మిలీనియల్స్!! అంటే దాదాపు 22–37 సంవత్సరాల మధ్య ఉన్న ఆర్జనపరులైన యువత. మరి వీరికి పొదుపు, ఇన్వెస్ట్‌మెంట్, ఖర్చులకు సంబంధించిన సూత్రాలపై అవగాహన ఏ మేరకుంది? దీనికి సమాధానం కాస్త ఆశ్చర్యకరమే. ఎందుకంటే తమకన్నా ముందు పుట్టిన వారికన్నా ఈ ‘జనరేషన్–వై’ వ్యక్తులు కాస్త తెలివైనవారు. వీరికి ఇల్లు కొనుగోలు అన్నది చాలా పెద్ద కోరిక. కానీ దానికన్నా అద్దె ఇంట్లో ఉండటానికే ప్రాధాన్యమిస్తారు. అయితే ఇంత తెలివైన వారు కూడా ఆర్థిక మోసాలకు తేలిగ్గా బుక్ అయిపోతుంటారన్నది పీపీఎఫ్‌ఏఎస్ మ్యూచ్‌వల్ ఫండ్ మార్కెటింగ్ హెడ్ జయంత్‌పాయ్ అభిప్రాయం. వీరు ఇతర తరాలైన ‘జనరేషన్ ఎక్స్’, ‘జనరేషన్ జెడ్’ కన్నా భిన్నమైన వారన్నది అర్థ యంత్ర సీఈఓ నితిన్ వ్యాకరణం మాట. మరి ఈ మిలీనియల్స్ ఆర్థిక విషయాల్లో ఎలా ఉంటున్నారు? ఏ విషయాల్లో మారాల్సి ఉంది? ఆ వివరాల సమాహారమే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ కథనం... – సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
స్వల్పకాల లక్ష్యాలు... ఖర్చులూ అధికం
‘‘మిలీనియల్స్ దీర్ఘకాల లక్ష్యాల గురించి పెద్దగా ఆలోచించడం లేదు. చాలా కాలం పాటు వారు ఒంటరిగా ఉండటానికే ఇష్టపడుతున్నారు. తక్కువ బాధ్యతలతో అధికంగా ఖర్చు పెట్టే రకం. కనుక వీరిది స్వల్పకాలిక దృష్టి’’ అని నితిన్ వ్యాకరణం పేర్కొన్నారు. కానీ, వీరి కంటే ముందు తరం వారు అయిన జనరేషన్ ఎక్స్ సంపాదించడం మొదలు పెట్టినప్పటి నుంచే దీర్ఘకాలిక లక్ష్యాలైన ఇల్లు, పిల్లల విద్య, వివాహాలు, రిటైర్మెంట్ కోసం పొదుపు చేస్తున్నారు. జనరేషన్ వై మాత్రం వీటిని తర్వాత అంటూ వాయిదా వేస్తున్నారు.
పొదుపు కంటే కారు, విహార యాత్రలకు వెళ్లటం, స్మార్ట్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల కోసం ఖర్చు చేయడానికి ప్రాధాన్యం ఇస్తున్నారట. దీర్ఘకాలిక లక్ష్యాల్లో ఇల్లు అన్నది మిలీనియల్స్‌కు (జనరేషన్ వై) అతిపెద్ద కోరికగా ఉందని బ్యాంక్ బజార్ సర్వే ‘యాస్పిరేషన్ ఇండెక్స్ 2018’లో వెల్లడైంది. 25–35 మధ్య వయసున్న 1,551 మంందిపై ఈ సంస్థ సర్వే నిర్వహించింది. వీరిలో చాలా మంది అద్దె ఇళ్లలో నివసించేందుకే ఇష్టపడుతున్నారు. సొంతింటి కోసం రుణాలు తీసుకుంటే ఉద్యోగానికి కట్టుబడి ఉండాలని భావిస్తున్నారు.
కాకపోతే తమ ఆకాంక్షల కోణంలో ఇలా ఒకే చోట ఉండిపోవాలని వారు అనుకోవడం లేదట. ‘‘నేను, నా శ్రీమతి ఇద్దరం ఉద్యోగాల్లో ఫ్రెషర్లమే. ఒకే ఉద్యోగానికి అతుక్కుపోవాలని అనుకోవడం లేదు’’ అని బెంగళూరుకు చెందిన 27 ఏళ్ల హర్షవర్ధన్ పేర్కొనడం గమనార్హం. మిలీనియల్స్‌కు రిటైర్మెంట్ గురించి అవగాహన ఉన్నా... ఆర్థిక ప్రణాళిక విషయంలో దానికి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. చాలా మంది మిలీనియల్స్ దీర్ఘకాలిక లక్ష్యాలకు పొదుపును వాయిదా వేస్తున్న వారే. కానీ, ఇది సరికాదని, తమ ఆదాయంలో కనీసం 10 శాతాన్ని అయినా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు నిపుణులు.
ఫండ్స్, పాలసీల్లో పెట్టుబడులు...
ఇక పెట్టుబడుల విషయానికొస్తే మిలీనియల్స్ తెలిసీ, తెలియనట్టు వ్యవహరిస్తున్నారు. తల్లిదండ్రులు వద్దంటున్నా వీరు స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. కాకపోతే, అదే సమయంలో ఫిక్స్‌డ్ డిపాజిట్లు తెరవడం లేదా సంప్రదాయ బీమా పాలసీలను కూడా తీసుకుంటున్నారని జయంత్ పాయ్ చెప్పారు. ఉదాహరణకు అహ్మదాబాద్‌కు చెందిన దివ్య (29) ఈక్విటీల్లో 30 శాతం ఇన్వెస్ట్ చేస్తుండగా, డెట్‌లో 70 శాతం పెట్టుబడులు పెడుతోంది. నిజానికి చిన్న వయసులో ఉన్న దివ్య ఈక్విటీలకు మరింత కేటాయించుకోవడం సరైనదిగా నిపుణులు సూచిస్తున్నారు.
ఖర్చంతా ప్రయాణాలు, గ్యాడ్జెట్లకే...
మిలీనియల్స్ ప్రయాణాలు, గ్యాడ్జెట్లు, వస్త్రాలపై ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు. ముఖ్యంగా ప్రయాణాలు వీరికి ముఖ్యమైన వ్యాపకంగా ఉంటున్నాయి. వీరి ఆదాయంలో ఎక్కువ భాగం దీనికే కేటాయిస్తున్నారు కూడా. ఈ విధంగా సెలవుల్లో సరదాలనేవి ‘జనరేషన్ ఎక్స్’ మాత్రం నిష్ప్రయోజనకరమైనవిగా భావిస్తుండటం గమనించాల్సిన అంశం.
అసలు ఈ మిలీనియల్స్ ప్రయాణాలపై ఎందుకంతగా వెచ్చిస్తున్నారంటే... ఖర్చు చేసేందుకు చేతిలో అధిక ఆదాయం ఉండడంతోపాటు, అదే సమయంలో బాధ్యతలు తక్కువగా ఉండడమే. సులభంగా రుణాలు పొందగలిగే అవకాశం, చేతిలో క్రెడిట్ కార్డులు వీరికి ఖర్చు విషయంలో కొండంత ధైర్యాన్నిస్తున్నాయి. కానీ, ఇది పూర్తిగా మంచిది కాదని, రుణ ఊబిలో చిక్కుకునే ప్రమాదం ఉందని పాయ్ హెచ్చరించారు.
సంప్రదాయ పాలసీలతోనే ‘బీమా’
జనరేషన్ ఎక్స్ వారు సంప్రదాయ బీమా పాలసీలను ఎక్కువగా ఎంచుకుంటున్నారు. కాకపోతే వీటిని రక్షణ కోసం కాకుండా వీటిని తమ జీవిత లక్ష్యాల కోసం తీసుకోవడం కొంచెం ఆశ్చర్యకరమే. జీవితానికి తగినంత రక్షణ లేకపోగా, అదే సమయంలో వీటితో రాబడులు కూడా తక్కువే ఉంటున్నాయి. ఇక మిలీనియల్స్ టర్మ్ పాలసీలను ఎంచుకునేందుకు సిద్ధంగానే ఉన్నారని పాయ్ పేర్కొన్నారు. కానీ వీరిలో ఇప్పటికీ టర్మ్ పాలసీలపై తగినంత అవగాహన లేదని, సమాచార వినిమయం విషయంలో ఫండమెంటల్‌గా వారిలో మార్పు వస్తే తప్ప సంప్రదాయ, యులిప్ పాలసీలను కొనుగోలు చేసే తప్పిదాలను కొనసాగిస్తూనే ఉంటారని నితిన్ అభిప్రాయపడ్డారు.
ఫైనాన్షియల్ టెక్నాలజీ
‘జనరేషన్ వై’గా పిలిచే మిలీనియన్స్‌కు టెక్నాలజీపై చక్కని అవగాహన ఉంది. స్మార్ట్‌ఫోన్లను వినియోగిస్తూ వీరు అన్ని రకాల లావాదేవీలను ఆన్‌లైన్‌లోనే కానిచ్చేస్తున్నారు. జనరేషన్ ఎక్స్ మాత్రం అంతగా టెక్నాలజీ తెలిసిన వారు కాదు.
ఉద్యోగాలు మారటం ఎక్కువే...
గత దశాబ్దకాలంలో ఉద్యోగాల స్వరూపంలో ఎంతో మార్పు వచ్చింది. మిలీనియల్స్ ఉద్యోగాల విషయంలో కొత్త ధోరణులకు అలవాటు పడేందుకు సిద్ధంగానే ఉన్నారు. ఇంటర్నెట్ ఉద్యోగాలు అధికం కావడంతో వాటికి నిర్ణీత పని ప్రదేశం, పనిగంటలతో సంబంధం లేకుండా పోయిందని నితిన్ వ్యాకరణం పేర్కొన్నారు. దీంతో పని పరిస్థితులను బట్టి 30 ఏళ్లకే రెండు మూడు ఉగ్యోగాలు మారిపోతున్నారు. కానీ, వారి తల్లిదండ్రులైతే తమ జీవిత కాలం మొత్తంలోనే రెండు మూడు ఉద్యోగాలు పరిమితం కావడం గమనార్హం. మారుతున్న ధోరణులకు అనుగుణంగా తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవాలని వ్యాకరణం సూచించారు.
ఎవరీ మిలీనియల్స్?
వయసును బట్టి వ్యక్తుల్ని ఐదు తరాలుగా విభజించచ్చు. వీరిలో తొలితరం సైలెంట్ జనరేషన్. అంటే 1928–1945 మధ్య పుట్టి ఇపుడు 73–90 ఏళ్ల మధ్య వయసున్న వారు. ఇక రెండో ప్రపంచ యుద్ధం తరువాతి రోజుల్లో... అంటే 1946–1964 మధ్య జననాల రేటు బాగా ఎక్కువగా ఉండడంతో అప్పుడు పుట్టి ప్రస్తుతం 54–72 ఏళ్ల వయసున్నవారిని ‘బేబీ బూమర్’ జనరేషన్‌గా పిలుస్తున్నారు.
ఆ తరవాత 1965–80 మధ్య పుట్టినవారు జనరేషన్ ఎక్స్. 1981 నుంచి 1996 మధ్య పుట్టి ప్రస్తుతం 22–37 సంవత్సరాల మధ్యనున్న వారంతా జనరేషన్ వై. అంటే మిలీనియల్స్. ఆర్జనపరులైన వీరి సంఖ్య దేశంలో 44 కోట్ల వరకూ ఉండొచ్చని అంచనా. ఆ తరవాత పుట్టిన ‘జనరేషన్ జెడ్’ ఇపుడిపుడే ఉద్యోగాల్లోకి... సంపాదనలోకి వస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment