ధనాధన్..
- దీపావళికి గ్రేటర్‌లో పెరిగిన శబ్ద కాలుష్యం
- అత్యధికంగా ప్రగతినగర్‌లో 85 డెసిబుళ్లు నమోదు
- వివరాలు సేకరించిన పీసీబీ
- వాయు కాలుష్యంలో మనది మూడో స్థానం
సాక్షి, సిటీబ్యూరో/సనత్‌నగ ర్: దీపావళి ఢాం..ఢాం శబ్దాలు సిటీజనుల గూబ గుయ్‌మనిపించాయి. గత ఏడాదితో పోలిస్తే మహానగరంలో శబ్ద కాలుష్య స్థాయి నాలుగు డెసిబుళ్లు అధికంగా నమోదైంది. నివాస, పారిశ్రామిక, వాణిజ్య ప్రాంతాల్లో దీపావళి రోజున వెలువడిన శబ్ద కాలుష్య ప్రమాణాలను కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) శుక్రవారం విడుదల చేసింది.
అబిడ్స్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, తార్నాక, ప్యారడైజ్, జీడిమెట్ల, జూ పార్క్, పంజగుట్ట, జూబ్లీహిల్స్, ప్రగతినగర్, ఉప్పల్ ప్రాంతాల్లో కంటిన్యూ యాంబియంట్ సౌండ్ మెజర్‌మెంట్ పరికరాల ద్వారా దీపావళి రోజున (గురువారం) సాయంత్రం 6 నుంచి మరుసటి రోజు (శుక్రవారం) ఉదయం 6 గంటల వరకు ధ్వని కాలుష్య ప్రమాణాలను నమోదు చేశారు. నివాస ప్రాంతాల్లోనే టపాసుల మోతతో ఎక్కువ శబ్దాలు వెలువడినట్లుగా పీసీబీ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
నగర శివారుల్లోని ప్రగతినగర్ (కూకట్‌పల్లి జేఎన్‌టీయూ ఎదురుగా)లో అత్యధికంగా 85.5 డెసిబుళ్ల ధ్వని కాలుష్యం నమోదైంది. అబిడ్స్‌లోనూ ఈసారి బాణసంచా పేలుళ్లు 82 డెసిబుళ్ల శబ్దంతో శ్రుతిమించాయి. సాధారణంగా 55 డెసిబుళ్ల కంటే అధిక శబ్దాలు వింటే మనుషులు వినికిడి శక్తిని కోల్పోయే ప్రమాదం ఉంది. కానీ నగరంలోని వివిధ ప్రాంతాల్లో టపాసుల మోతతో శబ్ద కాలుష్యం అంతకంటే అధికంగా నమోదైంది.
ఉప్పల్‌లో 77.6 డెసిబుళ్లు, ప్యారడైజ్, పంజగుట్ట, కూకట్‌పల్లిలో 69 డెసిబుళ్లు, జీడిమెట్లలో 60, జూ పార్క్‌లో 56, తార్నాక, జూబ్లీహిల్స్‌లో 53, గచ్చిబౌలిలో 52 డెసిబుళ్లశబ్ద కాలుష్యం నమోదైంది. గత ఏడాది దీపావళి రోజున గ్రేటర్ పరిధిలో సగటున 71 డెసిబుళ్ల ధ్వని కాలుష్యం నమోదు కాగా.. ఈసారి 75 డెసిబుళ్లకు చేరుకుంది. అంటే నాలుగు డెసిబుళ్లు పెరిగిందన్నమాట.
వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో పేలని టపాసులు
పీసీబీ గణాంకాలను బట్టి చూస్తే వాణిజ్య ప్రాంతాల్లో దీపావళి టపాసుల మోత అంతగా లేదని తేలింది. అబిడ్స్ మినహా మిగిలిన వ్యాపార, వాణిజ్య ప్రాంతాల్లో శబ్ద కాలుష్య ప్రమాణాలు మోస్తరుగానే నమోదయ్యాయి. ప్యారడైజ్ ప్రాంతంలో గత ఏడాది సగటున 82 డెసిబుల్స్ నమోదు కాగా, ఈసారి 69కి తగ్గింది. పంజగుట్ట చౌరస్తాలో సైతం శబ్ద కాలుష్యం తక్కువగానే నమోదైనట్లు పీసీబీ గణాంకాలు చెబుతున్నాయి. పారిశ్రామిక ప్రాంతమైన ఉప్పల్‌లో రెండు డెసిబుల్స్ తగ్గింది. గత ఏడాది సగటున 79 డెసిబుల్స్ ఉండగా, ఈ ఏడాది 77.6కు తగ్గింది.
నిశ్శబ్ద జోన్‌లలోనూ మోత
నిశ్శబ్ద మండలం (సెలైంట్ జోన్)గా పరిగణించే గచ్చిబౌలి, జూ పార్క్ ప్రాంతాల్లో సాధారణంగా ధ్వని కాలుష్యం రాత్రి వేళల్లో 40 డెసిబుళ్లు మించరాదు. దీపావళి రోజున జూ పార్క్ వద్ద 56, గచ్చిబౌలిలో 52 డెసిబుళ్ల శబ్ద కాలుష్యం నమోదవడం గమనార్హం. ఈ మోతతో జూ పార్క్, గచ్చిబౌలి ప్రాంతాల్లో ఉన్న వన్యమృగాల జీవనశైలిలో పెనుమార్పులు వచ్చే ప్రమాదం ఉందని వెటర్నరీ వైద్యులు అభిప్రాయ పడుతున్నారు.
మనది మూడో స్థానం
మెట్రో నగరాలతో పోలిస్తే వాయు కాలుష్యంలో గ్రేటర్ నగరం మూడో స్థానంలో నిలుస్తోంది. దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం సాధారణ రోజులతో పోలిస్తే తొమ్మిది రెట్లు పెరిగిందని వాతావరణ శాఖ అంచనా. బాణసంచా పేలుళ్లతో నైట్రోజన్ డై ఆక్సైడ్,సల్ఫర్ డైఆక్సైడ్ వాయువులు గాలిలో విపరీతంగా కలిసిపోయాయి. ఊపిరితిత్తులకు పొగబెట్టే ఈ కాలుష్య కారకాలు ఒక క్యూబిక్ మీటరు గాలిలో సుమారు 531 మైక్రోగ్రాములకు చేరడం గమనార్హం. చెన్నైలో క్యూబిక్ మీటరు గాలిలో కాలుష్య కారకాలు 320 మైక్రోగ్రాములు, గ్రేటర్‌లో క్యూబిక్ మీటరు గాలిలో 302 మైక్రోగ్రాములు, బెంగళూరులో 239 మైక్రోగ్రాములకు చేరినట్లు అంచనా వేస్తున్నాయి. వాయు కాలుష్య కారకాల వారీగా పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తామని తెలిపాయి.