మనమూ కావచ్చు సంపన్నులం
పథకాల ఎంపికలో జాగ్రత్తలు అవసరం
‘సాక్షి’ మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ సదస్సులో నిపుణులు
సాక్షి, వరంగల్: ప్రతి ఒక్కరూ పథకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెడితే సంపన్నులు కావొచ్చని పలువురు నిపుణులు తెలిపారు. భద్రమైన, లాభదాయకమైన పెట్టుబడులు ఏ విధంగా ఉండాలి, నిర్వహణ ఎలా, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, అందులో ఇన్వెస్ట్‌మెంట్ ఎలా, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటీ, డీమ్యాట్ సమాచారంపై ఔత్సాహిక మదుపరులకు అవగాహన కల్పించేందుకు సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్, సీడీఎస్‌ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలువురు ఔత్సాహికులు హాజరయ్యారు.
సీడీఎస్‌ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి మాట్లాడుతూ స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతిఒక్కరూ సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చని తెలిపారు. నిపుణులైన ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో మదుపరుల సొమ్మును నిఫ్టీ 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణలో కొనసాగుతాయి కాబట్టి మదుపరుల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందని వివరించారు.
ఇన్వెస్ట్‌మెంట్ కల్చర్ అలవాటు చేసుకుంటే మదుపరులకు ఎంతో మంచిదని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ జయత్‌కుమార్ అన్నారు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు కొంతకాలం ట్రేడింగ్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని కార్వీ స్టాక్ బ్రోకింగ్.. ఫండమెంటల్ రీసెర్చ్ అనలిస్ట్ అశోక్ రామినేని అన్నారు. రెండు షేర్లు కొంటే ఒకదాని ధర పడిపోవచ్చు, మరొకటి పెరిగితే సాధారణంగా పెరిగిన షేర్లను అమ్ముతుంటారు. తగ్గిన షేరును వదిలించుకోవడం ద్వారా మరింత నష్టపోకుండా ఉంటామన్నారు.