Andhra Pradesh Economy Fully Recovered From Covid-19, Survey Says - Sakshi
Sakshi News home page

Andhra Pradesh: 'ఇండస్ట్రీ' రికార్డు

Published Sun, Mar 13 2022 2:25 AM | Last Updated on Sun, Mar 13 2022 8:36 PM

 Andhra Pradesh Economy Fully Recovered From Covid19, Says Survey - Sakshi

సాక్షి, అమరావతి: రాష్ట్ర ప్రభుత్వం అనుసరించిన విధానాలు, ప్రోత్సాహకాల ఫలితంగా కోవిడ్‌ సంక్షోభంలోనూ 2021–22లో పారిశ్రామిక రంగంలో భారీ వృద్ధి నమోదైంది. సాధారణ పరిస్థితులున్న వేళ టీడీపీ హయాంలో 2018–19లో పారిశ్రామిక రంగంలో వృద్ధి 3.17 శాతంతో కేవలం సింగిల్‌ డిజిట్‌కే పరిమితం కాగా ఇప్పుడు నాలుగు రెట్లకుపైగా పెరగడం గమనార్హం. 2021–22లో ఏకంగా 12.78 శాతంతో రెండంకెల వృద్ధినమోదైంది. సేవల రంగంలో 2018–19లో కేవలం 4.84 శాతం వృద్ధి నమోదు కాగా ఇప్పుడు 9.73 శాతం వృద్ధి సాధించడం రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు నిదర్శనంగా నిలుస్తోంది. కోవిడ్‌ సంక్షోభం నుంచి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ ఇప్పుడిప్పుడే పూర్వ స్థాయికి చేరుకుంటోంది. కరోనా విపత్తు వేళ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన చేయూతతో వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో భారీగా వృద్ధి నమోదైందని సామాజిక, ఆర్థిక సర్వే నివేదికలో విశ్లేషించింది. తయారీ, నిర్మాణం, మైనింగ్, రవాణా రంగాలన్నింటిలోనూ వృద్ధి కారణంగా పారిశ్రామిక రంగం వృద్ధి 12.78 శాతానికి చేరుకుంది.

ఉత్తమ విధానాలు, రాయితీలు, బకాయిల చెల్లింపు..
పారిశ్రామికంగా తీర్చిదిద్ది ఉపాధి అవకాశాలను పెంపొందించేలా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ పారిశ్రామిక విధానాన్ని తేవడంతో పాటు రాయితీలను సకాలంలో విడుదల చేసింది. కష్టకాలంలో పరిశ్రమలను ఆదుకుంది. గత సర్కారు హయాంలోని బకాయిలు కూడా చెల్లించడంతోపాటు ప్రోత్సాహకాలు, రాయితీల కింద దాదాపు రూ.2,300 కోట్లు పరిశ్రమలకు అందచేసి కరోనా సమయంలో అండగా నిలిచింది. సాధారణ కేటగిరిలో 1,046 ఎంఎస్‌ఎంఈలకు రూ.191.10 కోట్లు రాయితీగా ఇచ్చింది. ఓబీసీ కేటగిరిలో 479 ఎంఎస్‌ఎంఈలకు రూ.101.31 కోట్లు రాయితీలను అందచేసింది. ఎంఎస్‌ఎంఈలకు వైఎస్సార్‌ నవోదయం ద్వారా ఊరట కల్పించి ఏకంగా 1,78,919 ఖాతాల రుణాలను పునర్వ్యవస్థీకరించింది. 2021–22లో రూ.1,762.31 కోట్ల పెట్టుబడితో 5,907 ఎంఎస్‌ఈలు ఏర్పాటు కావడంతో 37,604 మందికి ఉపాధి లభిస్తోంది. కోవిడ్‌ జాగ్రత్తలు పాటిస్తూ పాక్షిక ఆంక్షలు, నిబంధనలు అమలు చేయడంతో సేవా రంగంలో కూడా 2021–22లో 9.73 శాతం వృద్ధి నమోదైంది.

21 రోజుల్లోనే అనుమతులు..
2021–22లో రాష్ట్రంలో పది పెద్ద మెగా పరిశ్రమలు ఏర్పాటయ్యాయి. రూ.2,030 కోట్ల పెట్టుబడితో ఏర్పాటైన మెగా ప్రాజెక్టుల ద్వారా 3,889 మందికి ఉపాధి లభించింది. ఎస్సీలకు చెందిన 2018 ఎంఎస్‌ఈలకు రూ.111.84 కోట్ల రాయితీలను, ఎస్టీలకు చెందిన 384 ఎంఎస్‌ఎంఈలకు రూ.24.40 కోట్ల రాయితీలను ప్రభుత్వం విడుదల చేసింది. 46 పెద్ద మెగా టెక్‌టైల్స్‌ పరిశ్రమలకు రూ.242.12 కోట్ల రాయితీలను ఇచ్చింది. సులభతర వాణిజ్యం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌) నిబంధనల మేరకు పరిశ్రమలకు అన్ని అనుమతులను 21 రోజుల్లోనే అందిస్తోంది. ఎగుమతుల పనితీరును 2019–20లో 7వ ర్యాంక్‌ నుంచి 2020–21లో నాలుగో ర్యాంకుకు చేరడం ద్వారా మెరుగుపరుచుకుంది. 2020–21లో ఎగుమతులు 16.8 బిలియన్‌ డాలర్లకు పెరిగాయి. అంతకు ముందు ఏడాదితో పోల్చి చూస్తే 13.8 శాతం వృద్ధి సాధించింది. జాతీయ ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 5.8 శాతంగా ఉంది. 2030 నాటికి ఎగుమతుల్లో రాష్ట్ర వాటాను పది శాతానికి పెంచాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. 

దేశవ్యాప్తంగా క్షీణించినా..
కరోనా సంక్షోభంతో దేశ స్థాయిలో వృద్ధి రేటు క్షీణించినప్పటికీ రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో మాత్రం వృద్ధి నమోదవుతూనే ఉంది. స్ధిర ధరల ఆధారంగా చూస్తే రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2021–22లో 11.48 శాతం నమోదైంది. ఇక రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.6,70,913 కోట్లకు  చేరింది. వ్యవసాయ రంగానికి, రైతులకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇవ్వడంతో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో వృద్ధి ఏకంగా 11.27 శాతం నమోదైంది.

ప్రభుత్వ ప్రోత్సాహంతో..
కోవిడ్‌ సంక్షోభ సమయంలోనూ పారిశ్రామికోత్పత్తికి ఎలాంటి విఘాతం కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలతోనే ఈ స్థాయిలో భారీ వృద్ధి రేటు నమోదైంది. కరోనా సెకండ్, థర్ద్‌ వేవ్‌లో వ్యాపార వర్గాలకు నష్టం కలగకుండా ప్రభుత్వం పలు చర్యలు తీసుకుంది.
– నీరజ్‌ శారద, చైర్మన్, సీఐఐ, ఏపీ చాప్టర్‌

పూర్వ స్థితికి చేరుకుంటున్నాం
కరోనా సమయలో పారిశ్రామిక రంగం దెబ్బ తినకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్విరామ కృషి చేసింది. దీంతో భారీ వృద్ధి రేటు నమోదయ్యింది. పరిశ్రమలు, సేవల రంగాలు పూర్వ స్థితికి చేరుకుంటున్నాయి. 
–సీవీ అచ్యుతరావు, అధ్యక్షుడు, ఫ్యాప్సీ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement