ఏ బైక్ కొందాం?
ఏ బైక్ కొందాం? బైక్ కొనాలనుకున్న ప్రతి ఒక్కరి మనసులోనూ మొదట మెదిలే ప్రశ్న ఇదే. కొందరైతే తమ స్నేహితుల్ని అడుగుతారు. ఇంకొందరైతే బంధువుల్ని అడుగుతారు. మరికొందరు ఆన్‌లైన్లో సెర్చ్ చేస్తారు. సమీక్షలు చదువుతారు... వివిధ బైక్‌ల ప్రకటనలు చూస్తారు. కాకపోతే విచిత్రమేంటంటే ఎంత ఎక్కువ చూస్తే అంత ఎక్కువగా అయోమయంలో పడతారు. ఎందుకంటే అన్ని బైక్‌లూ బాగానే ఉంటాయి. ఒకదానితో ఒకటి పోటీ పడతాయి. మరేం చెయ్యాలి? బైక్ కొనేటపుడు చూడాల్సిన అంశాలు కొన్ని ఉంటాయి.
ధర... మైలేజీ... ఫీచర్స్... లుక్. వీటిలో కూడా ఎవరి అవసరాలు వారివి. బడ్జెట్లో కొనాలనుకున్న వారు ధర చూస్తారు. ఎక్కువ తిరిగేవారు మైలేజీ చూస్తారు. కాస్త స్టైల్ కోరుకునే కుర్రకారు లుక్, ఫీచర్లు చూస్తారు. ఇక్కడ ఎవరి చాయిస్ వారిదే. అందుకే ఇపుడు దేశంలో అత్యధిక మైలేజీతో జనాదరణ పొందిన బైక్‌లపై ఈ ప్రత్యేక కథనం...
♦ మైలేజీయే ప్రధానాస్త్రంగా మార్కెట్లోకి కొత్త బైక్‌లు
♦ హీరో, బజాజ్, టీవీఎస్... అన్ని కంపెనీలదీ ఇదే రూటు
♦ స్ల్పెండర్ ఐస్మార్ట్ నుంచి ప్యాషన్ ప్రొ వరకూ అన్నీ దీన్లో కింగ్‌లే
♦ తక్కువ ధరలో ఎక్కువ మైలేజీ బైక్‌లతో బజాజ్ పోటీ
♦ డిజైన్, ధరతో కూడా ఆకట్టుకుంటున్న టీవీఎస్
♦ మైలేజీ, ధర, ఫీచర్లు, లుక్‌లో దేనికదే సాటి...
హీరో స్ల్పెండర్ ఐస్మార్ట్
ఇంజిన్ - 97.2 సీసీ
మైలేజ్ - 102.5 కిలోమీటర్లు/లీటర్
ధర - 52,008
దేశంలో అత్యధిక మైలేజ్‌ను ఇచ్చే బైక్ ఇది. లీటరుకు 102.5 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తున్న ఈ బైక్... దేశీ టూవీలర్ మార్కెట్ దిగ్గజం ‘హీరో మోటోకార్ప్’ ఉత్పాదన. కంపెనీ ఈ బైక్‌లో వినూత్న ఐ3ఎస్ టెక్నాలజీని ఉపయోగించింది. అంతేకాదు!! క్లచ్ పట్టుకుంటే చాలు. బైక్ ఆటోమేటిక్‌గా స్టార్ట్ అవుతుంది.
సెల్ఫ్ బటన్, కిక్‌రాడ్‌తో పని లేదు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే సిటీ ప్రాంతాలకిది అనువుగా ఉంటుంది. ఎయిర్‌కూల్డ్ 4-స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్ వాడటం వల్ల ఈ మైలేజీ ఇస్తోంది. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. ట్యాంక్‌లో 8.7 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్‌పీఎం. టార్క్-8.05 ఎన్‌ఎం-5000 ఆర్‌పీఎం.
బజాజ్ సీటీ 100
ఇంజిన్ - 99.27 సీసీ
మైలేజ్ - 99.1 కిలోమీటర్లు/లీటర్
ధర - 39,389
తక్కువ ధరలోనే దేశీ దిగ్గజ టూవీలర్ కంపెనీ ‘బజాజ్ ఆటో’ అందిస్తున్న మైలేజ్ బైక్ ఇది. ఐస్మార్ట్ రాక ముందువరకూ దేశంలో అత్యధిక మైలేజీ బైక్ ట్యాగ్ దీనిదే. ఇపుడు మైలేజీలో రెండో స్థానానికి చేరింది. ఇందులో 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఎయిర్‌కూల్డ్ ఇంజిన్‌ను అమర్చారు. గరిష్ఠంగా గంటకు 90 కిలోమీటర్ల వేగంతో నడిచే ఈ బైక్... ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్‌పీఎం. టార్క్ 8.05 ఎన్‌ఎం-4,500 ఆర్‌పీఎం.
బజాజ్ ప్లాటినా ఈఎస్
ఇంజిన్ - 102 సీసీ
మైలేజ్ - 96.9 కిలోమీటర్లు/లీటర్
ధర - 46,230
బజాజ్ ఆటో బైక్‌ల శ్రేణిలో మైలేజీలో రెండో స్థానంలో ఉన్న బైక్ ఇది. లీటరుకు 96.9 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇచ్చే ఈ బైక్‌లో అడ్వాన్స్‌డ్ సింగిల్ సిలిండర్ 2 వాల్వ్ డీటీఎస్ -ఐ ఇంజిన్‌ను అమర్చారు. గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లు. ప్లాటినా ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది. ఇంజిన్ పవర్ 8.2 పీఎస్-7,500 ఆర్‌పీఎం. టార్క్ 8.6 ఎన్‌ఎం-5,000 ఆర్‌పీఎం.
టీవీఎస్ స్పోర్ట్
ఇంజిన్ - 99.77 సీసీ
మైలేజ్ - 95 కిలోమీటర్లు/లీటర్
ధర - 44,140
‘టీవీఎస్ మోటార్’ కంపెనీ అందిస్తున్న బైకుల్లో అత్యధిక మైలేజీ ఇచ్చే బైక్ ఇదే. లీటరుకు 95 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. కంపెనీ ఈ బైక్‌లో 4 స్ట్రోక్ డ్యూరాలైఫ్ ఇంజిన్‌ను పొందుపరిచింది. ఇంజిన్ పవర్ 7.8 పీఎస్-7,500 ఆర్‌పీఎం. టార్క్ 7.8 ఎన్‌ఎం-5,500 ఆర్‌పీఎం. ఆకట్టుకునే డిజైన్ ఈ బైక్ సొంతం. స్పోర్ట్ బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 12 లీటర్ల పెట్రోల్ పడుతుంది.
హీరో స్ల్పెండర్ ప్రొ
ఇంజిన్ - 97.2 సీసీ
మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్
ధర - 50,500
హీరో మోటొకార్ప్ తయారీ ఇది. గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది దగ్గర ఈ బైక్‌ను మనం గమనిస్తూనే ఉంటాం. అధిక సంఖ్యాక ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న బైక్... బహుశా ఇదే అనొచ్చేమో. లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్‌పీఎం. టార్క్-8.05 ఎన్‌ఎం-5000 ఆర్‌పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11 లీటర్ల పెట్రోల్ పడుతుంది.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ ఎకో
ఇంజిన్ - 97.2 సీసీ
మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్
ధర - 48,336
హీరో మోటోకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్‌ను వాడారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్‌పీఎం. టార్క్-8.05 ఎన్‌ఎం-5000 ఆర్‌పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది.
హీరో స్ల్పెండర్ ప్రొ క్లాసిక్
ఇంజిన్ - 97.2 సీసీ
మైలేజ్ - 93.21 కిలోమీటర్లు/లీటర్
ధర - 51,300
హీరో మోటోకార్ప్ అందిస్తోన్న మరో మైలేజీ బైక్ స్ల్పెండర్ ప్రొ క్లాసిక్. ఇది లీటరుకు 93.21 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్‌పీఎం. టార్క్-8.05 ఎన్‌ఎం-5000 ఆర్‌పీఎం. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 11లీటర్ల పెట్రోల్ పడుతుంది. ప్రత్యేకమైన డిజైన్ ఈ బైక్ సొంతం.
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్
ఇంజిన్ - 97.2 సీసీ
మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్
ధర - 46,318
హీరో మోటొకార్ప్ ఉత్పాదన ఇది. లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్‌పీఎం. టార్‌క్యూ-8.05 ఎన్‌ఎం-5000 ఆర్‌పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది.
హీరో ప్యాషన్ ప్రొ
ఇంజిన్ - 97.2 సీసీ
మైలేజ్ - 87.37 కిలోమీటర్లు/లీటర్
ధర - 52,400
హీరో మోటొకార్ప్ నుంచి వచ్చిన మరో బైక్ ఇది. లీటరుకు 87.37 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్‌పీఎం. టార్క్-8.05 ఎన్‌ఎం-5000 ఆర్‌పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 12.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది.
హీరో హెచ్‌ఎఫ్ డాన్
ఇంజిన్ - 97.2 సీసీ
మైలేజ్ - 88.56 కిలోమీటర్లు/లీటర్
ధర - 40,070
ఇది కూడా దేశీ దిగ్గజం హీరో మోటొకార్ప్ ఉత్పాదనే. ఇది లీటరుకు 88.56 కిలోమీటర్ల మైలేజ్‌ను ఇస్తుంది. ఇందులో ఎయిర్ కూల్డ్ 4 స్ట్రోక్ సింగిల్ సిలిండర్ ఓహెచ్‌సీ ఇంజిన్‌ను పొందుపరిచారు. ఇంజిన్ పవర్-8.36 పీఎస్-8000 ఆర్‌పీఎం. టార్క్-8.05 ఎన్‌ఎం-5000 ఆర్‌పీఎం. దీని గరిష్ట వేగం గంటకు 87 కిలోమీటర్లు. బైక్ ఫ్యూయెల్ ట్యాంక్‌లో 10.5 లీటర్ల పెట్రోల్ పడుతుంది.
గమనిక
పైన పేర్కొన్న మైలేజీలు... సెంట్రల్ మోటార్ వె హికల్ రూల్స్(సీఎంవీఆర్)ను అనుసరించి ప్రత్యేక పరీక్షల్లో నిర్ధారించినవి. రోడ్డుపై వాస్తవంగా వచ్చే మైలేజీకి కొంత తేడా ఉంటుంది. ఈ తేడా మామూలు ట్రాఫిక్‌లో 20% వరకూ తక్కువ ఉండే అవకాశము ఉంటుంది.అమ్మకాల్లో టాప్-10 స్కూటర్లు...
నిజానికి దేశవ్యాప్తంగా అమ్ముడవుతున్న ద్విచక్ర వాహనాల్లో బైక్‌ల వాటాయే ఎక్కువ. కాకపోతే ఐదేళ్లుగా స్కూటర్ల వాటా మెల్లగా పెరుగుతూ వస్తోంది. 2015-16లో స్కూటర్ల విక్రయాలు కనీవినీ ఎరుగని రీతిలో తొలిసారిగా 50 లక్షల యూనిట్ల మార్కును దాటి 50,31,675 యూనిట్లు అమ్ముడయ్యాయి. వీటిలో 24.66 లక్షల యూనిట్ల విక్రయాలతో హోండా యాక్టివా టాప్‌లో నిలిచింది. ఇక టీవీఎస్ జూపిటర్ అనూహ్యంగా హీరో మాస్ట్రోను ఓవర్ టేక్ చేసి 5.37 లక్షల యూనిట్లతో రెండో స్థానానికి చేరింది.
మాస్ట్రో 4.98 లక్షల యూనిట్లతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. ఆ తర్వాతి స్థానాల్లో హోండా డియో, హీరో ప్లెజర్, సుజుకి యాక్సెస్, యమహా ఫాసినో, హీరో డ్యూయట్, హోండా ఏవియేటర్, యమహా రే టాప్-10 జాబితాలో చోటు సంపాదించాయి. 2015 మే నెలలో ఆవిష్కరించిన ఫాసినో నాలుగు నెలల్లోనే 1 లక్ష యూనిట్ల మార్కును దాటి.. యమహాకు బెస్ట్ సెల్లింగ్ మోడల్‌గా నిలిచింది.
భారత్‌లో కార్ల మార్కెట్ అంతకంతకూ పుంజుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని కార్ల కంపెనీలూ కొత్తకొత్త మోడల్స్‌ను విడుదల చేసేందుకు పోటీపడుతున్నాయి. మరి ఇన్నిరకాల ఆప్షన్లు అందుబాటులో ఉన్నప్పటికీ.. భారతీయ కస్టమర్లు కారు కొనే ముందు మైలేజీ, డిజైన్, కంపెనీ బ్రాండ్ ఇలా దేనికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. అసలు దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ కార్లు.. వాటి ప్రత్యేకతలు ఏంటి? అంతేకాదు ప్రపంచవ్యాప్తంగా కార్ల ప్రియులను కట్టిపడేస్తున్న లగ్జరీ కార్ల విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా?
వచ్చే వారం ప్రాఫిట్ ప్లస్‌లో ఇవన్నీ మీ కోసం ప్రత్యేకం. సో.. గెట్ సెట్.. వెయిట్!