sakshi Maitri Investors Club
-
మనమూ కావచ్చు సంపన్నులం
పథకాల ఎంపికలో జాగ్రత్తలు అవసరం ‘సాక్షి’ మైత్రి ఇన్వెస్టర్ క్లబ్ సదస్సులో నిపుణులు సాక్షి, వరంగల్: ప్రతి ఒక్కరూ పథకాల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటూ పెట్టుబడులు పెడితే సంపన్నులు కావొచ్చని పలువురు నిపుణులు తెలిపారు. భద్రమైన, లాభదాయకమైన పెట్టుబడులు ఏ విధంగా ఉండాలి, నిర్వహణ ఎలా, స్టాక్ మార్కెట్ ఎలా పనిచేస్తుంది, అందులో ఇన్వెస్ట్మెంట్ ఎలా, మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏమిటీ, డీమ్యాట్ సమాచారంపై ఔత్సాహిక మదుపరులకు అవగాహన కల్పించేందుకు సాక్షి మైత్రి ఇన్వెస్టర్ క్లబ్, సీడీఎస్ఎల్ సంయుక్త ఆధ్వర్యంలో హన్మకొండలో ఆదివారం సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు పలువురు ఔత్సాహికులు హాజరయ్యారు. సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ వెనిశెట్టి మాట్లాడుతూ స్టాక్ మార్కెట్‌పై అవగాహన లేకున్నా, మ్యూచువల్ ఫండ్స్‌లో ప్రతిఒక్కరూ సులభంగా ఇన్వెస్ట్ చేయవచ్చని తెలిపారు. నిపుణులైన ఫండ్ మేనేజర్ పర్యవేక్షణలో మదుపరుల సొమ్మును నిఫ్టీ 50 కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తారని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ సెబీ నియంత్రణలో కొనసాగుతాయి కాబట్టి మదుపరుల సొమ్ముకు పూర్తి భద్రత ఉంటుందని వివరించారు. ఇన్వెస్ట్మెంట్ కల్చర్ అలవాటు చేసుకుంటే మదుపరులకు ఎంతో మంచిదని కార్వీ స్టాక్ బ్రోకింగ్ లిమిటెడ్ జనరల్ మేనేజర్ జయత్కుమార్ అన్నారు. మార్కెట్లో పెట్టుబడులు పెట్టేముందు కొంతకాలం ట్రేడింగ్ జోలికి వెళ్లకపోవడమే మంచిదని కార్వీ స్టాక్ బ్రోకింగ్.. ఫండమెంటల్ రీసెర్చ్ అనలిస్ట్ అశోక్ రామినేని అన్నారు. రెండు షేర్లు కొంటే ఒకదాని ధర పడిపోవచ్చు, మరొకటి పెరిగితే సాధారణంగా పెరిగిన షేర్లను అమ్ముతుంటారు. తగ్గిన షేరును వదిలించుకోవడం ద్వారా మరింత నష్టపోకుండా ఉంటామన్నారు. -
డీమ్యాట్‌తో బహుళ ప్రయోజనాలు
సాక్షి మదుపరుల అవగాహన సదస్సులో సీడీఎస్ఎల్ ఆర్ఎం సాక్షి, విశాఖపట్నం: ‘దేశ జనాభా 121 కోట్లు దాటింది. బ్యాంకు ఖాతాలు 46 కోట్లు. సెల్‌ఫోన్ వినియోగదారుల సంఖ్య 100 కోట్ల పైనే. అయితే డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2.50 కోట్లే. స్టాక్ మార్కెట్లో మదుపు చేయాలనుకునే వారికి ముందుగా ఉండాల్సింది డిమ్యాట్ ఖాతానే. దీనివల్ల బహుళ ప్రయోజనాలున్నాయి.’ అని సీడీఎస్ఎల్ రీజనల్ మేనేజర్ శివప్రసాద్ అన్నారు. సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్ ఆదివారం విశాఖలో నిర్వహించిన మదుపరుల అవగాహన సదస్సులో ఆయన పలు విలువైన సూచనలు అందించారు. ఆదాయపు పన్నుశాఖ జారీ చేసిన పాన్‌కార్డు ఉన్న వ్యక్తులెవరైనా డీమ్యాట్ ఖాతాను ప్రారంభించేందుకు వీలుందని, ఇందులో ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లను భద్రపర్చుకోవచ్చని వివరించారు. డీమ్యాట్ ఖాతాదారులు తప్పనిసరిగా నామినీని పేర్కొనాలని, అనుకోనిదేదైనా జరిగితే ఖాతాలో ఉన్న షేర్లను నామినీ ఖాతాలోకి వెంటనే బదిలీ చేయవచ్చన్నారు. స్టాక్ మార్కెట్లో అవగాహనతో మదుపు చేస్తే ఇతర పెట్టుబడి పథకాల కన్నా అధికంగానే రాబడి ఉంటుందని, చిన్న వయసు నుండే పెట్టుబడులు ప్రారంభించి, దీర్ఘకాలం కొనసాగించాలని ఆయన సూచించారు. రానున్న రోజుల్లో మార్కెట్ మరింత వృద్ధి చెందేందుకు అవకాశం ఉన్నందున ఆలస్యం చేయకుండా ఈక్విటీల్లో మదుపు చేసేందుకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. కోటక్ మ్యూచువల్ ఫండ్ ఏపీ, తెలంగాణా హెడ్ టి.విజయకుమార్, షేర్‌ఖాన్ లిమిటెడ్ సీనియర్ మేనేజర్ కృష్ణమూర్తి పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా మదుపు ప్రయోజనాలను వివరించారు. సదస్సులో అధిక సంఖ్యలో మదుపరులు పాల్గొన్నారు. తమ సందేహాలను మదుపరులు నిపుణులను అడిగి తెలుసుకున్నారు. -
మీరు సాక్షి ఇన్వెస్టర్స్ క్లబ్లో చేరారా?
హైదరాబాద్, బిజినెస్‌బ్యూరో: వివిధ పొదుపు సాధనాల్లో పెట్టుబడులు చేసేవారికోసం తాను నిర్వహిస్తున్న ‘ఇన్వెస్టర్స్ క్లబ్’లో చేరినవారికి ‘సాక్షి’ మరిన్ని ప్రయోజనాలు అందజేస్తోంది. ‘సాక్షి మైత్రి ఇన్వెస్టర్స్ క్లబ్’ పేరిట నిర్వహిస్తున్న సదస్సులకు ఉచితంగా హాజరయ్యే అవకాశం కల్పిస్తున్న సాక్షి... అందులో పాల్గొన్న వారికి ఆ తరవాత కూడా వివిధ సూచనలు అందజేసే బాధ్యతను నిర్వహిస్తోంది. ఇందులో భాగంగానే ఎప్పటికప్పుడు వారందరికీ మార్కెట్ పరిస్థితులను అప్డేట్ చేస్తూ న్యూస్‌లెటర్ పంపిస్తోంది. దీంతో పాటు ఎప్పటికప్పుడు ఇన్వెస్టర్స్ క్లబ్ సదస్సుల వివరాలు, తేదీల వంటివి కూడా పంపిస్తోంది. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులకు తగిన ప్రతిఫలాలను పొందాలన్న ప్రధాన లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ సేవలకు సంబంధించి మరింత సమాచారానికి 9505555020 నంబర్‌కు ఉద యం 10 సాయంత్రం 6 మధ్య కాల్ చేయొచ్చు. investorsclub @sakshi.com కు ఈ మెయిల్ కూడా పంపవచ్చు.