిళల ఇంటి పేర్లు మారడం వంటివి. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ పరిష్కారాలను కనుగొంది. ఈ తరహా సమస్యను చవిచూసిన వారు ఆధార్ వెబ్‌సైట్‌కు వెళ్లి పేరు మార్చాలని కోరుతూ ధ్రువీకరణ పత్రం కింద పాన్‌కార్డు కాపీ అప్లోడ్ చేస్తే సరిపోతుందని ఓ అధికారి తెలిపారు. దీనికితోడు ఆదాయపన్ను శాఖ తమ ఈ ఫైలింగ్ పోర్టల్‌లోనే కొత్తగా ఓ ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. వన్‌టైమ్ పాస్వర్డ్ విధానంలో సులభంగా అనుసంధానించుకునేందుకు ఇది అవకాశం కల్పించనుందని ఆ అధికారి తెలిపారు. అయితే, పుట్టిన తేదీ రెండింటిలోనూ మ్యాచ్ కావాల్సి ఉంటుందన్నారు. -
ఐటీ రిటర్నులు ఇక ఈజీ
రిటర్నుల పత్రం ఒక్క పేజీయే ♦ కొత్త ఐటీఆర్–1ని నోటిఫై చేసిన కేంద్రం ♦ బ్యాంకుల్లో రూ.2 లక్షలకు మించిన డిపాజిట్లను తెలియజేయాలి... ♦ ఆధార్ నంబర్ వెల్లడించడం తప్పనిసరి ♦ ఏడుకు తగ్గిన ఐటీఆర్‌లు... న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఒకే ఒక్క పేజీ ఐటీఆర్ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. ప్రస్తుతం ఏడు పేజీల ఐటీఆర్ పత్రం ఎన్నో రకాల కాలమ్స్‌తో ఉండగా వాటిని ఎత్తివేసి సులభంగా ఒకే ఒక్క పేజీతో ఫామ్–1 సహజ్‌ను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది. దానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇంటిపై అద్దె ఆదాయం, వడ్డీ ఆదాయం, వార్షిక వేతనం రూ.50 లక్షల వరకు ఉన్న వారు ఇకపై సహజ్ పేరుతో ఉన్న ఒక్క పేజీ ఐటీఆర్‌ను దాఖలు చేస్తే సరిపోతుంది. కాకపోతే ఈ సారి పాన్ నంబర్‌తోపాటు ఐటీఆర్ పత్రంలో ఆధార్ నంబర్‌ను కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. గతంలో ఆధార్ నంబర్ తెలియజేయడం కేవలం పన్ను చెల్లింపు దారుల ఇష్టప్రకారంగానే ఉండేది. ఒకవేళ ఆధార్ నంబర్ లేకుంటే ఎన్రోల్మెంట్ నంబర్ అయినా వెల్ల డించాలి. అదే విధంగా డీమోనిటైజేషన్ సమయంలో (గతేడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు) బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలు అంతకు మించి నగదు డిపాజిట్ చేసి ఉంటే ఆ వివరాలనూ పార్ట్–ఈ లో వెల్లడించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఐటీఆర్ –1ను ఆన్లైన్లో (ఈఫైలింగ్) దాఖలు చేసుకోవచ్చు. జూలై 31 వరకు ఇందుకు గడువు ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉద్యోగులు ఐటీఆర్–1ను, వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు ఐటీఆర్–2ను దాఖలు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 29 కోట్ల మందికి పాన్ నంబర్ ఉండగా కేవలం 6 కోట్ల మందే రిటర్నులు దాఖలు చేస్తున్నారు. తగ్గిన ఐటీఆర్‌లు: ఇప్పటి వరకు ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు తొమ్మిది వరకు ఉండగా, వాటిని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఏడుకు కుదించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఐటీఆర్–2, ఐటీఆర్–2ఏ, ఐటీఆర్–3లను కుదించి ఐటీఆర్–2గా తీసుకువచ్చారు. ఐటీఆర్–4, 4ఎస్‌ల (సుగమ్) నంబర్లను ఐటీఆర్–3, 4 (సుగమ్)గా మార్చారు. ఈ మేరకు 2017–18 ఏడాదికి ఐటీఆర్ పత్రాలను సీబీడీటీ నోటిఫై చేసింది. ఐటీఆర్‌లను దాఖలు చేసే విధానంలో ఎటువంటి మార్పు లేదని ఎలక్ట్రానిక్ విధానంలో దాఖలు చేయాల్సి ఉంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది. ఐటీఆర్–1(సహజ్) లేదా ఐటీఆర్–4(సుగమ్) రూపంలో దాఖలు చేసినా... 80 ఏళ్ల పైబడిన వారు, వ్యక్తులు లేదా హెచ్‌యూఎఫ్ వారి ఆదాయం రూ.5 లక్షలకు మించకపోయినా.. ఎలాంటి రిఫండ్ క్లెయిమ్ చేయకపోయినా... అలాంటివారు పేపర్ రూపంలోనూ రిటర్నులు దాఖలు చేయొచ్చు. ఒక్క పేజీ ఐటీఆర్–1లో... పన్ను లెక్కింపు, పన్ను మినహాయింపులకు సంబంధించిన కాలమ్స్ కొత్త ఐటీఆర్ సహజ్లో తగ్గాయి. సులభంగానూ మారాయి. గతంలో ఏడు పేజీల ఐటీఆర్–1లో వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులకు సంబంధించి 20 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క పేజీగా మారిన పత్రంలో నాలుగే కాలమ్స్ ఉన్నాయి. సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80జీ, సెక్షన్ 80టీటీఏ మినహాయింపులు పేర్కొనాలి. వ్యక్తిగత వివరాలతోపాటు వేతనం లేదా పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం, ఇంటి అద్దె రూపంలో ఆదాయం, వడ్డీ ఆదాయం అందుకుంటుంటే ఆ సమాచారాన్ని తెలియజేయాలి. మినహాయింపులు ఎంత, పన్ను చెల్లించతగ్గ ఆదాయం ఎంతన్నది పేర్కొనాల్సి ఉంటుంది. డీమోనిటైజేషన్ సమయంలో బ్యాంకులో రూ.2 లక్షలకు మించి డిపాజిట్ల వివరాలు, ముందస్తుగా చెల్లించిన పన్నులు వివరాలు, స్వయంగా మందింపు వేసిన పన్ను వివరాలు, టీడీఎస్ సమాచారాన్ని ఇవ్వాలి. డీమోనిటైజేషన్ డిపాజిట్ వివరాలూ వెల్లడించాలి... ఐటీఆర్–1 సహా ఇతర అన్ని ఐటీఆర్లలోనూ డీమోనిటైజేషన్ సమయంలో డిపాజిట్ల వివరాలు తెలియజేయాలని కోరుతూ కాలమ్స్‌ను ప్రవేశపెట్టారు. దీనిపై ఓ ఐటీ అధికారి మాట్లాడుతూ... ‘‘ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమం కింద అనుమానిత భారీ డిపాజిట్ దారులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయా డిపాజిట్లు తాజా ఆదాయపన్ను రిటర్నుల్లోని వివరాలతో సరిపోలకుంటే అటువంటి వారిని విచారించడం జరుగుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద లెక్కల్లో చూపని డిపాజిట్ వివరాలు వెల్లడించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కొందరు ఉపయోగించుకోలేదు’’ అని వివరించారు.