సీడీఎస్‌ఎల్ ఐపీవో 19న
ముంబై: డిపాజిటరీ సర్వీసులు అందిస్తున్న సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (సీడీఎస్‌ఎల్) తొలి పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జూన్ 19న ప్రారంభంకానుంది. రూ. 500 కోట్ల సమీకరణకు రూ. 145–149 ప్రైస్‌బ్యాండ్‌తో సీడీఎస్‌ఎల్ ఈ ఆఫర్ జారీకానుంది. సీడీఎస్‌ఎల్‌లో ప్రస్తుతం వాటాలు కలిగిన బొంబే స్టాక్ ఎక్సే్ఛంజ్ (బీఎస్‌ఈ), ఎస్‌బీఐ, బ్యాంక్ ఆఫ్ బరోడా, కలకత్తా స్టాక్ ఎక్సే్ఛంజ్‌లతో పాటు మరికొన్ని షేర్‌హోల్డింగ్ సంస్థలు సీడీఎస్‌ఎల్ షేర్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో విక్రయించనున్నాయి.
సీడీఎస్‌ఎల్‌లో ప్రస్తుతం 50.05 శాతం వాటా కలిగిన బీఎస్‌ఈ 26.05 శాతం (2.72 కోట్ల షేర్లు) ఆఫ్‌లోడ్ చేయనుంది. సెబి తాజా నిబంధనల ప్రకారం ఏ స్టాక్ ఎక్సే్ఛంజీ... డిపాజిటరీలో 24 శాతంకంటే మించి వాటా కలిగివుండరాదు. ఈ నిబంధనలకు అనుగుణంగా బీఎస్‌ఈ అధిక వాటాను విక్రయించనున్నది. తాజా ఆఫర్ పూర్తయిన తర్వాత సీడీఎస్‌ఎల్ స్టాక్ ఎక్సే్ఛంజీల్లో లిస్టయ్యే తొలి డిపాజిటరీ అవుతుంది. ఇది బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈల్లో లిస్టవుతుంది. 2016–17లో సీడీఎస్‌ఎల్ మొత్తం ఆదాయం 13 శాతం వృద్ధితో రూ. 187 కోట్లకు చేరగా, నికరలాభం 22 శాతం వృద్ధితో రూ. 86 కోట్లకు పెరిగింది.
త్వరలో కమోడిటీ రిపాజిటరీ...
కొద్ది నెలల్లో తాము కమోడిటీ రిపాజిటరీని ఏర్పాటుచేస్తామని, ఇది తమ కంపెనీ వృద్ధికి దోహదపడుతుందని సీడీఎస్‌ఎల్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ పీఎస్ రెడ్డి సోమివారంనాడిక్కడ మీడియాకు తెలిపారు. వేర్‌హౌసింగ్ డెవలప్‌మెంట్ రెగ్యులేటరీ అథారిటీ నుంచి ఇప్పటికే తాము సూత్రప్రాయ అనుమతి పొందామని, రానున్న 2–3 నెలల్లో ఇది ఏర్పాటు కావొచ్చన్నారు. ఇన్వెస్టర్లు వారి సెక్యూరిటీలను డీమ్యాట్ రూపంలో అట్టిపెట్టుకునేందుకు ఎలక్ట్రానిక్ అకౌంట్లను సీడీఎస్‌ఎల్ అనుమతిస్తుంది. ఈ సంస్థ వద్ద ప్రస్తుతం 1.25 కోట్ల ఖాతాలుండగా, దీనికి పోటీ సంస్థ ఎన్‌ఎస్‌డీఎల్ వద్ద 1.58 కోట్ల ఖాతాలున్నాయి.