CDSL
-
8 కోట్ల డీమ్యాట్ ఖాతాలు.. సీడీఎస్ఎల్ రికార్డ్
ముంబై: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) ప్లాట్‌ఫామ్‌పై యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య 8 కోట్ల మైలురాయిని దాటింది. ఈ విషయాన్ని సంస్థ గురువారం ప్రకటించింది. యాక్టివ్ (కార్యకలాపాలు నిర్వహిస్తున్నవి) డీమ్యాట్ ఖాతాల విషయలో ఆసియాలోనూ, దేశీయంగా అతిపెద్ద డిపాజిటరీగా సీడీఎస్ఎల్ ఉంది. నియంత్రణ సంస్థ మార్గదర్శకం, మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్, మార్కెట్ ఇంటర్మీడియరీల మద్దతు లేకుండా ఇది సాధ్యమయ్యేది కాదని సీడీఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్ నేహల్ వోరా పేర్కొన్నారు. సీడీఎస్ఎల్ 1999 ఫిబ్రవరిలో కార్యకలాపాలు ఆరంభించింది. సెక్యూరిటీలను ఎలక్ట్రానిక్ రూపంలో నిర్వహించుకునే సేవలు అందిస్తుంటుంది. సీడీఎస్ఎల్ సబ్సిడరీ అయిన సీడీఎస్ఎల్ వెంచర్స్ దేశంలో మొదటి అతిపెద్ద కేవైసీ రిజిస్ట్రేషన్ ఏజెన్సీగా ఉంది. 4.5 కోట్ల కేవైసీ రికార్డులను కలిగి ఉంది. సీడీఎస్ఎల్ ఇన్సూరెన్స్ రిపాజిటరీ, కమోడిటీ రిపాజిటరీ సేవల్లోనూ ఉంది. -
సీడీఎస్ఎల్ సిస్టమ్‌లో మాల్వేర్
న్యూఢిల్లీ: అంతర్గత సిస్టమ్‌లోని కొన్ని మెషిన్లలో మాల్వేర్ను కనుగొన్నట్లు డిపాజిటరీ సంస్థ సీడీఎస్ఎల్ శుక్రవారం వెల్లడించింది. ఇది లావాదేవీల సెటిల్మెంట్లో జాప్యానికి దారి తీసినట్లు పేర్కొంది. అయితే, ఇన్వెస్టర్ల డేటా లేదా గోప్యనీయ సమాచారమేదీ చోరీ అయి ఉండకపోవచ్చని తెలిపింది. ముందు జాగ్రత్త చర్యగా మార్కెట్లోని మిగతా సంస్థల నుండి సిస్టమ్‌లను డిస్కనెక్ట్ చేసినట్లు సీడీఎస్ఎల్ వివరించింది. సంబంధిత ప్రాధికార సంస్థలకు ఈ ఉదంతాన్ని రిపోర్ట్ చేశామని, దీని ప్రభావాలను అధ్యయనం చేసేందుకు సైబర్ సెక్యూరిటీ సలహాదారులతో కలిసి పని చేస్తున్నట్లు తెలిపింది. -
సీడీఎస్ఎల్ లాభం డౌన్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికంలో డిపాజిటరీ సేవల దిగ్గజం సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) ఆసక్తికర ఫలితాలు ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన జులై–సెప్టెంబర్(క్యూ2)లో నికర లాభం 7 శాతం క్షీణించి రూ. 80 కోట్లకు పరిమితమైంది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 86 కోట్లు ఆర్జించింది. అయితే మొత్తం ఆదాయం మాత్రం 3 శాతం పుంజుకుని రూ.170 కోట్లను తాకింది. గత క్యూ2లో రూ. 165 కోట్ల టర్నోవర్ సాధించింది. ఈ కాలంలో ఇన్వెస్టర్లు కొత్తగా 48 లక్షల డీమ్యాట్ ఖాతాలను తెరచినట్లు కంపెనీ వెల్లడించింది. దీర్ఘకాలిక వ్యూహాలలో భాగంగా డిజిటల్ ఎకోసిస్టమ్‌పై వెచ్చిస్తున్న పెట్టుబడులు ఫలితాలనిస్తున్నట్లు కంపెనీ ఎండీ, సీఈవో నేహల్ వోరా పేర్కొన్నారు. ఫలితాల నేపథ్యంలో సీడీఎస్ఎల్ షేరు ఎన్ఎస్ఈలో నామమాత్రంగా లాభపడి రూ. 1,228 వద్ద ముగిసింది. చదవండి: షాపింగ్ బంద్, యూపీఐ లావాదేవీలు ఢమాల్.. ఏమయ్యా విరాట్ కోహ్లీ ఇదంతా నీ వల్లే! -
సీడీఎస్ఎల్ రికార్డు, 7 కోట్లు దాటేసిన డిమ్యాట్ ఖాతాలు
న్యూఢిల్లీ: డిపాజిటరీ సేవలను అందించే సీడీఎస్ఎల్ మరో కొత్త మైలురాయిని అధిగమించింది. సంస్థ నిర్వహణలో డీమ్యాట్ ఖాతాలు 7 కోట్ల మార్క్‌ను దాటాయి. సీడీఎస్ఎల్ 1999లో కార్యకలాపాలు ప్రారంభించింది. డీమ్యాట్ ఖాతాల ద్వారా ఇన్వెస్టర్ల సెక్యూరిటీల లావాదేవీలకు ఈ సంస్థ సేవలు అందిస్తుంటుంది. తాము ఏడు కోట్ల ఖాతాల మైలురాయిని అధిగమించడం తమకు మాత్రమే కాకుండా, మొత్తం భారత సెక్యూరిటీల మార్కెట్ ఎకోసిస్టమ్‌కు ప్రోత్సాహాన్నిస్తున్నట్టు సీడీఎస్ఎల్ ఎండీ, సీఈవో నెహల్ వోరా అన్నారు. యాక్టివ్ డీమ్యాట్ ఖాతాల సంఖ్య పరంగా సీడీఎస్ఎల్ దేశంలోనే అతిపెద్ద డిపాజిటరీ సేవల సంస్థగా ఉంది. మరో సంస్థ ఎన్ఎస్డీఎల్ కూడా ఇదే విధమైన సేవలు అందిస్తుంటుంది. -
డీమ్యాట్ ఖాతాల్లో సీడీఎస్ఎల్ రికార్డులు
న్యూఢిల్లీ: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) డీమ్యాట్ ఖాతాల్లో ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. మొత్తం యాక్టివ్ ఖాతాల సంఖ్య (కార్యకలాపాలు నిర్వహిస్తున్నవి) 6 కోట్ల మార్క్‌ను దాటింది. 1999లో కార్యకలాపాలు ప్రారంభించిన సీడీఎస్ఎల్ దేశంలోనే అతిపెద్ద డిపాజిటరీగా వృద్ధి చెందడం గమనార్హం. తొలుత ఎన్ఎస్డీఎల్ డీమ్యాట్ ఖాతాల్లో ముందుండగా, తన సేవలతో సీడీఎస్ఎల్ మరింత వేగంగా మార్కెట్లో చొచ్చుకుపోయి, -
4 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా లీక్: సైబర్ఎక్స్9
న్యూఢిల్లీ: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్)లో భాగమైన సీడీఎస్ఎల్ వెంచర్స్ (సీవీఎల్) వ్యవస్థలో లోపాల కారణంగా కోట్ల కొద్దీ దేశీ ఇన్వెస్టర్ల వ్యక్తిగత, ఆర్థిక వివరాలు లీక్ అయ్యాయి. 10 రోజుల వ్యవధిలో రెండు సార్లు 4.39 కోట్ల మంది ఇన్వెస్టర్ల డేటా బైటికి వచ్చినట్లు సైబర్ సెక్యూరిటీ కన్సల్టెన్సీ స్టార్టప్ సంస్థ సైబర్ఎక్స్9 వెల్లడించింది. ఈ వివరాలను ఇప్పటికే సైబర్ నేరగాళ్లు చోరీ చేసి ఉంటారని, సీడీఎస్ఎల్ వ్యవస్థలో డేటా భద్రతపై ప్రభుత్వం ఆడిట్ చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. -
విదేశాల్లో పెట్టుబడులు.. ఇప్పుడెంతో ఈజీ !
ఉదయం నిద్ర లేవడం మొదలు.. రాత్రి తిరిగి విశ్రమించే వరకూ ముఖ్యమైన ముచ్చట్లు ‘ఫేస్బుక్’ పేజీలోకి ఎక్కాల్సిందే. ప్రతీ ప్రత్యేక జ్ఞాపకాన్ని బంధు మిత్రులు, సన్నిహితులతో షేర్ చేసుకోవాల్సిందే. తాజా వార్తా, విశేషాల సమాచారం కోసం ఫేస్‌బుక్‌ను ఓపెన్ చేయాల్సిందే..! ఇక గ్రోసరీ నుంచి కావాల్సిన స్మార్ట్ ఫోన్ వరకు అమెజాన్‌లో ఆర్డర్ చేసేవారూ మన చుట్టూ చాలా మందే ఉన్నారు. సమాచారం ఏది తెలుసుకోవాలన్నా.. గూగుల్‌లో (ఆల్ఫాబెట్) వెతికేయడం, ఆండ్రాయిడ్ ఓఎస్, గూగుల్ క్రోమ్, గూగుల్ పే, గూగుల్ ఫొటోస్ ఇవన్నీ కూడా జీవనంలో భాగమైనవే. చేతిలో యాపిల్ ఫోన్ ఉంటే ఆ ఆనందమే వేరు..! ఇవన్నీ కూడా అమెరికాకు చెందిన దిగ్గజ టెక్నాలజీ కంపెనీలు. వీటి అవసరం లేకుండా ఆధునిక తరం రోజు గడవదంటే అతిశయోక్తి కానే కాదు. ప్రపంచాన్ని శాసిస్తున్న ఈ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా.. దీర్ఘకాలంలో మంచి లాభాలు వెనకేసుకోవాలన్న ఆలోచన భారత ఇన్వెస్టర్లలో క్రమంగా పెరుగుతోంది. ఇటీవలి కాలంలో విదేశీ స్టాక్స్‌లో పెట్టుబడులకు డిమాండ్ పెరిగిన నేపథ్యంతో.. ఈ సేవలు అందించేందుకు ఎన్ఎస్ఈ కూడా రంగంలోకి దిగింది. ఎన్ఎస్ఈ అందిస్తున్న ఈ సేవల సమాచారమే ఈ వారం ప్రాఫిట్‌ప్లస్ కథనం.. త్వరలోనే ఎన్ఎస్ఈ సేవలు భారతీయ ఇన్వెస్టర్లు అమెరికాలో లిస్ట్ అయిన స్టాక్స్ కొనుగోలు, విక్రయాలు చేసుకునేందుకు వీలుగా అవసరమైన వేదికను ఏర్పాటు చేయాలని నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ (ఎన్ఎస్ఈ)కి చెందిన ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ నిర్ణయం తీసుకుంది. ప్రణాళిక మేరకు పనులు పూర్తయితే త్వరలోనే ఫ్యాంగ్ స్టాక్స్ (ఫేస్బుక్, అమెజాన్, యాపిల్, నెట్‌ఫ్లిక్స్, గూగుల్), మైక్రోసాఫ్ట్, టెస్లా తదితర ఎన్నో స్టాక్స్‌లో లావాదేవీలు సులభతరం కానున్నాయి. సెబీ, ఆర్బీఐ నిబంధనలకు అనుగుణంగా కేవైసీని పూర్తి చేసిన (కస్టమర్ గుర్తింపు వివరాల ధ్రువీకరణ) కస్టమర్లు యూఎస్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది. ప్రస్తుతానికి దేశీయ బ్రోకరేజీ సంస్థలు కొన్ని యూఎస్ స్టాక్స్‌లో నేరుగా పెట్టుబడులకు వీలు కల్పిస్తున్నాయి. కానీ, స్థానికంగా ఒక ఎక్సే్ఛంజ్ ప్లాట్‌ఫామ్ లేదు. ఆ లోటును ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ భర్తీ చేయనుంది. ప్రత్యేక ఖాతా అక్కర్లేదు! సుమారు 40 దేశీయ బ్రోకరేజీ సంస్థలు గుజరాత్‌లోని ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్ (ఐఎఫ్ఎస్సీ/గిఫ్టి సిటీ)లో కేంద్రాలను ఏర్పాటు చేసుకున్నాయి. మరికొన్ని కేంద్రాలను ఏర్పాటు చేసే క్రమంలో ఉన్నాయి. విదేశీ స్టాక్స్‌లో నేరుగా ఇన్వెస్ట్ చేసుకోవాలని భావించే ఇన్వెస్టర్లు గిఫ్ట్ సిటీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహించే బ్రోకర్ల వద్ద ట్రేడింగ్–డీమ్యాట్ ఖాతాలను తెరవాల్సి ఉంటుంది. అయితే, ఎన్ఎస్ఈ నియంత్రణ సంస్థలతో సంప్రదింపులు నిర్వహిస్తోంది. ఇప్పటికే కేవైసీ వివరాలు సమర్పించి ట్రేడింగ్/డీమ్యాట్ ఖాతా కలిగిన వారు యూఎస్ స్టాక్స్‌లో పెట్టుబడుల కోసం ప్రత్యేకంగా ఖాతా తెరవాల్సిన అవసరం లేకుండా అనుమతి పొందే ప్రయత్నం చేస్తోంది. ఇది ఫలిస్తే.. ఇన్వెస్టర్లు ప్రస్తుత తమ ట్రేడింగ్ ఖాతా నుంచే దేశీయ స్టాక్స్ మాదిరే.. యూఎస్ స్టాక్స్‌లోనూ కొనుగోలు, విక్రయాలు చేసుకోవచ్చు. ఇందుకోసం తమ సమ్మతి తెలియజేస్తూ ప్రత్యేకంగా ఒక పత్రం సమర్పిస్తే సరిపోతుంది. గిఫ్ట్‌సిటీ అన్నది అంతర్జాతీయ కార్యకలాపాల కోసం ఉద్దేశించిన ప్రత్యేక ప్రాంతం. మరిన్ని విదేశీ స్టాక్స్కూ అవకాశం మనదేశంలోని రెండు డిపాజిటరీ సంస్థలైన సీడీఎస్ఎల్, ఎన్ఎస్డీఎల్ కూడా గిఫ్ట్ సిటీలో అనుబంధ సంస్థలను ఇప్పటికే ఏర్పాటు చేశాయి. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలనే కొత్త ఇన్వెస్టర్లకు ఈ డిపాజిటరీల నుంచి డీమ్యాట్ ఖాతాలను బ్రోకరేజీ సంస్థలు ఆఫర్ చేయనున్నాయి. ప్రారంభంలో యూఎస్ స్టాక్స్‌లో లావాదేవీలకే పరిమితమైనప్పటికీ.. తర్వాత ఇతర విదేశీ స్టాక్స్‌లోనూ పెట్టుబడులకు అవకాశం అందుబాటులోకి రానుంది. విదేశీ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు తమ బ్యాంకు శాఖను సంప్రదించాల్సి ఉంటుంది. గిఫ్ట్ సిటీలోని బ్రోకర్ వద్ద తన ఖాతాకు నిధులు బదిలీ చేయాలని కోరాల్సి ఉంటుంది. ఆర్బీఐ లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద ఒక ఏడాదిలో 2,50,000 డాలర్లు (సుమారు రూ.1.85కోట్లు) విదేశాలకు పంపుకోవచ్చు. స్టాక్స్, మ్యచువల్ ఫండ్స్ యూనిట్ల కొనుగోలు, ఈటీఎఫ్‌ల కోసం ఈ నిధులను వినియోగించుకోవచ్చు. కాకపోతే ఎల్ఆర్ఎస్ కింద పంపుకునే నిధులతో విదేశీ డెరివేటివ్ సాధనంలో ఇన్వెస్ట్ చేయకూడదు. ఖాతాదారు కోరిక మేరకు బ్యాంకు ఎల్ఆర్ఎస్ పరిమితిని పరిశీలించిన తర్వాత గిఫ్ట్ సిటీలో బ్రోకర్ ఖాతాకు నిధులను బదిలీ చేస్తుంది. ప్రస్తుత తమ బ్యాంకు శాఖ నుంచే ఈ సేవలను పొందొచ్చు. ప్రత్యేకంగా బ్యాంకు ఖాతాను ఇందుకోసం తెరవాల్సిన అవసరం ఉండదు. తొలుత టాప్–50కే పరిమితం నిధుల బదిలీ అనంతరం విదేశీ స్టాక్స్‌లో క్రయ, విక్రయాలు నిర్వహించుకోవచ్చు. తొలుత యూఎస్‌కు చెందిన టాప్–50 స్టాక్స్‌లో లావాదేవీలకు ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ అనుమతించనుంది. తర్వాత మరిన్ని స్టాక్స్‌లో లావాదేవీలకు అవకాశం కల్పించాలన్నది ఎన్ఎస్ఈ ప్రణాళిక. ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ ప్రత్యేకంగా అంతర్జాతీయ బ్రోకరేజీలను నియమించుకోనుంది. ఈ బ్రోకర్లు అమెరికా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లలో షేర్లను కొనుగోలు చేసి, డిపాజిటరీ రిసీప్ట్ (సర్టిఫికెట్ ఆఫ్ ఓనర్షిప్)ను గిఫ్ట్‌సిటీలోని ఇన్వెస్టర్లకు కేటాయించనున్నాయి. మన దేశంలో పాక్షిక షేర్లకు అవకాశం లేదు. కనీసం ఒక షేరును లావాదేవీగా నిర్వహించాల్సిందే. కానీ, అమెరికాలో పాక్షిక షేర్లను కూడా సొంతం చేసుకోవచ్చు. 3 డాలర్లు, 6 డాలర్ల డినామినేషన్లో పాక్షిక షేర్లను పొందే అవకాశం గిఫ్ట్ సిటీ ఇన్వెస్టర్లకు ఉంటుంది. ఉదాహరణకు యాపిల్ ఒక షేరు సుమారు 149 డాలర్ల వద్ద ఉంది. ఒక్క షేరు కొనుగోలుకు పెట్టుబడి రూ.11వేలపై మాటే. ఇంత ఇన్వెస్ట్ చేయలేని వారు పాక్షిక షేర్లను కొనుగోలు చేసుకోవచ్చు. లావాదేవీలకు ఎన్ఎస్ఈ క్లియరింగ్ కార్పొరేషన్ హామీదారుగా ఉంటుంది. టీప్లస్3 సెటిల్మెంట్ అమలవుతుంది. లావాదేవీ నమోదైన రోజు కాకుండా తర్వాతి మూడవ పనిదినం ముగింపు నాటికి షేర్లు డీమ్యాట్ ఖాతాలో జమ అవుతాయి. ఈ బ్రోకర్ల నుంచి సేవలు హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్, జియోజిత్, మోతీ లాల్ ఓస్వాల్, యాక్సిస్ సెక్యూరిటీస్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్, మ్యాటర్ట్రస్ట్, విన్వెస్టా, వెస్టెడ్ ఫైనాన్స్ తదితర సంస్థలు ఇప్పటికే యూఎస్ స్టాక్స్ లో పెట్టుబడులకు అవకాశం కల్పిస్తున్నాయి. ఇం దుకోసం ఈ సంస్థలు అమెరికాకు చెందిన బ్రోకరేజీ సంస్థలతో భాగస్వామ్యాలను కూడా కుదుర్చుకున్నాయి. ఈ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా విదేశీ స్టాక్స్, బాండ్లు, రీట్, ట్రెజరీ బాండ్లలోనూ లావాదేవీలు నిర్వహించుకోవచ్చు. ఒక్క డాలర్ నుంచి పెట్టుబడులకు ఇవి అనుమతిస్తున్నాయి. వేగంగా, సులభంగా ఖాతా తెరిచే సేవలను ఇవి అందిస్తున్నాయి. పన్ను ఇక్కడే చెల్లించాలి.. విదేశీ స్టాక్స్‌లో లాభాలపై దేశీయంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాకపోతే స్థానిక స్టాక్స్‌లోని లాభాలపై పన్నుతో పోలిస్తే భిన్నమైన రేట్లు అమల్లో ఉన్నాయి. అమెరికా, బ్రిటన్ తదితర చాలా దేశాల్లో విదేశీ ఇన్వెస్టర్లు ఆర్జించిన ఈక్విటీ (స్టాక్స్,ఫండ్స్) లాభాలపై మూలధన లాభాల పన్ను లేదు. డివిడెండ్లు, వడ్డీ రాబడి కూడా పన్ను రహితమే. కానీ, ఆయా లాభాలు, ఆదాయంపై ఇక్కడ పన్ను చెల్లించాలి. విదేశీ ఎక్సే్ఛంజ్‌ల్లో లిస్ట్ అయిన షేరు లేదా ఫండ్‌లో రెండేళ్ల తర్వాత పెట్టుబడులను విక్రయించగా వచ్చిన లాభాన్ని దీర్ఘకాల మూలధన లాభంగా చట్టం పరిగణిస్తోంది. ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించగా మిగిలిన లాభంపై 20%పన్ను చెల్లించాలి. దేశీయ స్టాక్స్, ఈక్విటీ ఫండ్స్‌లో దీర్ఘకాల మూలధన లాభం మొదటి రూ.లక్ష (ఒక ఆర్థిక సంవత్సరంలో) పై పన్ను లేదు. కానీ, విదేశీ మూలధన లాభాలకు ఇది వర్తించదు. విదేశీ స్టాక్స్ లేదా ఈక్విటీ ఫండ్స్‌లో పెట్టుబడులను రెండేళ్లలోపే విక్రయించినట్టయితే.. లాభాన్ని తమ ఆదాయం కింద రిటర్నుల్లో చూపించాలి. అప్పుడు తమకు వర్తించే శ్లాబు రేటు కింద పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన విషయం.. విదేశీ పెట్టుబడుల వివరాలను (విదేశీ ఆస్తులు, విదేశీ ఆదాయం) ఎప్పటికప్పుడు ఐటీఆర్‌లో విధిగా పేర్కొనాల్సిందే. స్టాక్స్ కొనుగోలు క్రమం ఇదీ ► డీమ్యాట్ ఖాతా ఉంటే చాలు. ఇప్పటి వరకు డీమ్యాట్ ఖాతా లేని వారు గిఫ్ట్ సిటీ కేంద్రంగా పనిచేస్తున్న బ్రోకర్ల వద్ద ఖాతా తెరవాల్సి ఉంటుంది. కేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలి. ► ఆర్బీఐ ఎల్ఆర్ఎస్ కింద బ్యాంకు నుంచి గిఫ్ట్ సిటీలోని ఖాతాకు ఒక ఏడాదిలో 2.5లక్షల డాలర్లను పంపుకోవచ్చు. ► యూఎస్ స్టాక్స్‌లో పాక్షిక వాటాలనూ సొంతం చేసుకోవచ్చు. తొలుత యూఎస్ టాప్–50 స్టాక్స్ అందుబాటులో ఉండనున్నాయి. ► ఎన్ఎస్ఈ ఐఎఫ్ఎస్సీ క్లియరింగ్ కార్పొరేషన్ ఈ లావాదేవీల సెటిల్మెంట్ను చూస్తుంది. -
కేవైసీ పెండింగ్‌లో ఉంటే.. డీమ్యాట్ ఖాతా కట్..
జులై 31 లోగా తమ KYC డిటెయిల్స్ పూర్తి చేయని డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్లు నిలిపేస్తామంటూ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్, నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్‌లు సర్క్యులర్ జారీ చేశాయి. ఈ ఖాతాలు నిలిపేయకుండా ఉండాలంటే వెంటనే కేవైసీలో అవసరమైన వివరాలు నమోదు చేయాల్సి ఉంటుంది. కేవైసీకి సంబంధించి పేరు,అడ్రస్, పాన్‌కార్డు వివరాలు, ఉపయోగంలో ఉన్న ఫోను నంబరు, ఈ మెయిల్ వివరాలను తెలియజేయాల్సి ఉంటుంది. ఆధార్ కార్డులో లింకైన పాన్‌కార్డునే కేవైసీ గుర్తిస్తుంది. కాబట్టి పాన్‌కార్డును ముందుగా ఆధార్‌లో లింక్ చేయాల్సి ఉంటుంది. ఆధార్‌తో లింకైన మొబైల్ నంబర్ వివరాలు ఇవ్వడం ఉత్తమం. వ్యక్తిగత వివరాలతో పాటు వార్షిక సంపాదన అంశాలను కేవైసీలో పొందు పరచాల్సి ఉంటుంది. వ్యక్తిగత ఆదాయానికి సంబంధించి ఐదు కేటగిరీలు, వ్యక్తిగతేతర ఆదాయానికి సంబంధించి నాలుగు కేటగిరీలు ఉన్నాయి. వీటిని అనుసరించి డీమ్యాట్, ట్రేడింగ్ అకౌంట్ హోల్డర్లు .. తమ ఆదాయ వివరాల ఆధారంగా తగు కేటగిరీని ఎంచుకోవాల్సి ఉంటుంది. -
సీడీఎస్ఎల్ లిస్టింగ్ ధమాకా!
♦ ఇష్యూ ధర 149.. రూ.250 వద్ద లిస్టింగ్ ♦ 75% అప్... రూ.262 వద్ద క్లోజ్ న్యూఢిల్లీ: బీఎస్ఈకి చెందిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) స్టాక్ మార్కెట్లో అదిరిపోయే అరంగేట్రం చేసింది. శుక్రవారం నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్‌లో (ఎన్ఎస్ఈ) లిస్టింగ్ రోజు మెరుపులు మెరిపించింది. ఇష్యూ ధర రూ.149తో పోలిస్తే ఏకంగా 68 శాతం ప్రీమియంతో రూ.250 వద్ద ఈ షేర్లు లిస్టయ్యాయి. చివరివరకూ ఈ జోరును కొనసాగించడమే కాకుండా 75.5 శాతం లాభంతో రూ.261.60 వద్ద స్థిరపడింది. 5 కోట్ల మేర షేరు చేతులుమారాయి. గత నెలలో ఐపీఓకి వచ్చిన సీడీఎస్ఎల్ ఇష్యూకి రికార్డు స్థాయిలో 170 రెట్ల ఓవర్ సబ్స్క్రిప్షన్ లభించిన సంగతి తెలిసిందే. ‘మా సంస్థ లిస్టింగ్ ద్వారా ఇన్వెస్టర్లకు లాభాలు పంచడం ఆనందంగా ఉంది. ఇది స్టాక్ మార్కెట్లో సానుకూల సెంటిమెంట్‌కు దోహదం చేస్తుంది’ అని సీడీఎస్ఎల్ ఎండీ, సీఈఓ పి.ఎన్.రెడ్డి పేర్కొన్నారు. సీడీఎస్ఎల్ లిస్టింగ్.. దేశీ క్యాపిటల్ మార్కెట్స్ చరిత్రలో కీలకమైన మైలురాయి అని ఎన్ఎస్ఈ తాత్కాలిక సీఈఓ జె.రవిచంద్రన్ అభివర్ణించారు. -
నేడు సీడీఎస్ఎల్ లిస్టింగ్
న్యూఢిల్లీ: ఇటీవల విజ యవంతంగా తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీఓ)ను పూర్తిచేసిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) షేర్లు శుక్రవారం లిస్ట్‌కానున్నాయి. జూన్ 19–21 మధ్య జారీఅయిన ఈ ఐపీఓ భారీగా 170 రెట్లు ఓవర్ సబ్స్క్రయిబ్ అయ్యింది. ఆఫర్ రూ. 145–149 ప్రైస్‌బ్యాండ్‌తో జారీఅయ్యింది. -
సీడీఎస్ఎల్ ఐపీవో 19న
ముంబై: డిపాజిటరీ సర్వీసులు అందిస్తున్న సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్ఎల్) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జూన్ 19న ప్రారంభంకానుంది. రూ. 500 కోట్ల సమీకరణకు రూ. 145–149 ప్రైస్‌బ్యాండ్‌తో సీడీఎస్ఎల్ ఈ ఆఫర్ జారీకానుంది. సీడీఎస్‌ఎల్‌లో ప్రస్తుతం వాటాలు కలిగిన బొంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్ఈ), ఎస్బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కలకత్తా స్టాక్ ఎక్సే్ఛంజ్లతో పాటు మరికొన్ని షేర్‌హోల్డింగ్ సంస్థలు సీడీఎస్ఎల్ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించనున్నాయి. సీడీఎస్‌ఎల్‌లో ప్రస్తుతం 50.05 శాతం వాటా కలిగిన బీఎస్ఈ 26.05 శాతం (2.72 కోట్ల షేర్లు) ఆఫ్‌లోడ్ చేయనుంది. సెబి తాజా నిబంధనల ప్రకారం ఏ స్టాక్ ఎక్సే్ఛంజీ... డిపాజిటరీలో 24 శాతంకంటే మించి వాటా కలిగివుండరాదు. ఈ నిబంధనలకు అనుగుణంగా బీఎస్ఈ అధిక వాటాను విక్రయించనున్నది. తాజా ఆఫర్ పూర్తయిన తర్వాత సీడీఎస్ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయ్యే తొలి డిపాజిటరీ అవుతుంది. ఇది బీఎస్ఈ, ఎన్ఎస్ఈల్లో లిస్టవుతుంది. 2016–17లో సీడీఎస్ఎల్ మొత్తం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 187 కోట్లకు చేరగా, నికరలాభం 22 శాతం వృద్ధితో రూ. 86 కోట్లకు పెరిగింది. త్వరలో కమోడిటీ రిపాజిటరీ... కొద్ది నెలల్లో తాము కమోడిటీ రిపాజిటరీని ఏర్పాటుచేస్తామని, ఇది తమ కంపెనీ వృద్ధికి దోహదపడుతుందని సీడీఎస్ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీఎస్ రెడ్డి సోమివారంనాడిక్కడ మీడియాకు తెలిపారు. వేర్‌హౌసింగ్ డెవలప్మెంట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఇప్పటికే తాము సూత్రప్రాయ అనుమతి పొందామని, రానున్న 2–3 నెలల్లో ఇది ఏర్పాటు కావొచ్చన్నారు. ఇన్వెస్టర్లు వారి సెక్యూరిటీలను డీమ్యాట్ రూపంలో అట్టిపెట్టుకునేందుకు ఎలక్ట్రానిక్ అకౌంట్లను సీడీఎస్ఎల్ అనుమతిస్తుంది. ఈ సంస్థ వద్ద ప్రస్తుతం 1.25 కోట్ల ఖాతాలుండగా, దీనికి పోటీ సంస్థ ఎన్ఎస్డీఎల్ వద్ద 1.58 కోట్ల ఖాతాలున్నాయి. -
మనమూ కావచ్చు సంపన్నులం
పథకాల ఎంపికలో జాగ్రత్తలు అవసరం ‘సాక్షి’ మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ సదస్సులో నిపుణులు సాక్షి, వరంగల్: ప్రతి ఒక్కరూ పథకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెడితే సంపన్నులు కావొచ్చని పలువురు నిపుణులు తెలిపారు. భద్రమైన, లాభదాయకమైన పెట్టుబడులు ఏ విధంగా ఉండాలి, నిర్వహణ ఎలా, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, అందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటీ, డీమ్యాట్ సమాచారంపై ఔత్సాహిక మదుపరులకు అవగాహన కల్పించేందుకు సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్, సీడీఎస్ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలువురు ఔత్సాహికులు హాజరయ్యారు. సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి మాట్లాడుతూ స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతిఒక్కరూ సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చని తెలిపారు. నిపుణులైన ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో మదుపరుల సొమ్మును నిఫ్టీ 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణలో కొనసాగుతాయి కాబట్టి మదుపరుల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందని వివరించారు. ఇన్వెస్ట్మెంట్ కల్చర్ అలవాటు చేసుకుంటే మదుపరులకు ఎంతో మంచిదని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ జయత్కుమార్ అన్నారు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు కొంతకాలం ట్రేడింగ్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని కార్వీ స్టాక్ బ్రోకింగ్.. ఫండమెంటల్ రీసెర్చ్ అనలిస్ట్ అశోక్ రామినేని అన్నారు. రెండు షేర్లు కొంటే ఒకదాని ధర పడిపోవచ్చు, మరొకటి పెరిగితే సాధారణంగా పెరిగిన షేర్లను అమ్ముతుంటారు. తగ్గిన షేరును వదిలించుకోవడం ద్వారా మరింత నష్టపోకుండా ఉంటామన్నారు. -
సీడీఎస్ఎల్ చైర్మన్‌గా కృష్ణమూర్తి
హైదరాబాద్: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) చైర్మన్‌గా టి.ఎస్.కృష్ణమూర్తి నియమితులయ్యారు. ఈయన నియామకానికి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డు ఆఫ్ ఇండియా (సెబీ) ఆమోదం తెలిపిందని సీడీఎస్ఎల్ బోర్డు ఆఫ్ డెరైక్టర్స్ తెలియజేశారు. కృష్ణమూర్తి ఏప్రిల్ 8న సీడీఎస్ఎల్ చైర్మన్‌గా నియమితులయ్యారు. ఈ నియామకానికి తాజాగా సెబీ ఆమోదం ముద్ర వేసింది. కృష్ణ మూర్తి ఇండియన్ రెవెన్యూ సర్వీసెస్‌కు చెందిన మాజీ అధికారి. ఈయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌గా పనిచేశారు. అలాగే కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. ఈయన బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ప్రొబేషనరీ అధికారిగా తన కెరీర్‌ను ప్రారంభించారు. -
సీడీఎస్ఎల్ ‘ఈ-లాకర్’ సౌలభ్యం
హైదరాబాద్: ప్రముఖ సెక్యూరిటీస్ డిపాజిటరీ ‘సీడీఎస్ఎల్’ తాజాగా ‘ఈ-లాకర్’ సౌల భ్యాన్ని అందుబాటులోకి తెచ్చిం ది. ఇన్వెస్టర్లు దీని సాయంతో వారి వ్యక్తిగత, ఆర్థిక, ఇతర అంశాలకు చెందిన డాక్యుమెంట్లను భద్రంగా దాచుకోవచ్చని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఈజి/ఈజియెస్ట్లో రిజిస్టర్ చేసుకున్న ఇన్వెస్టర్లకు ఈ సదుపాయాన్ని ఉచితంగా అందుబాటులో ఉంటుందని పేర్కొంది. ఈజి/ఈజియెస్ట్ లాగిన్ ఐడీ ద్వారా ఈ-లాకర్లో ఇన్వెస్టర్లు వారి డాక్యుమెంట్లను అప్లోడ్/డౌన్లోడ్ చేసుకోవచ్చని వివరించింది. -
పక్కా ప్రణాళికతో సంపద పెంచుకోండి
- ఈక్విటీ షేర్ల కొనుగోలు ద్వారా ఐటీ మినహాయింపు - విజయవాడలో సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ అవగాహన సదస్సులో నిపుణులు సాక్షి, విజయవాడ: పక్కాగా ఆర్థిక ప్రణాళిక రూపొందించుకోవటం ద్వారా సురక్షితంగా సంపదను వృద్ధి చేసుకోవచ్చని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (సీడీఎస్ఎల్) బిజినెస్ డెవలప్మెంట్ రీజినల్ మేనేజర్ శివప్రసాద్ వెన్నిశెట్టి సూచించారు. సమగ్ర అధ్యయనంతోపాటు ఆయా కంపెనీల పూర్తి స్థితిగతులు తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టడం మంచిదని చెప్పారు. ఆదివారం విజయవాడలో సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ నేతృత్వంలో మదుపరులకు అవగాహన సదస్సు జరిగింది. సదస్సు నిర్వహణకు సీడీఎస్ఎల్, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలు జత కలిశాయి. ఈ సందర్భంగా జరిగిన సభకు సాక్షి విజయవాడ ఎడిషన్ యాడ్స్ మేనేజర్ జె.ఎస్.ప్రసాద్ అధ్యక్షత వహించారు. శివప్రసాద్ మాట్లాడుతూ వివిధ కంపెనీల్లో షేర్ల రూపంలో పెట్టుబడులు పెట్టే ముందు ఆయా కంపెనీల వార్షిక నివేదిక, కంపెనీల యాజమాన్యం వివరాలు, ఆయా ఉత్పత్తుల విక్రయాల స్థితిగతులు పరిశీలించాలన్నారు. దీనికి సంబంధించిన సమగ్ర సమాచారం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ వెబ్సైట్లలో లభ్యమవుతుందని, పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఆదాయ పన్నుకు సంబంధించి మినహాయింపు కోసం రాజీవ్‌గాంధీ ఈక్విటీ స్కీము లో పెట్టుబడి చేయవచ్చని చెప్పారు. షేర్ల విక్రయాలు జరిపేందుకు పవరాఫ్ అటార్నీ ఇచ్చే ముందు కంపెనీల నియమ నిబంధనలన్నీ పూర్తిగా చదివి సంతకం చేయాలన్నారు. సాక్షి మీడియా గ్రూప్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించటం అభినందనీయమని కొనియాడారు. స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రీజినల్ మేనేజర్ రవికుమార్ ముప్పవరపు మాట్లాడుతూ సరైన కంపెనీలను ఎంచుకొని, సరైన సమయంలో పెట్టుబడులు పెడితే మంచి ఫలితాలు వస్తాయని చెప్పారు. ప్రమోటర్లు షేర్లు కుదవ పెట్టిన కంపెనీల షేర్లు కొనుగోలు చేయవద్దని సూచించారు. అలాగే ఎక్కువ అప్పులు చూపించే కంపెనీల షేర్లు కూడా కొనుగోలు చేయడం మం చిది కాదని చెప్పారు. సదస్సులో పాల్గొన్న పలువురు మదుపరులు అడిగిన ప్రశ్నలకు హాజరైన నిపుణులు సమాధానాలిచ్చారు. -
కోటి దాటిన సీడీఎస్ఎల్ డీమ్యాట్ అకౌంట్లు
న్యూఢిల్లీ: సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ ఇండియా(సీడీఎస్ఎల్)లో ఉన్న డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య ఆగస్టు చివరినాటికి కోటిని దాటింది. డీమ్యాట్ అకౌంట్ల విషయంలో నిలకడైన వృద్ధిని సాధిస్తున్నామని సీడీఎస్ఎల్ తెలిపింది. మొత్తం డీమ్యాట్ అకౌంట్లలో తమ వాటా 42 శాతమని తెలిపింది. పదేళ్లలో తమ మార్కెట్ వాటాలో 54% వృద్ధి సాధించామని సీడీఎస్ఎల్ చైర్మన్ ఎన్.రంగాచారి చెప్పారు. కస్టడీ చార్జీలు లేకపోవడం, డీమ్యాట్ అకౌంట్లోకి వచ్చే సెక్యూరిటీలపై చార్జీలు విధించకపోవడం, టారిఫ్‌లను తగ్గించడం, సేవల్లో నాణ్యత తమ మార్కెట్ మెరుగుదలకు కారణమన్నారు. -
రేపు గుంటూరులో... సాక్షి మైత్రి మదుపరుల అవగాహన సదస్సు
సాక్షి, బిజినెస్ బ్యూరో : పెట్టుబడి అవకాశాలపై మదుపరుల్లో అవగాహన కలిగించడానికి‘మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ పేరిట ‘సాక్షి’ నిర్వహిస్తున్న మదుపరుల అవగాహన సదస్సు ఆదివారం గుంటూరులో జరగనుంది. గుంటూరు అరండల్ పేట్‌లోని వైన్ మర్చంట్స్ చాంబర్ ఫంక్షన్ హాల్లో ఉదయం 10 నుంచి ఒంటి గంట వరకూ జరిగే ఈ కార్యక్రమంలో ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ (సీడీఎస్ఎల్) సంస్థలకు చెందిన ఉన్నత స్థాయి అధికారులు, ఆర్థిక నిపుణులు పాల్గొంటారు. మదుపరుల ముందు ఉన్న వివిధ అవకాశాలను వివరించటంతో పాటు, మదుపు చేసేటపుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వీరు తగిన సూచనలిస్తారు. ‘సాక్షి’తో కలిసి ఎస్బీఐ క్యాప్ సెక్యూరిటీస్, సీడీఎస్ఎల్ సంయుక్తంగా నిర్వహిస్తున్న ఈ అవగాహన సదస్సుకు ప్రవేశం ఉచితం. అయితే ముందుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ల కోసం ‘9505555020’ నంబర్లో సంప్రదించాలి. -
రికార్డ్ స్థాయికి ఎఫ్ఐఐ నిధులు
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్ఐఐ) గత ఆర్థిక సంవత్సరంలో భారత క్యాపిటల్ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్ఐఐలు భారత్‌లో రూ.2.7 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్ఎల్) తెలిపింది. వీటిల్లో నికర ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులు రూ.1.09 లక్షల కోట్లుగా, డెట్ మార్కెట్ పెట్టుబడులు రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. 1992 నవంబర్ నుంచి భారత క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఎఫ్ఐఐలను అనుమతించారు. అప్పటి నుంచి అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి చూస్తే ఎఫ్ఐఐల పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా వచ్చాయి. ఇంతవరకూ 2012-13లో అధికంగా(రూ.1.68 లక్షల కోట్లు) ఎఫ్ఐఐల నిధులు భారత్‌లోకి వచ్చాయి.