- వచ్చిన కొద్దిరోజులకే అనకాపల్లి ఆర్డీవో బదిలీ
- వుడా కార్యదర్శి..ఎస్సీ కార్పొరేషన్ ఈడీలకూ..
- పోర్టు ట్రస్ట్ డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌కు స్థానచలం
సాక్షి, విశాఖపట్నం : జిల్లాకు చెందిన పలువురు అధికారులను ఏపీ రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాదికారిక సంస్థ(సీఆర్‌డీఏ)కు డిప్యూటీ కలెక్టర్లుగా బదిలీ చేస్తూ రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జేసీ శర్మ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ర్ట వ్యాప్తంగా 36 మందికి స్థానచలం కలిగించగా, వారిలో జిల్లాకు చెందిన నలుగురున్నారు. ఇటీవల బదిలీపై జిల్లాకు వచ్చిన అనకాపల్లి ఆర్డీవో బి.పద్మావతికి కూడా ఈ బదిలీల్లో వేటు పడింది.
అనకాపల్లి ఆర్డీవోగా ఆమె నియామకాన్ని రాష్ర్ట మానవ వనరుల శాఖమంత్రి గంటా శ్రీనివాసరావు వ్యతిరేకించారు. అయినప్పటికీ మరో మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చక్రం తిప్పి ఆమెను జిల్లాకు రప్పించారు. నాటి బదిలీల్లో పట్టుబట్టి మరీ పద్మావతిని అనకాపల్లి ఆర్డీవోగా పోస్టింగ్ ఇప్పించారు. నాటి నుంచి మంత్రి గంటాతో పాటు స్థానిక ఎమ్మెల్యే పీలా గోవింద్‌లు ఈమె నియామకాన్ని వ్యతిరేకిస్తూనే ఉన్నారు. ఏదోవిధంగా ఆమెను సాగనంపేందుకు మంత్రి గంటా విఫలయత్నం చేశారు. ఎట్టకేలకు తనపంతం నెగ్గించుకున్నారు.
నవంబర్‌లో జరిగిన సాధారణ బదిలీల్లో ఇక్కడకు వచ్చిన ఆమె అనతి కాలంలోనే బదిలీ వేటుకు గురయ్యారు. కాగా వుడా కార్యదర్శిగా పనిచేస్తున్న జీసీ కిషోర్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూ టీవ్ డెరైక్టర్ ఎఎన్ సలీం ఖాన్, విశాఖపట్నం పోర్టు ట్రస్ట్‌లో డిప్యూటీ ఎస్టేట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న కె.పద్మలతలు సీఆర్‌డీఏకు బదిలీ అయ్యారు. అదే విధంగా విశాఖపట్నం సెంట్రల్ మెడికల్ స్టోర్ ఇన్‌చార్జిగా అనకాపల్లి యూఎఫ్‌డబ్ల్యూసీ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఎస్.ఎఫ్.రవీంద్రను నియమిస్తూ వైద్యఆరోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీ చేశారు.