జూన్‌లో తగ్గిన పీ–నోట్స్ పెట్టుబడులు, కారణం ఏంటంటే!
న్యూఢిల్లీ: దేశీ క్యాపిటల్ మార్కెట్లలోకి (ఈక్విటీ, డెట్, హైబ్రిడ్ సెక్యూరిటీస్ మొదలైనవి) పార్టిసిపేటరీ నోట్స్ (పీ–నోట్స్) ద్వారా పెట్టుబడులు జూన్ నాటికి రూ. 80,092 కోట్లకు తగ్గాయి. గడిచిన 20 నెలల్లో ఇదే కనిష్ట స్థాయి కావడం గమనార్హం. మే నెలలో ఈ పెట్టుబడులు రూ. 86,706 కోట్లుగా నమోదయ్యాయి.
అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక వడ్డీ రేట్ల పెంపు విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యం సంతరించుకుంది. అంతర్జాతీయంగా అనిశ్చితి నెలకొనడంతో సమీప భవిష్యత్తులో పీ–నోట్స్ పెట్టుబడుల్లో కూడా ఒడిదుడుకులు తప్పకపోవచ్చని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. భారత్‌లో పేరు నమోదు చేసుకోవాల్సిన అవసరం లేకుండా ఇక్కడి స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టాలనుకునే వారు పీ–నోట్స్ ద్వారా ఇన్వెస్ట్ చేయొచ్చు.
వీటిని భారత్‌లో రిజిస్టర్ అయిన ఫారిన్ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్స్ (ఎఫ్‌పీఐ) జారీ చేస్తాయి. మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ గణాంకాల ప్రకారం జూన్ నాటికి పీ–నోట్స్ పెట్టుబడులు రూ. 80,092 కోట్లుగా ఉండగా .. వీటిలో రూ. 70,644 కోట్లు ఈక్విటీల్లోనూ, రూ. 9,355 కోట్లు డెట్ సాధనాల్లోనూ, రూ. 92 కోట్లు హైబ్రిడ్ సెక్యూరిటీస్‌లోనూ ఉన్నాయి.
అంచనాలకు అనుగుణంగానే..
ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ఈ తగ్గుదల అంచనాలకు అనుగుణంగానే ఉన్నట్లు ఇన్వెస్ట్మెంట్ సలహా సేవల సంస్థ రైట్ రీసెర్చ్ వ్యవస్థాపకురాలు సోనమ్ శ్రీవాస్తవ తెలిపారు. అమెరికాలో ఫెడ్ రేట్ల పెంపు వల్ల.. సురక్షిత సాధనాల్లోకి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను మళ్లించుకునేందుకు త్వరపడటమే జూన్‌లో పీ–నోట్స్ ఇన్వెస్ట్మెంట్స్ తగ్గడానికి ప్రధాన కారణమని ఆమె పేర్కొన్నారు. మార్కెట్ కోలుకుంటూ ఉండటంతో జూన్‌తో పోలిస్తే జులై మెరుగ్గానే ఉండవచ్చని చెప్పారు. అయితే, అంతర్జాతీయంగా అనిశ్చితి కారణంగా సమీప భవిష్యత్తులో ఒడిదుడుకులు ఉండొచ్చని శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు.