రూ.21,000 కోట్ల విదేశీ పెట్టుబడులు
రూ.5,992 కోట్లు ఈక్విటీల్లోకి బాండ్‌లలో రూ.15,336 కోట్లు
న్యూఢిల్లీ: విదేశీ ఇన్వెస్టర్లు భారత క్యాపిటల్ మార్కెట్లో ఈ ఏడాది ఇప్పటివరకూ(జనవరి 23) రూ.21,328 కోట్లు పెట్టుబడులు పెట్టారని సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్‌ఎల్) పేర్కొంది. ద్రవ్యోల్బణం దిగొస్తుండడం, వడ్డీరేట్లు తగ్గే అవకాశాలుండడం వంటి కారణాల వల్ల విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల జోరు పెరుగుతోందని నిపుణులంటున్నారు. ఎవరూ ఊహించని రీతిలో ఈ నెల 14న ఆర్‌బీఐ రెపోరేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది.
కీలక రేట్లను ఆర్‌బీఐ మరింతగా తగ్గిస్తుందనే అంచనాలతో పెట్టుబడుల జోరు పెరుగుతోందని విశ్లేషకుల ఉవాచ. సీడీఎస్‌ఎల్ గణాంకాల ప్రకారం..., విదేశీ ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ-ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు) ఇప్పటివరకూ రూ.5,992 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రుణ సాధనాల్లో రూ. 15,336 కోట్లు పెట్టుబడులు పెట్టారు.
మొత్తం మీద ఈ నెల 23 వరకూ రూ. 21,328 కోట్లు పెట్టుబడులు పెట్టారు. ఇక గత ఏడాది మొత్తంలో విదేశీ ఇన్వెస్టర్లు రూ.98,150 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. రూ.1.16 లక్షల కోట్లు డెట్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేశారు. మొత్తం మీద వీరి పెట్టుబడులు గత ఏడాది రూ.2.58 లక్షల కోట్లుగా ఉన్నాయి.