కోల్‌కతా: రియల్ ఎస్టేట్ పరిశ్రమ 2024 నాటికి రూ.65,000 కోట్లకు చేరుకుంటుందని రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ తెలిపింది. 2025 నాటికి దేశ జీడీపీలో రియల్టీ పరిశ్రమ వాటా 13 శాతానికి చేరుతుందని మంగళవారం విడుదల చేసిన నివేదికలో ప్రస్తావించింది.
రియల్ ఎస్టేట్ మార్కెట్ పరిమాణం 2019లో రూ.12,000 కోట్లుగా ఉన్న విషయాన్ని గుర్తు చేసింది. కరోనాకు సంబంధించి ఆందోళనలు ఉన్నప్పటికీ.. 2022లో మార్కెట్ సానుకూలంగా ఉంటుందని, రియల్ ఎస్టేట్ రంగంలోని అన్ని విభాగాల్లోనూ డిమాండ్ పుంజుకుంటుందని అంచనా వేసింది.
వాణిజ్య రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను ప్రస్తావిస్తూ.. టెక్నాలజీ ఆధారిత ఎకోసిస్టమ్ ఉన్న కార్యాలయ వసతులకు డిమాండ్ ఉంటుందని తెలిపింది. డెవలపర్లు టెక్నాలజీపై ఇన్వెస్ట్ చేస్తున్నారని, డిజిటల్ చానల్స్ ద్వారా వినియోగదారులను చేరుకునే ప్రయత్నాలు చేస్తున్నట్టు పేర్కొంది.
భారత రిటైల్ పరిశ్రమ 2021–2030 మధ్య 9 శాతం చొప్పున వృద్ది చెంది 2026 నాటికి 1400 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చన్నది అంచనా. భారతీయులు ఆన్‌లైన్ రిటైల్‌ను పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారని, 2024 నాటికి దేశ ఈ కామర్స్ పరిశ్రమ 111 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని క్రిసిల్ అంచనా వేసింది. వేర్ హౌసింగ్ (గోదాములు) రియల్ ఎస్టేట్ ఇక మీదటా వృద్ధిని చూస్తుందని, ఈ కామర్స్ విస్తరణ కలసి వస్తుందని.. ఈ విభాగంలో లావాదేవీలు 20 శాతం వృద్ధిని చూస్తాయని పేర్కొంది. విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు దేశ ఫైనాన్షియల్ మార్కెట్లకు మద్దతుగా నిలుస్తుంటే, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు భారత రియల్ ఎస్టేట్ రంగంలో ఇన్వెస్ట్ చేయడానికి ప్రాధాన్యం చూపిస్తున్నట్టు క్రిసిల్ నివేదిక తెలియజేసింది.
చదవండి👉హైదరాబాద్‌లో ఐటీ ఉద్యోగులు..ఎక్కువగా ఇళ్లు కొంటున్న ప్రాంతాలివే!
Comments
Please login to add a commentAdd a comment