ఐటీ రిటర్నుల్లో రుణాలు, క్రెడిట్‌కార్డు చెల్లింపులు కూడా...
♦ ఒక్క పేజీ కొత్త ఐటీఆర్–1లో ఇందుకోసం ప్రత్యేక కాలమ్
♦ డీమోనిటైజేషన్ సమయంలో వివరాలన్నీ పేర్కొనాలి
న్యూఢిల్లీ: డీమోనిటైజేషన్ సమయంలో రూ.2 లక్షలకుపైన రుణాల చెల్లింపులు చేసినా, క్రెడిట్‌కార్డు బిల్లుల చెల్లింపు ఆ మొత్తం దాటి ఉన్నా ఆదాయపన్ను చెల్లింపు దారులు పన్ను పత్రాల్లో తప్పనిసరిగా తెలియజేయాల్సి ఉంటుంది. ఆదాయ పన్ను వివరాలను సులభంగా తెలియచేసేందుకు ఏడు పేజీలున్న ఐటీఆర్–1 స్థానంలో ఒకే ఒక్క పేజీతో కూడిన నూతన ఐటీఆర్ –1ను ఆదాయపన్ను శాఖ తీసుకొచ్చిన విషయం తెలిసిందే.
ఇందులో డీమోనిటైజేషన్ సమయంలో (గతేడాది నవంబర్ 10 నుంచి డిసెంబర్ 30 వరకు) బ్యాంకు ఖాతాల్లో రూ.2 లక్షలు, అంతకు మించి నగదు డిపాజిట్లు చేసిన వారు వివరాలు వెల్లడించేందుకు ఓ కాలమ్ ను ప్రవేశపెట్టారు. గతేడాది డీమోనిటైజేషన్ కార్యక్రమం జరిగిన 50 రోజుల సమయంలో రూ.2లక్షలకు మించి చేసిన రుణాలు, క్రెడిట్ కార్డుల బిల్లుల చెల్లింపులను సైతం ఇక్కడ పేర్కొనాల్సి ఉంటుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.
పాన్ నంబర్‌తో ఆధార్ అనుసంధానం ఈజీ!
పన్ను చెల్లింపుదారులు తమ ఆధార్ నంబర్‌ను పాన్‌కార్డుతో అనుసంధానించడాన్ని కేంద్రం తప్పనిసరి చేసింది. ఆదాయపన్ను శాఖ ఈ ఫైలింగ్ పోర్టల్, ఎన్‌ఎస్‌డీఎల్ ద్వారా ఇందుకు అవకాశం కల్పించింది. అయితే, ఆధార్ కార్డులో పేరు, పాన్ కార్డులో పేర్ల మధ్య తేడా ఉంటే అనుసంధానించేప్పుడు సమస్యలు వస్తున్నాయి. ఉదాహరణకు... ఆధార్ కార్డులో ఇంటి పేరు పూర్తిగా ఉండడం, పాన్‌కార్డులో ఇంటి పేరులో మొదటి అక్షరమే ఉండడం. అలాగే, పెళ్లయిన తర్వాత మహిళల ఇంటి పేర్లు మారడం వంటివి. ఈ నేపథ్యంలో ఆదాయపన్ను శాఖ పరిష్కారాలను కనుగొంది.
ఈ తరహా సమస్యను చవిచూసిన వారు ఆధార్ వెబ్‌సైట్‌కు వెళ్లి పేరు మార్చాలని కోరుతూ ధ్రువీకరణ పత్రం కింద పాన్‌కార్డు కాపీ అప్‌లోడ్ చేస్తే సరిపోతుందని ఓ అధికారి తెలిపారు. దీనికితోడు ఆదాయపన్ను శాఖ తమ ఈ ఫైలింగ్ పోర్టల్‌లోనే కొత్తగా ఓ ఆప్షన్ ప్రవేశపెట్టనుంది. వన్‌టైమ్ పాస్‌వర్డ్ విధానంలో సులభంగా అనుసంధానించుకునేందుకు ఇది అవకాశం కల్పించనుందని ఆ అధికారి తెలిపారు. అయితే, పుట్టిన తేదీ రెండింటిలోనూ మ్యాచ్ కావాల్సి ఉంటుందన్నారు.