తిరోగమనం!
స్పెషల్స్ ఫుల్.. రెగ్యులర్ డల్
బస్సులకూ అరకొర రద్దీ
కానరాని ప్రయాణికుల కిటకిట
విశాఖపట్నం: ఈ ఏడాది సంక్రాంతికి విచిత్ర పరిస్థితి నెలకొంది. నాలుగు రోజుల పండగ సెలవుల అనంతరం బస్సులు, రైళ్లు కిటకిటలాడతాయనుకున్న పరిస్థితికి భిన్న వాతారణం కనిపిస్తోంది. తిరుగు ప్రయాణంలో జనం అంతగా కనిపించడం లేదు. వాస్తవానికి ఏటా సంక్రాంతి పండగకు విశాఖకు వచ్చే వారు దాదాపు రెండున్నర లక్షల మంది, వెళ్లే వారు మాత్రం అంతకు రెట్టింపు ఉంటారని ఓ అంచనా. ఇందుకనుగుణంగానే ఇటు ఆర్టీసీ, అటు రైల్వే శాఖలు ప్రత్యేక బస్సులు, రైళ్లను నడుపుతోంది. ఈ ఏడాది కూడా అలాంటి ఏర్పాట్లే చేశాయి. గురు, శుక్ర, శని వారాలు పండగ దినాలు, ఆదివారం సెలవు రోజు. దీంతో సోమవారం నుంచి పిల్లలు బడులు, కాలేజీలు, ఉద్యోగుల కార్యాలయాలకు వెళ్తారన్న భావనతో ఆదివారం రద్దీ విపరీతంగా ఉంటుందని లెక్కలేశారు. ఆర్టీసీ ఈ సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 8 నుంచి హైదరాబాద్‌కు 115, రాజమండ్రి, కాకినాడలకు 20 చొప్పున, విజయవాడకు 15, శ్రీకాకుళం, పలాస, టెక్కలి, బొబ్బిలి, సాలూరు, పార్వతీపురం ప్రాంతాలకు 40, పాలకొండ, రాజాంలకు 50 సర్వీసులను అదనంగా (50 శాతం అదనపు చార్జీతో) తిప్పుతోంది. వీటితో పాటు రెగ్యులర్ సర్వీసులనూ కొనసాగిస్తోంది. వీటికి ఎంతో డిమాండ్ ఉంటుందని భావించింది. కానీ సాదాసీదా డిమాండే తప్ప అనూహ్య రద్దీ కనిపించడం లేదు. ఆదివారం తిరుగు ప్రయాణంలో వెళ్లే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుందని ఆర్టీసీ 70 సర్వీసులను నడిపింది. ఇందులో 65 హైదరాబాద్‌కే కేటాయించింది. మిగిలిన వాటిలో 4 చెన్నైకి, ఒకటి బెంగుళూరుకు పంపింది. కానీ బస్ కాంప్లెక్స్‌ల్లో మోస్తరు జనమే కనిపించారు. ముందస్తు రిజర్వేషన్లు చేయించుకున్న వారి హడావుడే అధికంగా ఉంది. సోమవారం కూడా హైదరాబాద్‌కు 20 బస్సులను నడుపుతోంది.
రైళ్లలో సాధారణ రద్దీ..
మరోవైపు రైళ్లలోనూ ఆదివారం ఊహించినంత రద్దీ కనబడలేదు. ఆదివారం ఉదయం విశాఖ నుంచి హైదరాబాద్ బయల్దేరే జన్మభూమి ఎక్స్‌ప్రెస్ కోసం ఒకింత జనం ఎగబడ్డారు. మధ్యాహ్నం రత్నాచల్, హౌరా-చెన్నై, హౌరా-ముంైబె , సాయంత్రం గోదావరి ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఖాళీగా ఉండడం విశేషం. మామూలు రోజుల్లోనే గోదావరి, రత్నాచల్ ఎక్స్‌ప్రెస్‌ల కోసం ప్రయాణికులు చాంతాడంత క్యూలైన్లలో నిలబడతారు. కానీ ఆదివారం అలాంటి పరిస్థితే తలెత్తలేదు. రైల్వేశాఖ ముందస్తుగా వేసిన ప్రత్యేక రైళ్లలో రిజర్వేషన్లు చేయించుకున్న వారితో విశాఖ రైల్వేస్టేషన్ సందడి నెలకొంది.
ఈ రైళ్లలో వెళ్లడానికి ప్రయాణికులు ఆసక్తి చూపారు. సంక్రాంతిని దృష్టిలో ఉంచుకుని ఈ నెల 26 వరకు విశాఖ మీదుగా వివిధ ప్రాంతాలకు 47 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. సోమవారం విశాఖ నుంచి వెళ్లే వారి ప్రయాణికుల సంఖ్య ఆశాజనకంగా ఉంటుందని రైల్వే వర్గాలు అంటున్నాయి.