విదేశాల్లో పెట్టుబడులు.. ఇప్పుడెంతో ఈజీ ! | NSE IFSC to allow Indian retail investors to trade in US stocks | Sakshi
Sakshi News home page

ఒక్క క్లిక్‌తో విదేశీ స్టాక్స్‌ మన సొంతం

Published Mon, Aug 23 2021 12:34 AM | Last Updated on Mon, Aug 23 2021 7:31 AM

 NSE IFSC to allow Indian retail investors to trade in US stocks - Sakshi

ఉదయం నిద్ర లేవడం మొదలు.. రాత్రి తిరిగి విశ్రమించే వరకూ ముఖ్యమైన ముచ్చట్లు ‘ఫేస్‌బుక్‌’ పేజీలోకి ఎక్కాల్సిందే. ప్రతీ ప్రత్యేక జ్ఞాపకాన్ని బంధు మిత్రులు, సన్నిహితులతో షేర్‌ చేసుకోవాల్సిందే. తాజా వార్తా, విశేషాల సమాచారం కోసం ఫేస్‌బుక్‌ను ఓపెన్‌ చేయాల్సిందే..! ఇక గ్రోసరీ నుంచి కావాల్సిన స్మార్ట్‌ ఫోన్‌ వరకు అమెజాన్‌లో ఆర్డర్‌ చేసేవారూ మన చుట్టూ చాలా మందే ఉన్నారు. సమాచారం ఏది తెలుసుకోవాలన్నా.. గూగుల్‌లో (ఆల్ఫాబెట్‌) వెతికేయడం, ఆండ్రాయిడ్‌ ఓఎస్, గూగుల్‌ క్రోమ్, గూగుల్‌ పే, గూగుల్‌ ఫొటోస్‌ ఇవన్నీ కూడా జీవనంలో భాగమైనవే.

చేతిలో యాపిల్‌ ఫోన్‌ ఉంటే ఆ ఆనందమే వేరు..! ఇవన్నీ కూడా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు. వీటి అవసరం లేకుండా ఆధునిక తరం రోజు గడవదంటే అతిశయోక్తి కానే కాదు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వెనకేసుకోవాలన్న ఆలోచన భారత ఇన్వెస్టర్లలో క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు డిమాండ్‌ పెరిగిన నేపథ్యంతో.. ఈ సేవలు అందించేందుకు ఎన్‌ఎస్‌ఈ కూడా రంగంలోకి దిగింది. ఎన్‌ఎస్‌ఈ అందిస్తున్న ఈ సేవల సమాచారమే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్‌ కథనం..

త్వరలోనే ఎన్‌ఎస్‌ఈ సేవలు
భారతీయ ఇన్వెస్టర్లు అమెరికాలో లిస్ట్‌ అయిన స్టాక్స్‌ కొనుగోలు, విక్రయాలు చేసుకునేందుకు వీలుగా అవసరమైన వేదికను ఏర్పాటు చేయాలని నేషనల్‌ స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌ (ఎన్‌ఎస్‌ఈ)కి చెందిన ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక మేరకు పనులు పూర్తయితే త్వరలోనే ఫ్యాంగ్‌ స్టాక్స్‌ (ఫేస్‌బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్‌), మైక్రోసాఫ్ట్, టెస్లా తదితర ఎన్నో స్టాక్స్‌లో లావాదేవీలు సులభతరం కానున్నాయి. సెబీ, ఆర్‌బీఐ నిబంధనలకు అనుగుణంగా కేవైసీని పూర్తి చేసిన (కస్టమర్‌ గుర్తింపు వివరాల ధ్రువీకరణ) కస్టమర్లు యూఎస్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి దేశీయ బ్రోకరేజీ సంస్థలు కొన్ని యూఎస్‌ స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నాయి. కానీ, స్థానికంగా ఒక ఎక్సే్ఛంజ్‌ ప్లాట్‌ఫామ్‌ లేదు. ఆ లోటును ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ భర్తీ చేయనుంది.

ప్రత్యేక ఖాతా అక్కర్లేదు!
సుమారు 40 దేశీయ బ్రోకరేజీ సంస్థలు గుజరాత్‌లోని ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌ (ఐఎఫ్‌ఎస్‌సీ/గిఫ్టి సిటీ)లో కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే క్రమంలో ఉన్నాయి. విదేశీ స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్‌ చేసుకోవాలని భావించే ఇన్వెస్టర్లు గిఫ్ట్‌ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్రోకర్ల వద్ద ట్రేడింగ్‌–డీమ్యాట్‌ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. అయితే, ఎన్‌ఎస్‌ఈ నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది.

ఇప్పటికే కేవైసీ వివరాలు సమర్పించి ట్రేడింగ్‌/డీమ్యాట్‌ ఖాతా కలిగిన వారు యూఎస్‌ స్టాక్స్‌లో పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా అనుమతి పొందే ప్రయత్నం చేస్తోంది. ఇది ఫలిస్తే.. ఇన్వెస్టర్లు ప్రస్తుత తమ ట్రేడింగ్‌ ఖాతా నుంచే దేశీయ స్టాక్స్‌ మాదిరే.. యూఎస్‌ స్టాక్స్‌లోనూ కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. ఇందుకోసం తమ సమ్మతి తెలియజేస్తూ ప్రత్యేకంగా ఒక పత్రం సమర్పిస్తే సరిపోతుంది. గిఫ్ట్‌సిటీ అన్నది అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ప్రాంతం.

మరిన్ని విదేశీ స్టాక్స్‌కూ అవకాశం
మనదేశంలోని రెండు డిపాజిటరీ సంస్థలైన సీడీఎస్‌ఎల్, ఎన్‌ఎస్‌డీఎల్‌ కూడా గిఫ్ట్‌ సిటీలో అనుబంధ సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేశాయి. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేసుకోవాలనే కొత్త ఇన్వెస్టర్లకు ఈ డిపాజిటరీల నుంచి డీమ్యాట్‌ ఖాతాలను బ్రోకరేజీ సంస్థలు ఆఫర్‌ చేయనున్నాయి. ప్రారంభంలో యూఎస్‌ స్టాక్స్‌లో లావాదేవీలకే పరిమితమైనప్పటికీ.. తర్వాత ఇతర విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడులకు అవకాశం అందుబాటులోకి రానుంది. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలనుకునే వారు తమ బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. గిఫ్ట్‌ సిటీలోని బ్రోకర్‌ వద్ద తన ఖాతాకు నిధులు బదిలీ చేయాలని కోరాల్సి ఉంటుంది.

ఆర్‌బీఐ లిబరలైజ్డ్‌ రెమిటెన్స్‌ స్కీమ్‌ (ఎల్‌ఆర్‌ఎస్‌) కింద ఒక ఏడాదిలో 2,50,000 డాలర్లు (సుమారు రూ.1.85కోట్లు) విదేశాలకు పంపుకోవచ్చు. స్టాక్స్, మ్యచువల్‌ ఫండ్స్‌ యూనిట్ల కొనుగోలు, ఈటీఎఫ్‌ల కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. కాకపోతే ఎల్‌ఆర్‌ఎస్‌ కింద పంపుకునే నిధులతో విదేశీ డెరివేటివ్‌ సాధనంలో ఇన్వెస్ట్‌ చేయకూడదు. ఖాతాదారు కోరిక మేరకు బ్యాంకు ఎల్‌ఆర్‌ఎస్‌ పరిమితిని పరిశీలించిన తర్వాత గిఫ్ట్‌ సిటీలో బ్రోకర్‌ ఖాతాకు నిధులను బదిలీ చేస్తుంది. ప్రస్తుత తమ బ్యాంకు శాఖ నుంచే ఈ సేవలను పొందొచ్చు. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ఇందుకోసం తెరవాల్సిన అవసరం ఉండదు.

తొలుత టాప్‌–50కే పరిమితం
నిధుల బదిలీ అనంతరం విదేశీ స్టాక్స్‌లో క్రయ, విక్రయాలు నిర్వహించుకోవచ్చు. తొలుత యూఎస్‌కు చెందిన టాప్‌–50 స్టాక్స్‌లో లావాదేవీలకు ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ అనుమతించనుంది. తర్వాత మరిన్ని స్టాక్స్‌లో లావాదేవీలకు అవకాశం కల్పించాలన్నది ఎన్‌ఎస్‌ఈ ప్రణాళిక. ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ ప్రత్యేకంగా అంతర్జాతీయ బ్రోకరేజీలను నియమించుకోనుంది. ఈ బ్రోకర్లు అమెరికా స్టాక్‌ ఎక్సే్ఛంజ్‌లలో షేర్లను కొనుగోలు చేసి, డిపాజిటరీ రిసీప్ట్‌ (సర్టిఫికెట్‌ ఆఫ్‌ ఓనర్‌షిప్‌)ను గిఫ్ట్‌సిటీలోని ఇన్వెస్టర్లకు కేటాయించనున్నాయి. మన దేశంలో పాక్షిక షేర్లకు అవకాశం లేదు. కనీసం ఒక షేరును లావాదేవీగా నిర్వహించాల్సిందే.

కానీ, అమెరికాలో పాక్షిక షేర్లను కూడా సొంతం చేసుకోవచ్చు. 3 డాలర్లు, 6 డాలర్ల డినామినేషన్‌లో పాక్షిక షేర్లను పొందే అవకాశం గిఫ్ట్‌ సిటీ ఇన్వెస్టర్లకు ఉంటుంది. ఉదాహరణకు యాపిల్‌ ఒక షేరు సుమారు 149 డాలర్ల వద్ద ఉంది. ఒక్క షేరు కొనుగోలుకు పెట్టుబడి రూ.11వేలపై మాటే. ఇంత ఇన్వెస్ట్‌ చేయలేని వారు పాక్షిక షేర్లను కొనుగోలు చేసుకోవచ్చు. లావాదేవీలకు ఎన్‌ఎస్‌ఈ క్లియరింగ్‌ కార్పొరేషన్‌ హామీదారుగా ఉంటుంది. టీప్లస్‌3 సెటిల్‌మెంట్‌ అమలవుతుంది. లావాదేవీ నమోదైన రోజు కాకుండా తర్వాతి మూడవ పనిదినం ముగింపు నాటికి షేర్లు డీమ్యాట్‌ ఖాతాలో జమ అవుతాయి.

ఈ బ్రోకర్ల నుంచి సేవలు
హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్, జియోజిత్, మోతీ లాల్‌ ఓస్వాల్, యాక్సిస్‌ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మ్యాటర్‌ట్రస్ట్, విన్‌వెస్టా, వెస్టెడ్‌ ఫైనాన్స్‌ తదితర సంస్థలు ఇప్పటికే యూఎస్‌ స్టాక్స్‌ లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇం దుకోసం ఈ సంస్థలు అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థలతో భాగస్వామ్యాలను కూడా కుదుర్చుకున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ స్టాక్స్, బాండ్లు, రీట్, ట్రెజరీ బాండ్లలోనూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఒక్క డాలర్‌ నుంచి పెట్టుబడులకు ఇవి అనుమతిస్తున్నాయి. వేగంగా, సులభంగా ఖాతా తెరిచే సేవలను ఇవి అందిస్తున్నాయి.

పన్ను ఇక్కడే చెల్లించాలి..
విదేశీ స్టాక్స్‌లో లాభాలపై దేశీయంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే స్థానిక స్టాక్స్‌లోని లాభాలపై పన్నుతో పోలిస్తే భిన్నమైన రేట్లు అమల్లో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్‌ తదితర చాలా దేశాల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆర్జించిన ఈక్విటీ (స్టాక్స్,ఫండ్స్‌) లాభాలపై మూలధన లాభాల పన్ను లేదు. డివిడెండ్లు, వడ్డీ రాబడి కూడా పన్ను రహితమే. కానీ, ఆయా లాభాలు, ఆదాయంపై ఇక్కడ పన్ను చెల్లించాలి. విదేశీ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్‌ అయిన షేరు లేదా ఫండ్‌లో రెండేళ్ల తర్వాత పెట్టుబడులను విక్రయించగా వచ్చిన లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభంగా చట్టం పరిగణిస్తోంది.

ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించగా మిగిలిన లాభంపై 20%పన్ను చెల్లించాలి. దేశీయ స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం మొదటి రూ.లక్ష (ఒక ఆర్థిక సంవత్సరంలో) పై పన్ను లేదు. కానీ, విదేశీ మూలధన లాభాలకు ఇది వర్తించదు. విదేశీ స్టాక్స్‌ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను రెండేళ్లలోపే విక్రయించినట్టయితే.. లాభాన్ని తమ ఆదాయం కింద రిటర్నుల్లో చూపించాలి. అప్పుడు తమకు వర్తించే శ్లాబు రేటు కింద పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. విదేశీ పెట్టుబడుల వివరాలను (విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయం) ఎప్పటికప్పుడు ఐటీఆర్‌లో విధిగా పేర్కొనాల్సిందే.

స్టాక్స్‌ కొనుగోలు క్రమం ఇదీ
► డీమ్యాట్‌ ఖాతా ఉంటే చాలు. ఇప్పటి వరకు డీమ్యాట్‌ ఖాతా లేని వారు గిఫ్ట్‌ సిటీ కేంద్రంగా పనిచేస్తున్న బ్రోకర్ల వద్ద ఖాతా తెరవాల్సి ఉంటుంది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి.
► ఆర్‌బీఐ ఎల్‌ఆర్‌ఎస్‌ కింద బ్యాంకు నుంచి గిఫ్ట్‌ సిటీలోని ఖాతాకు ఒక ఏడాదిలో 2.5లక్షల డాలర్లను పంపుకోవచ్చు.  
► యూఎస్‌ స్టాక్స్‌లో పాక్షిక వాటాలనూ సొంతం చేసుకోవచ్చు. తొలుత యూఎస్‌ టాప్‌–50 స్టాక్స్‌ అందుబాటులో ఉండనున్నాయి.
► ఎన్‌ఎస్‌ఈ ఐఎఫ్‌ఎస్‌సీ క్లియరింగ్‌ కార్పొరేషన్‌ ఈ లావాదేవీల సెటిల్‌మెంట్‌ను చూస్తుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement