ఐటీ రిటర్నులు ఇక ఈజీ
రిటర్నుల పత్రం ఒక్క పేజీయే
♦ కొత్త ఐటీఆర్–1ని నోటిఫై చేసిన కేంద్రం
♦ బ్యాంకుల్లో రూ.2 లక్షలకు మించిన డిపాజిట్‌లను తెలియజేయాలి...
♦ ఆధార్ నంబర్ వెల్లడించడం తప్పనిసరి
♦ ఏడుకు తగ్గిన ఐటీఆర్‌లు...
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నులు సులభంగా దాఖలు చేసేందుకు వీలుగా ఒకే ఒక్క పేజీ ఐటీఆర్ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం నోటిఫై చేసింది. ప్రస్తుతం ఏడు పేజీల ఐటీఆర్ పత్రం ఎన్నో రకాల కాలమ్స్‌తో ఉండగా వాటిని ఎత్తివేసి సులభంగా ఒకే ఒక్క పేజీతో ఫామ్–1 సహజ్‌ను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చింది. దానికి ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇంటిపై అద్దె ఆదాయం, వడ్డీ ఆదాయం, వార్షిక వేతనం రూ.50 లక్షల వరకు ఉన్న వారు ఇకపై సహజ్ పేరుతో ఉన్న ఒక్క పేజీ ఐటీఆర్‌ను దాఖలు చేస్తే సరిపోతుంది. కాకపోతే ఈ సారి పాన్ నంబర్‌తోపాటు ఐటీఆర్ పత్రంలో ఆధార్ నంబర్‌ను కూడా తప్పనిసరిగా పేర్కొనాలి. గతంలో ఆధార్ నంబర్ తెలియజేయడం కేవలం పన్ను చెల్లింపు దారుల ఇష్టప్రకారంగానే ఉండేది. ఒకవేళ ఆధార్ నంబర్ లేకుంటే ఎన్‌రోల్‌మెంట్ నంబర్ అయినా వెల్ల డించాలి.
అదే విధంగా డీమోనిటైజేషన్ సమయంలో (గతేడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు) బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలు అంతకు మించి నగదు డిపాజిట్ చేసి ఉంటే ఆ వివరాలనూ పార్ట్–ఈ లో వెల్లడించాల్సి ఉంటుంది. ఏప్రిల్ 1 నుంచి ఐటీఆర్ –1ను ఆన్‌లైన్‌లో (ఈఫైలింగ్) దాఖలు చేసుకోవచ్చు. జూలై 31 వరకు ఇందుకు గడువు ఉంటుందన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉద్యోగులు ఐటీఆర్–1ను, వ్యక్తులు, హిందూ అవిభక్త కుటుంబాలు ఐటీఆర్–2ను దాఖలు చేస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 29 కోట్ల మందికి పాన్ నంబర్ ఉండగా కేవలం 6 కోట్ల మందే రిటర్నులు దాఖలు చేస్తున్నారు.
తగ్గిన ఐటీఆర్‌లు: ఇప్పటి వరకు ఆదాయపన్ను రిటర్నుల పత్రాలు తొమ్మిది వరకు ఉండగా, వాటిని కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) ఏడుకు కుదించడం జరిగింది. ప్రస్తుతం ఉన్న ఐటీఆర్–2, ఐటీఆర్–2ఏ, ఐటీఆర్–3లను కుదించి ఐటీఆర్–2గా తీసుకువచ్చారు. ఐటీఆర్–4, 4ఎస్‌ల (సుగమ్) నంబర్లను ఐటీఆర్–3, 4 (సుగమ్)గా మార్చారు. ఈ మేరకు 2017–18 ఏడాదికి ఐటీఆర్ పత్రాలను సీబీడీటీ నోటిఫై చేసింది. ఐటీఆర్‌లను దాఖలు చేసే విధానంలో ఎటువంటి మార్పు లేదని ఎలక్ట్రానిక్ విధానంలో దాఖలు చేయాల్సి ఉంటుందని సీబీడీటీ స్పష్టం చేసింది. ఐటీఆర్–1(సహజ్) లేదా ఐటీఆర్–4(సుగమ్) రూపంలో దాఖలు చేసినా... 80 ఏళ్ల పైబడిన వారు, వ్యక్తులు లేదా హెచ్‌యూఎఫ్ వారి ఆదాయం రూ.5 లక్షలకు మించకపోయినా.. ఎలాంటి రిఫండ్ క్లెయిమ్ చేయకపోయినా... అలాంటివారు పేపర్ రూపంలోనూ రిటర్నులు దాఖలు చేయొచ్చు.
ఒక్క పేజీ ఐటీఆర్–1లో...
పన్ను లెక్కింపు, పన్ను మినహాయింపులకు సంబంధించిన కాలమ్స్ కొత్త ఐటీఆర్ సహజ్‌లో తగ్గాయి. సులభంగానూ మారాయి. గతంలో ఏడు పేజీల ఐటీఆర్–1లో వివిధ సెక్షన్ల కింద పన్ను మినహాయింపులకు సంబంధించి 20 కాలమ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక్క పేజీగా మారిన పత్రంలో నాలుగే కాలమ్స్ ఉన్నాయి. సెక్షన్ 80సీ, సెక్షన్ 80డీ, సెక్షన్ 80జీ, సెక్షన్ 80టీటీఏ మినహాయింపులు పేర్కొనాలి. వ్యక్తిగత వివరాలతోపాటు వేతనం లేదా పెన్షన్ ద్వారా వచ్చే ఆదాయం, ఇంటి అద్దె రూపంలో ఆదాయం, వడ్డీ ఆదాయం అందుకుంటుంటే ఆ సమాచారాన్ని తెలియజేయాలి. మినహాయింపులు ఎంత, పన్ను చెల్లించతగ్గ ఆదాయం ఎంతన్నది పేర్కొనాల్సి ఉంటుంది. డీమోనిటైజేషన్ సమయంలో బ్యాంకులో రూ.2 లక్షలకు మించి డిపాజిట్ల వివరాలు, ముందస్తుగా చెల్లించిన పన్నులు వివరాలు, స్వయంగా మందింపు వేసిన పన్ను వివరాలు, టీడీఎస్ సమాచారాన్ని ఇవ్వాలి.
డీమోనిటైజేషన్ డిపాజిట్ వివరాలూ వెల్లడించాలి...
ఐటీఆర్–1 సహా ఇతర అన్ని ఐటీఆర్‌లలోనూ డీమోనిటైజేషన్ సమయంలో డిపాజిట్ల వివరాలు తెలియజేయాలని కోరుతూ కాలమ్స్‌ను ప్రవేశపెట్టారు. దీనిపై ఓ ఐటీ అధికారి మాట్లాడుతూ... ‘‘ఆపరేషన్ క్లీన్ మనీ కార్యక్రమం కింద అనుమానిత భారీ డిపాజిట్ దారులకు నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆయా డిపాజిట్లు తాజా ఆదాయపన్ను రిటర్నుల్లోని వివరాలతో సరిపోలకుంటే అటువంటి వారిని విచారించడం జరుగుతుంది. ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం కింద లెక్కల్లో చూపని డిపాజిట్ వివరాలు వెల్లడించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చినా కొందరు ఉపయోగించుకోలేదు’’ అని వివరించారు.