
ఆర్థిక స్వేచ్ఛ కూడా
మిలీనియల్స్ టాప్–3 ప్రాధాన్యం వీటికే
ఓ ప్రైవేటు అధ్యయనంలో వెల్లడి
ముంబై: సొంతిల్లు సమకూర్చుకోవడం, వ్యాపారం ప్రారంభించడం, ఆర్థిక స్వేచ్ఛ.. మిలీనియల్స్ (1980–1996 మధ్య జన్మించినవారు) టాప్–3 దీర్ఘకాలిక ప్రాధాన్యతలుగా ఉన్నాయి. ‘ఫైబ్–మిలీనియల్ అప్‌గ్రేడ్ ఇండెక్స్’ నిర్వహించిన అధ్యయనంలో ఈ ఆసక్తికర అంశాలు వెల్లడయ్యాయి. మెట్రోలు, నాన్ మెట్రో పట్టణాల్లో 8,000 మంది వ్యక్తుల అభిప్రాయాలను ఈ అధ్యయనంలో భాగంగా తెలుసుకున్నారు.
ముఖ్యమైన అంశాలు..
→ 30 ఏళ్లలోపు వయసు వారిలో 41 శాతం మంది సొంతంగా ఇల్లు సమకూర్చుకోవడం తమ తొలి లక్ష్యంగా చెప్పారు.
→ ఒంటరి పురుషులతో పోల్చితే, ఒంటరి మహిళల్లో సొంతంగా ఇల్లు కొనుగోలు చేయడం ఎక్కువ ప్రాధాన్య లక్ష్యంగా ఉంది.
→ వ్యాపారం ప్రారంభించడం, దాన్ని వృద్ది చేయడం 21 మంది లక్ష్యంగా ఉంది.
→ దీర్ఘకాలంలో ఆర్థిక స్వేచ్ఛ సాధించడమే తమ లక్ష్యమని 19 శాతం మంది చెప్పారు.
→ ఇక స్వల్పకాల లక్ష్యాలను గమనించినట్టయితే.. వృత్తిలో ఎదుగుదల, కొత్త గ్యాడ్జెట్, వాహనం కొనుగోలు, ఆరోగ్యం విషయంలో దృఢంగా ఉండాలని (కంటి సర్జరీలు, దంత చికిత్సలు తదితర) మిలీనియల్స్ కోరుకుంటున్నారు.
→ పోటీ పెరగడంతో మంచి ఉద్యోగం సంపాదించే విషయంలో మెట్రోల్లోని మిలీనియల్స్ ఎక్కువగా ఆందోళన చెందుతున్నారు. ఇలా భావిస్తున్నవారు 60 శాతంగా ఉన్నారు.
→ తాము పొదుపు చేస్తామని, ఆర్థిక అంశాలకు వ్యూహాత్మకంగా ప్రణాళిక వేసుకుంటామని 39 శాతం మంది చెప్పారు.
→ 21 శాతం మంది ఇతర ఆదాయ వనరుల కోసం అన్వేషిస్తామని చెబితే, దీర్ఘకాల లక్ష్యాల కోసం రుణ సాయం తీసుకుంటామని 29 శాతం మంది తెలిపారు.
→ 15 శాతం మందిలో దీర్ఘకాల ఆర్థిక ప్రణాళిక లేనే లేదు.
→ స్వల్పకాల ఆకాంక్షలను తీర్చుకునేందుకు ఫైనాన్షియల్ ఇనిస్ట్యూషన్స్ నుంచి రుణాలు తీసుకుంటామని చాలా మంది చెప్పారు.
→ ఈ విషయంలో యువతరానికి మార్గదర్శనం అవసరమని ఈసర్వే నివేదిక అభిప్రాయపడింది. బాధ్యతాయుతమైన రుణాల దిశగా వారిని చైతన్యవంతం చేయాలని, తద్వారా తమ రుణ పరపతిని కాపాడుకుంటూనే కలలను సాకారం చేసుకోగలరని పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment