రికార్డ్ స్థాయికి ఎఫ్‌ఐఐ నిధులు
న్యూఢిల్లీ: విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు(ఎఫ్‌ఐఐ) గత ఆర్థిక సంవత్సరంలో భారత క్యాపిటల్ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో పెట్టుబడులు పెట్టారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో ఎఫ్‌ఐఐలు భారత్‌లో రూ.2.7 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేశారని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్(సీడీఎస్‌ఎల్) తెలిపింది. వీటిల్లో నికర ఈక్విటీ మార్కెట్ పెట్టుబడులు రూ.1.09 లక్షల కోట్లుగా, డెట్ మార్కెట్ పెట్టుబడులు రూ.1.64 లక్షల కోట్లుగా ఉన్నాయని పేర్కొంది. 1992 నవంబర్ నుంచి భారత క్యాపిటల్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టడానికి ఎఫ్‌ఐఐలను అనుమతించారు. అప్పటి నుంచి అంటే దాదాపు 20 ఏళ్ల నుంచి చూస్తే ఎఫ్‌ఐఐల పెట్టుబడులు గత ఆర్థిక సంవత్సరంలోనే అత్యధికంగా వచ్చాయి. ఇంతవరకూ 2012-13లో అధికంగా(రూ.1.68 లక్షల కోట్లు) ఎఫ్‌ఐఐల నిధులు భారత్‌లోకి వచ్చాయి.