ఇల్లు మారుతున్నారా?
బదిలీల వేళ... ప్రత్యేక కథనం..
బదిలీల కాలం షురూ అయింది. స్కూళ్లు తిరిగి తెరిచేలోపల బదిలీ అయిన చోట స్థిరపడాలన్నది ఉద్యోగుల ఉద్దేశం. అందుకోసం ఇల్లు వెతుక్కోవటం, సరైనది ఎంచుకుని అడ్వాన్సివ్వటం అన్నీ ఒకెత్తయితే... ఉన్న ఇంటి నుంచి ఆ ఇంటికి సామాన్లు చేరవేయటం, అక్కడ సర్దుకోవటం మరో ఎత్తు. ఉన్న ఊళ్లోనే ఒక చోటి నుంచి మరో చోటికి... ఒక ఊరి నుంచి మరో ఊరికి... ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి... ఇలా దూరం పెరిగేకొద్దీ కష్టాలూ పెరుగుతుంటాయి. హైదరాబాద్ నుంచి ఏ అమరావతికో వెళ్లాలంటే రాష్ట్రం మారినట్లే.
కాకపోతే వాహనాల రిజిస్ట్రేషన్ మార్చాల్సిన అవసరం లేకపోవటం వంటి అంశాలు కలిసొస్తాయి. ఇతర రాష్ట్రాలు అయితే ఈ కష్టాలూ తోడవుతాయి. ఈ నేపథ్యంలో... ఇల్లు మారేటపుడు టెక్నాలజీని ఎలా వాడుకోవాలి? ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి? వంటి అంశాల్ని వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రధాన కథనం...
- సాక్షి పర్సనల్ ఫైనాన్స్ విభాగం
* సరైన ప్యాకర్స్‌ను వెతకటంతో పని షురూ
* గ్యాస్ నుంచి బ్యాంకు ఖాతా వరకూ బదిలీ తప్పనిసరి
* చాలా పనులు ఆన్‌లైన్లోనే ముగించుకోవచ్చు
రవి ఇటీవలే బదిలీ అయి హైదరాబాద్ నుంచి విశాఖపట్నానికి మారాడు. రవి అనుభవం ఆయన మాటల్లోనే... ‘‘మొదట ఇల్లు, పాపకు స్కూలు చూసుకున్నా. తరవాత బాగా తెలిసిన ప్యాకర్స్ అండ్ మూవర్స్‌ను సంప్రదించా. వారు నా వ్యాగన్-ఆర్ కారుతో కలిపి ఫర్నిచర్ అంతటినీ మొదట అంచనా వేసుకుని... 24 గంటల్లో తర లించేశారు. చార్జీలు రూ.35 వేల వరకూ అయ్యాయి. కొత్త ప్రాంతానికి వచ్చాక మొబైల్ నంబరు మార్చలేదు. బ్యాంకు, పెట్టుబడులు, బీమా సంస్థల మార్పు సులభంగా జరిగింది. కానీ కొంత సమయం పట్టింది. బ్యాంకులో అడ్రస్‌ను అప్‌డేట్ చేయటం ద్వారా ఎలాంటి ఇబ్బంది లేకుండా లోన్ పొందవచ్చు’’ అయితే దీనికోసం ముందుగా రవి ఏమేం చూసుకున్నాడో తెలుసా...!!
ఎంపిక: సామాన్లను భద్రంగా చేరవేయడానికి మొదట నమ్మకమైన ప్యాకర్స్ అండ్ మూవర్స్ సంస్థను ఎంచుకోవాలి. తెలిసిన సంస్థో, మిత్రులు రిఫర్ చేసిన సంస్థో అయితే చార్జీలు, భద్రత విషయంలో నిశ్చింతగా ఉండొచ్చు.
చార్జీలు: సామాన్లు తరలించటమే ప్రధానం. అసలు కొత్త ఇంటికయ్యే అద్దె, పిల్లల స్కూల్ అడ్మిషన్ చార్జీలు వంటి వాటికంటే సామగ్రిని తరలించడానికయ్యే మొత్తమే కాస్త ఎక్కువగా ఉంటుంది. తరలింపునకయ్యే ఖర్చుల్లో ప్రధానంగా 60-70 శాతం రవాణాకు, 20-25 శాతం ప్యాకింగ్‌కు, మిగతాది సామాన్లను లోడ్, అన్‌లోడ్ చేయడానికి, కొత్త ఇంట్లో సర్దడానికి అవుతుంది. ఉంటున్న నగరం పరిధిలోనే మారితే రవాణా ఖర్చు 80 శాతం ఉంటుంది. ప్యాకింగ్ ఖర్చు తగ్గుతుంది.
సున్నితమైన వస్తువులుంటే మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి. వస్తువుల పరిమాణం, తరలించాల్సిన దూరం బట్టి సిటీ పరిధిలో అయితే సగటున రూ.6 వేల దాకా అవుతుంది. వేరే ప్రాంతాలకైతే రూ.35 వేలపైనే అవుతుంది. అనుకోని కారణాల రీత్యా తరలింపు సమయంలో ప్రమాదం జరిగితే బీమా వెసులుబాటు కూడా ఉంది. అన్ని రకాల ఘటనలకూ వర్తించే ఈ బీమా ఆప్షనల్ మాత్రమే.
కటింగ్ ధర: ఇల్లు మారేటపుడు వ్యయమే ప్రధాన సమస్య. అవసరంలేని పాత ఫర్నిచర్‌ను అమ్మేయటం ద్వారా సమస్య కొంత తీరుతుంది. పాత ఇనుము, స్టీలును విక్రయించినా కొంత సొమ్ము వస్తుంది. దీనివల్ల ఫర్నిచర్ తరలించటానికి మొత్తం ట్రక్కును బుక్ చేసుకోవాల్సిన పనిలేదు. ఉన్న కొద్ది సామగ్రిని వేరొక భాగస్వామితో కలిసి తరలించొచ్చు. ‘‘ కానీ షేరింగ్ వల్ల ఫర్నిచర్‌ను చేరవేయడానికి కొంత ఎక్కువ సమయం పడుతుంది.
ఉదాహరణకు ఢిల్లీ-ముంబై మధ్య రవాణాకు నాలుగు రోజుల సమయం పడితే, షేరింగ్ వల్ల అదే దూరానికి 10-12 రోజుల సమయం పడుతుంది’’ అని పీఎం రీలొకేషన్స్ సీఈవో, చైర్మన్ ఆకాంక్ష భార్గవ చెప్పారు. వారాంతపు రోజుల్లో కంటే వారం మధ్యలో రవాణాకు కొన్ని సంస్థలు తక్కువ చార్జీ వసూలు చేస్తున్నాయి. నెలలో చివరి శనివారమైతే బుకింగ్‌లు ఎక్కువగా ఉంటాయి కనక చార్జీలూ అధికంగానే ఉంటాయి.
బ్యాంకింగ్, పెట్టుబడులు, బీమా: క్రెడిట్ కార్డుంటే కంపెనీకి అడ్రస్ మారుతున్నట్లు తెలియజేయాలి. బ్యాంకయితే హోం బ్రాంచ్‌ను మార్చాల్సిందిగా సంబంధిత బ్యాంకు అధికారులను కోరాలి. ఈ ప్రక్రియను ఆన్‌లైన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఇది తప్పనిసరి. సొంత బ్రాంచ్‌కి వెళ్లి మారుతున్న అడ్రస్ వివరాలు వెల్లడిస్తే చాలు. పెట్టుబడులు, బీమాలకైతే సంబంధిత సంస్థలకు నూతన అడ్రస్ పత్రాలను అందించాలి.
మొబైల్ ఫోన్, డీటీహెచ్: వేరే రాష్ట్రానికి మొబైల్ నంబరు మార్చాలనుకుంటే ముందు బకాయిలు చెల్లించి, సర్వీసు ప్రొవైడర్‌కు వెరిఫికేషన్ కోసం అడ్రస్, ఇతర పత్రాలను అందజేయాలి. కొత్త సిటీకి నంబరు మారడానికి కొంత సమయం పడుతుంది. ఇదే విధంగా డీటీహెచ్ ను కూడా తరలించవచ్చు. కనెక్షన్ తొలగించటానికైనా, కొత్త కనెక్షన్ కోసమైనా రూ.300-400 ఖర్చు అవుతుంది.
మరి కారు తీసుకెళ్లాలంటే...?
కార్లను డ్రైవ్ చెయ్యకుండా రవాణా చేసుకోవాలంటే ఆ అవకాశమూ ఉంటుంది. అయితే ఎస్‌యూవీలకైతే ఉదాహరణకు బెంగళూరు- ఢిల్లీ మధ్య తరలించ టానికి రూ.18-20 వేలు ఖర్చవుతుంది. చిన్న కార్లకైతే రూ.10-13 వేలు వ్యయమవుతుంది. అయితే రాష్ట్రం మారినపుడు ఆ వాహనాన్ని స్థానిక ఆర్‌టీఓలో రిజిస్ట్రేషన్ చేయాలి. ఇదంతా గజిబిజి ప్రక్రియ. దానికంటే వాహనాన్ని అమ్మేయడమే ఉత్తమం. ఒకవేళ కారు గనక రుణం తీసుకుని కొన్నదైతే... రెండు, మూడేళ్ల కన్నా పాతదైతే ఎంట్రీ ట్యాక్స్, సర్వీస్ ట్యాక్స్ వంటి అదనపు పన్నులు చెల్లించాలి. మహారాష్ట్ర వంటి చోట్లయితే 8 రకాల పన్నులు వసూలు చేస్తారు.
అత్యవసర సామగ్రి
వంట గ్యాస్‌కు సంబంధించి పైపుడ్ గ్యాస్ కనెక్షన్ ఉంటే తొలగించాలి. అలా తొలగించినపుడు బకాయిలన్నీ చెల్లించి... సదరు కంపెనీ దగ్గర లిఖితపూర్వకంగా రసీదు తీసుకోవాలి. ఒకవేళ సిలిండర్ ద్వారా సరఫరా చేసే గ్యాస్ అయితే... ఒరిజినల్ సబ్ స్క్రిప్షన్ వోచర్‌తో పాటు రెగ్యులేటర్, సిలిండర్‌ను అప్పటిదాకా సిలిండర్ ఇస్తున్న డిస్ట్రిబ్యూటర్‌కు అందజేయాలి. టెర్మినేషన్ వోచర్, రిఫండబుల్ డి పాజిట్ రూ.1,450 వెనక్కి తీసుకోవాలి. కొత్త ప్రాంతంలో సదరు టెర్మినేషన్ వోచర్‌ను, అడ్రస్ వివరాలను స్థానిక పంపిణీదారుడికి అందజేయాలి. సెక్యూరిటీ కోసం మళ్లీ రూ. 1,450 , రెగ్యులేటర్ కోసం రూ. 150 చెల్లించి గ్యాస్ కనెక్షన్ పొందవచ్చు.