
సాక్షి, న్యూఢిల్లీ: కారులో ఒక్కరే ప్రయాణిస్తున్నప్పటికీ తప్పనిసరిగా మాస్క్ ధరించాలని బుధవారం ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వాహనం బహిరంగ ప్రదేశాల మీదుగా వెళితే, ఇతరులను వైరస్‌కు బహిర్గతం చేసే ప్రమాదం ఉందని కోర్టు పేర్కొంది. మాస్క్ ధరించకుండా తమ కార్లలో ఒంటరిగా వాహనం నడుపుతున్నవారికి జరిమానా విధించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై జస్టిస్ ప్రతిభ ఎం. సింగ్ నేతృత్వంలోని ఏకసభ్య ధర్మాసనం ఈ తీర్పును ఇచ్చింది. ఈ పిటిషన్లకు ఏమాత్రం యోగ్యత లేదని కోర్టు కొట్టివేసింది.
పిటిషనర్లలో ఒకరైన అడ్వకేట్ సౌరభ్ శర్మ ఇటీవల తన సొంత కారులో ఒంటరిగా డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మాస్క్ ధరించలేదని అధికారులు రూ.500 జరిమానా విధించారు. దీనికి ఆయన రూ .10 లక్షల పరిహారం కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఢిల్లీ విపత్తు నిర్వహణ అథారిటీ (డీడీఎంఎ) మార్గదర్శకాల ప్రకారం మాస్క్‌ను బహిరంగ ప్రదేశంలోను, పని చేసే ప్రదేశంలో ధరించాలని మాత్రమే ఉందని పిటిషనర్ వాదించారు. వాహనంలో ఒంటరిగా ప్రయాణించేటప్పుడు మాస్క్ ధరించాలని మార్గదర్శకాలను జారీ చేయలేదని కేంద్రం జనవరిలో ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. అయితే, ఈ వ్యవహారంలో వ్యక్తిగత లేదా అధికారిక వాహనంలో ప్రయాణించే ప్రతీ ఒక్కరు తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాలని గైడ్‌లైన్స్‌లో స్పష్టంగా ఉందని ఢిల్లీ హైకోర్టుకు ఇటీవల ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment