జీఎస్‌టీ... మనకేంటి?
వస్తు సేవల పన్ను. సంక్షిప్తంగా జీఎస్‌టీ. దేశవ్యాప్తంగా అన్ని వస్తువులపైనా, అన్ని రాష్ట్రాల్లో ఒకే విధమైన పన్ను ఉండాలనేది దీని లక్ష్యం. 2006లో కాంగ్రెస్ శ్రీకారం చుట్టిన ఈ పన్ను ఇంకా పార్లమెంటు ఆమోదానికి ఎదురుచూస్తూనే ఉంది. లోక్‌సభ ఆమోదించినా... రాజ్యసభలో ప్రభుత్వానికి బలం లేక ప్రతిపక్ష కాంగ్రెస్ సాయం కోరుతోంది. కాంగ్రెస్ మాత్రం కీలకమైన కొన్ని సవరణలకు పట్టుబడుతోంది. వాటికి అంగీకరించని పక్షంలో బిల్లుకు సహకరించేది లేదంటోంది. కాంగ్రెస్ చేస్తున్న డిమాండ్లలో ప్రధానమైనది...
జీఎస్‌టీ గరిష్ట రేటును 18 శాతానికి పరిమితం చేసి... ఆ మేరకు రాజ్యాంగాన్ని సవరించాలని. ఈ నేపథ్యంలోనే రెండు రోజుల కిందట అకస్మాత్తుగా కేంద్ర ఆర్థిక శాఖ ప్రధాన సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ నేతృత్వంలోని కమిటీ జీఎస్‌టీపై కీలక సిఫారసులు చేసింది. అత్యధిక వస్తువులకు, సేవలకు వర్తించేలా జీఎస్‌టీ ప్రామాణిక రేటును 17-18 శాతానికి పరిమితం చేయాలని సూచించింది. కొన్ని తక్కువ రేటు వస్తువులపై కనిష్టంగా 12 శాతం, లగ్జరీ వస్తువులపై గరిష్టంగా 40 శాతం పన్ను విధించవచ్చని సిఫారసు చేసింది. ఒకరకంగా 17-18 శాతం రేటును ప్రామాణిక రేటుగా పేర్కొనటమంటే కాంగ్రెస్ డిమాండ్‌కు అంగీకరించినట్లే.
కాకపోతే దీన్ని సవరణ ద్వారా రాజ్యాంగంలో చేర్చడానికి మాత్రం ప్రభుత్వం సుముఖంగా లేదు. నిజానికి జీఎస్‌టీ రేటు 23-26 శాతం వద్ద ఉండొచ్చని పలువురు అంచనా వేశారు. వీటన్నిటినీ తల్లకిందులు చేస్తూ 17-18 శాతంగా సిఫారసు చేయటం వల్ల... ఇదే గనక అమల్లోకి వస్తే చాలా రేట్లు తగ్గే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ప్రస్తుతం అధికశాతం వస్తువులపై, కొన్ని వస్తు సేవలపై కేంద్ర, రాష్ట్రాలు కలిసి 29 శాతం వరకూ పన్ను విధిస్తున్నాయి.
తాజా సిఫారసులు అమలైతే అది 17-18 శాతానికి దిగి వస్తుంది. ఆ మేరకు వస్తు, సేవల ధరలు తగ్గుతాయి. వస్తువుల ఉత్పత్తి వ్యయం తగ్గటంతో విదేశాలకు ఎగుమతులు పెరుగుతాయి. ధరలు తగ్గితే మరింత మంది వాటిని అందుకుంటారు కనక ఈ చర్య ఆర్థిక రంగానికి ఊతమిస్తుంది. ఈ నేపథ్యంలో అసలు జీఎస్‌టీ దేనిపై విధిస్తారు? అది వస్తే ఏఏ పన్నులు తొలగిపోతాయి? సామాన్యులకు లాభమా.. నష్టమా? ఇవన్నీ వివరించేదే ఈ ‘ప్రాఫిట్ ప్లస్’ ప్రత్యేక కథనం...
- సాక్షి, పర్సనల్ ఫైనాన్స్ విభాగం
* ప్రామాణిక రేటును 18 శాతంగా సిఫారసు చేసిన కమిటీ
* అదే అమలైతే హోటల్ బిల్లులతో సహా పలు బిల్లుల తగ్గుదల
* కొన్ని సేవలపై పన్నులు పెరగొచ్చు
* కనిష్ట రేటు 12% గరిష్ట రేటు 40%గా పేర్కొంటూ సిఫారసులు
* ప్రస్తుతం పెట్రోలు సహా పలు ఉత్పత్తులపై భారీ పన్నులు
* ఇవి అమల్లోకి వస్తే నష్టపోనున్న రాష్ట్రాలు.. రాష్ట్రాలకు వెసులుబాటిస్తే ఈ చట్టమే వృథా!?
దేశ వ్యాప్తంగా ఒకే ధర...
ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఒకేరకమైన పన్నులుంటాయి. కానీ మన దేశానికి వచ్చేసరికి ఈ పరిస్థితి లేదు. ఆయా రాష్ట్రాలు తమ ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా పన్నులు విధించుకుంటున్నాయి. దీనికి చక్కటి ఉదాహరణ పెట్రోల్, డీజిల్ ధరలే. కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో లీటరు పెట్రోల్ ధర రూ.57.64 ఉంటే, ఢిల్లీలో రూ. 60.48గా ఉంది. అదే హైదరాబాద్‌కు వచ్చేసరికి రూ. 65.48గా, ఆంధ్రప్రదేశ్ రాజధాని విజయవాడలో రూ. 66.68గా ఉన్నాయి. మహారాష్ట్రలో పప్పు దినుసులు, బియ్యంపై పన్ను లేదు. కానీ తమిళనాడులో ఇది 1 శాతంగా ఆంధ్రప్రదేశ్‌లో 5 శాతంగా ఉంది.
ఒక వస్తువు ధర రాష్ట్రం మారినప్పుడల్లా మారడానికి కారణం ఆయా రాష్ట్రాలు విధిస్తున్న పన్నులే. దేశంలో ఏ మూలకెళ్లినా వస్తువుల ధరలు ఒకే విధంగా ఉంచే విధంగా ఏకీకృత పన్నుల విధానాన్ని అమలు చేయడమే జీఎస్‌టీ ముఖ్య ఉద్దేశం. అంతేకాదు! పన్నులను తగ్గించడం వల్ల జాతీయోత్పత్తి కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎలాగంటే పన్నులు తగ్గిస్తే ధరలు దిగివస్తాయి. దానివల్ల ప్రజల్లో కొనుగోలు శక్తి పెరుగుతుంది. పన్నులు తక్కువగా ఉంటే పోటీని సమర్థవంతంగా తట్టుకొని దేశీయ కంపెనీలు ఎగుమతులు కూడా పెంచుకునే అవకాశముంటుంది.
అంతేకాక విదేశీ కంపెనీలు కూడా ఇక్కడే తయారీ యూనిట్లను నెలకొల్పడానికి ముందుకొస్తాయి. దీనివల్ల దేశ స్థూల జాతీయోత్పత్తి గణనీయంగా పెరుగుతుందని అంచనా. ఒకసారి దేశంలో జీఎస్‌టీ అమల్లోకి వస్తే దేశ జీడీపీ 1.5 శాతం నుంచి రెండు శాతం పెరుగుతుందని, ఎగుమతుల ద్వారా 15 బిలియన్ డాలర్ల అదనపు ఆదాయం సమకూరుతుందనేది నిపుణుల అంచనా.
ధరలెందుకు తగ్గుతాయి?
ప్రస్తుతం మన పన్నుల వ్యవస్థలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాల పన్నులు విధిస్తున్నాయి. కేంద్రం వ్యాట్, ఎక్సైజ్, కస్టమ్ సుంకాలు, కౌంటర్‌వీలింగ్ డ్యూటీలు (సీవీడీ), సర్వీస్ ట్యాక్స్‌లతో పాటు సర్ చార్జీలు, వివిధ రకాల సుంకాలను వేస్తుంటే, రాష్ట్రాలు అమ్మకం పన్ను, రాష్ట్ర వ్యాట్, వినోద, విలాస పన్నులు, అక్ట్రాయ్ వంటివి విధిస్తున్నాయి.
ఇలా చెల్లించిన పన్నులపైనే పరోక్షంగా పన్నులు చెల్లించాల్సి రావడంతో వస్తువుల ధరలు పెరుగుతున్నాయి ఒకసారి జీఎస్‌టీ అమల్లోకి వస్తే కస్టమ్స్ మినహా కేంద్రం విధిస్తున్న పన్నులన్నీ దీన్లో కలుస్తాయి. అలాగే రాష్ట్రం విధిస్తున్న వివిధ పన్నులూ దీన్లో విలీనమవుతాయి. దీంతో పన్నుపైన పన్ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు ధరలు తగ్గుతాయి.
కంపెనీలకు లాభమా? నష్టమా?
జీఎస్‌టీ అమల్లోకి వస్తే కంపెనీలకు నిర్వహణా వ్యయం బాగా తగ్గుతుంది. ఇప్పుడు చాలా కంపెనీలు కేంద్ర అమ్మకం పన్నును తప్పించుకోవడానికి ప్రతీ రాష్ట్రంలోనూ గిడ్డంగులను ఏర్పాటు చేసుకుంటున్నాయి. జీఎస్‌టీ అమల్లోకి వస్తే ఈ అవసరం ఉండదు. కంపెనీలు వ్యూహాత్మక ప్రాంతంలో ఒకేచోట భారీ గిడ్డంగులను ఏర్పాటు చేసుకొని అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు సరుకును రవాణా చేస్తాయి.
దీనివల్ల గిడ్డంగుల నిర్వహణ భారం గణనీయంగా తగ్గుతుంది. అలాగే కంపెనీలు పన్ను భారం తక్కువ ఉన్న ప్రాంతాల్లో గిడ్డంగులు ఏర్పాటు చేసుకొని దొంగతనంగా పక్క రాష్ట్రాలకు విక్రయించడాలు కూడా ఆగిపోతాయి. ఇలా పన్నులు ఎగ్గొట్టే వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకుంటున్న చెక్‌పోస్టుల అవసరం ఉండదు. అలాగే ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ లభిస్తుంది కనుక విదేశీ కంపెనీలూ ఇక్కడ తయారీ యూనిట్లు పెట్టడానికి వస్తాయి.
10 శాతం పన్నును లెక్కలోకి తీసుకొని జీఎస్‌టీకి ముందు, జీఎస్‌టీ వచ్చాక వస్తువు ధరలు ఏ విధంగా ఉంటాయో చూద్దాం..సామాన్యుడికి ఊరట..!
సుబ్రమణ్యన్ కమిటీ సిఫార్సుల ప్రకారం చూస్తే జీఎస్‌టీలో పన్ను శ్లాబుల్ని మూడు రకాలుగా వర్గీకరించినట్లు కనిపిస్తోంది. నిత్యావసర వస్తువులను 12 శాతం బ్రాకెట్‌లోకి, ఇతర వస్తువులపై 17-18 శాతం విధించాలని సూచించింది. అలాగే ఆరోగ్యానికి హాని చేసే పొగాకు ఉత్పత్తులు, పాన్ మసాలాలు, కూల్‌డ్రింక్స్ వంటి వాటితో పాటు విలాసవంతమైన కార్లు, ఇతర లగ్జరీ వస్తువులపై 40 శాతం గరిష్ఠ పన్ను పరిధిలోకి తీసుకురానున్నారు.
ఇవే రేట్లు కనుక అమల్లోకి వస్తే నిత్యావసర వస్తువుల ధరలు గణనీయంగా తగ్గడం ద్వారా సామాన్యుడికి పెద్ద ఊరట లభిస్తుందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అన్ని వస్తువులపై సగటున 29 శాతం పన్నులు చెల్లిస్తున్నారని, ఇప్పుడది గణనీయంగా తగ్గి సామాన్యుడి జేబులోకి డబ్బులొస్తాయని ట్యాక్సేషన్ నిపుణులు పి.వి.సుబ్బారావు తెలిపారు. ఉదాహరణకు ఇపుడు ఆల్కహాల్‌పై 190 శాతం వరకూ పన్ను ఉంది. పెట్రోల్‌పై కూడా భారీ పన్నులున్నాయి. ఇవి గరిష్ఠ బ్రాకెట్ 40 శాతంలోకి వచ్చినా ధరలు భారీగా తగ్గుతాయని చెప్పొచ్చు.
కొన్ని సర్వీసులు ప్రియం
జీఎస్‌టీ ప్యానెల్ ప్రతిపాదనల ఆధారంగా జీఎస్‌టీ బిల్లు ఆమోదం పొందితే టెలిఫోన్, బ్యాంకింగ్‌లో పొందే సేవలు ఖరీదవుతాయి. ప్రస్తుతం ఈ సేవలపై 14.5 శాతం పన్ను రేటు ఉంది. దేశవ్యాప్తంగా ఏకీకృత పన్ను రేటును 17-18 శాతంగా ఉంచాలని ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రహ్మణ్యన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ జీఎస్‌టీ ప్యానెల్ ప్రతిపాదించింది. అ మేరు ఈ సేవల ధరలు పెరుగుతాయి. వచ్చే నెల ఏప్రిల్ 1 నుంచి జీఎస్‌టీని అమల్లోకి తేవాలని ప్రభుత్వం యోచిస్తోంది.
1994లో సర్వీస్ ట్యాక్స్‌ను ప్రభుత్వం ప్రవేశం పెట్టింది. అప్పుడు సర్వీస్ ట్యాక్స్ 5 శాతంగానే ఉండేది, పరిమితమైన సేవలపైనే ఈపన్ను ఉండేది. ఇప్పుడు ఇది 14 శాతానికి పెరిగింది. కొన్ని మినహాయింపులు తప్ప దాదాపు అన్ని సేవలపైనే ఈ పన్ను ఉంది. స్వచ్ఛ భారత సెస్‌ను కూడా కలుపుకుంటే ఇది 14.5 శాతానికి పెరిగింది. కాగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అధ్యక్షతన గల జీఎస్‌టీ కౌన్సిల్ తుది జీఎస్‌టీ రేట్‌ను నిర్ణయిస్తుంది.
రాష్ట్రాలు ఒప్పుకుంటాయా?...
మన దేశంలో చాలా రాష్ట్రాలకు పెట్రో ఉత్పత్తులు, ఆల్కహాల్ ఉత్పత్తులపై వేస్తున్న పన్నులే ప్రధాన ఆదాయ వనరుగా ఉన్నాయి. జీఎస్‌టీ నుంచి వీటిని తప్పించాలని రాష్ట్రాలు డిమాండ్ చేస్తున్నాయి. కానీ సుబ్రమణ్యన్ కమిటీ వీటిని కూడా జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇదే జరిగితే రాష్ట్రాలు ఆదాయాన్ని గణనీయంగా నష్టపోతాయి. ఎందుకంటే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోఆల్కహాల్‌పై 190 శాతం వరకు పన్ను ఉంది.
కానీ జీఎస్‌టీలో గరిష్ట పన్ను 40 శాతం మించి లేదు. మరి ఈ స్థాయిలో ఆదాయాన్ని కోల్పోవడానకి రాష్ట్రాలు సిద్ధపడతాయా అన్నది ప్రధాన సమస్య. జీఎస్‌టీ బిల్లు అమల్లోకి రావాలంటే 29 రాష్ట్రాల్లో కనీసం 15 రాష్ట్రాల అసెంబ్లీలు ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ జీఎస్‌టీ అమల్లోకి వచ్చినా కొన్ని వస్తువులపై ఆయా రాష్ట్రాలు పన్నులు విధించుకోవడానికి అవకాశాన్ని కల్పిస్తే అసలు జీఎస్‌టీ ఉద్దేశమే దెబ్బ తింటుంది.
దీంతో జీఎస్‌టీ అమల్లోకి వచ్చినా తగ్గింపు ప్రయోజనాన్ని వినియోగదారులు పొందలేరు. గతంలో వ్యాట్ అమలైన ప్పటి అనుభవాలే పునరావృతమయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి జీఎస్‌టీని ప్రభుత్వాలు ఎంత నిబద్ధతతో అమలు చేస్తాయన్నది రానున్నకాలంలో తెలుస్తుంది.