సాక్షి, అమరావతి: సొంతింటి కలలపై కరోనా వైరస్ తీవ్ర ప్రభావాన్నే చూపుతోంది. ఇప్పటివరకు ఎంతోకొంత స్థలం.. అందులో ఓ చిన్న ఇల్లు చాలనుకున్నవారంతా ఇప్పుడు పెద్ద కలలు కంటున్నారు. మారుతున్న పరిస్థితులతో వర్క్ ఫ్రమ్ హోంలు, ఆన్‌లైన్ క్లాసులకు అనుగుణంగా యువత పెద్ద ఇళ్ల వైపు ‘లుక్’ వేస్తున్నారు. అలాగే ఇప్పటివరకు అద్దె ఇళ్లల్లో ఉన్న వాళ్లు కూడా కరోనా దెబ్బకు సొంతిల్లు ఉండాలన్న నిర్ణయానికి వస్తున్నారు. ముఖ్యంగా సిటీ మధ్య ప్రాంతంలో కంటే కూడా శివారు ప్రాంతాల్లోని ఇళ్లవైపే ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. ఈ విషయం నో బ్రోకర్ డాట్‌కామ్ సర్వేలో వెల్లడయ్యింది. వర్క్ ఫ్రమ్ హోం ట్రెండ్ నడుస్తుండటంతో.. దూరంతో సంబంధం లేకుండా గాలి, వెలుతురు ధారాళంగా ఉండి, రణగొణధ్వనులకు దూరంగా ఉండే విశాల వాతావరణంలోని ఇంటిని కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఈ విషయాన్ని 59 శాతం మంది బిల్డర్లు పేర్కొన్నారు.
ఇంకో అదనపు గది కావాలి..
కరోనా దెబ్బకు.. సొంతిల్లు కొనుగోళ్లకు 1990 తర్వాత పుట్టిన వాళ్లు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారని, బడ్జెట్ ఎక్కువ అయినా సువిశాలమైన ఇంటి కోసం వీరు ఎదురు చూస్తున్నారని బిల్డర్లు పేర్కొంటున్నారు. ఇప్పుడు కొత్తగా ఇంటిని కొనేవారు పిల్లలకు స్టడీ రూం, పెద్దవాళ్లకు ఆఫీసు రూం ప్రత్యేకంగా కావాలని అడుగుతున్నారని క్రెడాయ్ ఏపీ చాప్టర్ మాజీ అధ్యక్షుడు చిగురుపాటి సుధాకర్ తెలిపారు. గతంలో రెండు బెడ్‌రూంలు కావాలనుకునే వారు.. ఇప్పుడు మూడు బెడ్‌రూమ్‌లకు, మూడు బెడ్ రూమ్‌లు తీసుకునే వారు నాలుగు బెడ్‌రూమ్‌లకేసి చూస్తున్నారు.
సగటు డిమాండ్ చూస్తే గతంతో పోలిస్తే 200 చదరపు అడుగులు అదనంగా తీసుకోవడానికి వీరు వెనుకాడటం లేదు. అలాగే బాల్కనీలు, గార్డెన్లు.. విశాలంగా, గాలి వెలుతురు ధారాళంగా ఉన్న వాటికి డిమాండ్ అధికంగా ఉందని గుంటూరు జిల్లా ఉండవల్లికి చెందిన దంటు బాలాజీ అనే బిల్డర్ పేర్కొన్నారు. లగ్జరీ అపార్ట్‌మెంట్ తీసుకునేవారు వ్యాయామాలు చేయడానికి ప్రత్యేక వర్కౌట్ గదులు కావాలని కోరుతున్నారని చెప్పారు.
ప్రస్తుతం మారిన డిమాండ్‌కు అనుగుణంగా కొత్త ప్రాజెక్టులు రూపొందిస్తున్నట్లు బిల్డర్లు తెలిపారు. కరోనాతో అద్దె ఇంటి కంటే సొంతింటి వైపు మొగ్గు చూపుతున్న వారి సంఖ్య పెరుగుతోందని, లాక్‌డౌన్ సమయంలో కూడా వస్తున్న ఎంక్వైరీలే ఇందుకు నిదర్శనమని సుధాకర్ పేర్కొన్నారు. వడ్డీ రేట్లు తక్కువగా ఉండటం, గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్న ఇళ్లు.. గతంతో పోలిస్తే తక్కువ రేటుకే లభిస్తుండటంతో లాక్‌డౌన్ ఆంక్షలు తర్వాత రియల్ ఎస్టేట్ రంగం వేగంగా పుంజుకుంటుదన్న ఆశాభావాన్ని బిల్డర్లు వ్యక్తం చేస్తున్నారు.
Coronavirus: ఇంటి కల మారింది
Published Thu, Jun 17 2021 10:52 PM | Last Updated on Fri, Jun 18 2021 3:45 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment