‘బ్యాండ్’ పడుతోంది...
రాజధానిలో బారాత్‌లపై ఆంక్షలు
- శబ్ద కాలుష్యం కలిగిస్తే ఊచలే
- సాదాసీదాగా రాత్రి 10లోపే ముగించాలి
- డప్పు కళాకారులకు సంకటం
హైదరాబాద్: చిలకలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ యువకుడి పెళ్లి సందర్భంగా సీతాఫల్‌మండి చౌరస్తా నుంచి డప్పువాయిద్యాలతో బారాత్ తీసేందుకు సిద్ధ మయ్యారు. డప్పు మోగకముందే పోలీసులొచ్చారు. డప్పు కళాకారులను హెచ్చరించడంతో వధూవరుల ను రోడ్డుపైనే వదిలేసి∙వారు ఉడాయించారు. మరు సటి రోజు సదరు యువకుడు పోలీసుల అనుమతి తీసుకొని సాదాసీదాగా బారాత్ చేసుకోవాల్సి వచ్చిం ది. అదీ ఇతరులకు ఇబ్బంది కలుగకుండా రాత్రి 10 గంటల్లోపే.. ఇలాంటి పరిస్థితులు సీతాఫల్‌మండి లోనే కాదు నగరంలోని బారాత్ నిర్వాహకులందరికీ ప్రాణ సంకటంగా మారింది.
పోలీసులొచ్చాక చూద్దాం అని డప్పు మోగిస్తే కేసులు నమోదు చేస్తు న్నారు. పేరుకు పెట్టీ కేసులే అయినా 2–4 రోజులు జైలు శిక్ష అనుభవించాల్సి వస్తోంది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో నిషేధాజ్ఞలు పెళ్లి సందడిపై ప్రభావం చూపుతున్నాయి. డీజేలపై కొంతకాలం నుంచే ఆంక్షలుండగా తాజాగా డప్పు కళాకారులకూ పోలీసు నిబంధనలు ప్రాణ సంకటంగా మారాయి. బారాత్ బాజా మోగిందో కటకటాల పాలవడం ఖాయమైపోతోంది. అట్టహాసం సంగతి పక్కన పెట్టి నాలుగు డప్పులు మోగించి నా పోలీసులు న్యూ సెన్స్, శబ్ద కాలుష్యం కేసులు నమోదు చేస్తున్నారు. బారాత్ నిర్వాహకులపై కేసులు నమోదు చేసి జైలుకు తరలిస్తున్నారు. దీంతో పోలీసు పర్మిషన్ లేనిదే వాయించేది లేదంటున్నారు.
ఉత్తర మండలంలో 300 మంది..
వివాహాలు చేసుకునే వారి గుండెల్లో తాజాగా సిటీ పోలీస్ యాక్టు 49 మోగుతోంది. పోలీసుల అనుమతి లేకుండా బారాత్‌లు, ఫంక్షన్ ప్యాలెస్‌లలో ఎక్కువ శబ్దంతో ప్రజలకు ఇబ్బంది కలిగించారని ఉత్తర మం డలం పరిధిలోని 11 పోలీస్‌స్టేషన్ల పరిధిలో 300 మం దిపై పెట్టీ కేసులు నమోదయ్యాయి. వీరంతా 2–5 రోజులు జైలు శిక్ష అనుభవించారు. దీంతో పోలీసుల అనుమతి కోసం ఏసీపీ కార్యాలయం చుట్టూ తిరగటం కన్నా బారాత్, సౌండ్స్ లేకపోవడమే మంచిదని కొందరు మిన్నకుంటున్నారు.
పోలీసులు అంటున్నారిలా..
నాలుగు డప్పులు పెట్టి నలుగురితో ఊరే గింపు తీసినా అనుమతి తీసుకోవాల్సిందేనని పోలీ సులు అంటున్నారు. ఇతరులకు ఇబ్బంది కలిగిం చకుండా రాత్రి 10 లోపే బారాత్ ముగిస్తామనే షర తులకు ఒప్పుకుని వారు నివసించే ప్రాంతంలోని ఏసీపీ కార్యాలయం నుంచి అనుమతి తీసుకోవా లంటున్నారు. ఉద్దేశపూర్వకంగా కేసులు నమోదు చేయడం లేదని, ప్రజలు ఫిర్యాదు చేస్తేనే బాధ్యులను అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్నామని చెబుతున్నారు.