ITR filing: ఆదాయపు పన్ను రిటర్న్స్ ఫైలింగ్ సీజన్ ప్రస్తుతం కొనసాగుతోంది. 2023-24 ఆర్థిక సంవత్సరానికి పన్ను రిటర్న్స్ దాఖలు చేయడానికి జూలై 31 వరకు గడువు ఉంది. వ్యక్తులు, వ్యక్తిగత సంస్థలు లేదా సంఘాలు జూలై 31 లోగా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఐటీఆర్ ఫైల్ చేయవచ్చు.
ఐటీఆర్-1 ఫారం
అత్యధిక పన్ను రిటర్న్స్ ఐటీఆర్-1 (ITR-1) ఫారం ద్వారానే దాఖలవుతాయి. దీన్ని సహజ్ ఫారం అని కూడా పిలుస్తారు. ఆర్థిక సంవత్సరంలో మొత్తం ఆదాయం రూ. 50 లక్షలకు మించని వ్యక్తులు ఈ కేటగిరీ కింద రిటర్న్స్ ఫైల్ చేయడానికి అర్హులు. జీతం, ఒకే ఇంటి ఆస్తి, కుటుంబ పెన్షన్, వ్యవసాయం (రూ. 5,000 వరకు), పొదుపు ఖాతాల నుంచి వడ్డీ, డిపాజిట్లు (బ్యాంక్/పోస్ట్ ఆఫీస్/కోఆపరేటివ్ సొసైటీ), ఆదాయపు పన్ను రీఫండ్ వడ్డీ.. ఇలా వివిధ మార్గాలలో లభించే ఆదాయంపై పన్ను రిటర్న్స్ ఫైల్ చేయాల్సి ఉంటుంది.
ITR-1కి చేసిన కీలక మార్పులు
2024-25 అసెస్‌మెంట్ ఇయర్‌కి గానూ ఐటీఆర్-1 ఫారం దాఖలులో ఆదాయపు పన్ను శాఖ పలు కీలక మార్పులు చేసింది. అవేంటంటే..
ITR-1 ఫారమ్‌ను ఫైల్ చేసే వ్యక్తులు తమ పన్ను రిటర్న్ ఫైలింగ్‌లో తమకు ఇష్టమైన పన్ను విధానాన్ని పేర్కొనాలి.
సెక్షన్ 115BACలో ఫైనాన్స్ యాక్ట్ 2023 ప్రవేశపెట్టిన సవరణలను అనుసరించి కొత్త పన్ను విధానం ఇప్పుడు డిఫాల్ట్ పన్ను విధానం. వ్యక్తులు, హోచ్‌యూఎఫ్‌లు, ఏఓపీలు, బీఓఐలకు కొత్త పన్ను విధానం స్వయంచాలకంగా వర్తిస్తుంది. పాత పన్ను విధానాన్ని కొనసాగించాలనుకునే వారు సెక్షన్ 115BAC(6) నుంచి వైదొలుగుతున్నట్లు స్పష్టంగా తెలియజేయాలి.
వ్యాపారం లేదా వృత్తి నుంచి వచ్చే ఆదాయం కాకుండా ఇతర ఆదాయం ఉన్న వ్యక్తులు సెక్షన్ 139(1) ప్రకారం సంబంధిత అసెస్‌మెంట్ సంవత్సరానికి దాఖలు చేసిన ఆదాయపు పన్ను రిటర్న్‌లో తప్పనిసరిగా తమ ప్రాధాన్య పన్ను విధానాన్ని పేర్కొనాలి.
ఆర్థిక చట్టం 2023 ద్వారా ప్రవేశపెట్టిన సెక్షన్ 80CCH ప్రకారం.. 2022 నవంబర్ 1, ఆ తర్వాత అగ్నిపథ్ స్కీమ్‌లో చేరి అగ్నివీర్ కార్పస్ ఫండ్‌కు సబ్‌స్క్రైబ్ చేసుకున్న వ్యక్తులు అగ్నివీర్ కార్పస్ ఫండ్‌లో జమ చేసిన మొత్తంపై పూర్తి పన్ను మినహాయింపునకు అర్హులు.
ఈ మార్పునకు అనుగుణంగా, ITR-1 ఫారంను కొత్త కాలమ్‌ను పొందుపరుస్తూ సవరణలు చేశారు. సెక్షన్ 80CCH కింద మినహాయింపు కోసం అర్హత ఉన్న మొత్తానికి సంబంధించిన వివరాలను కొత్త ఐటీఆర్-1 ఫారం ద్వారా పన్ను చెల్లింపుదారులు అందించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment